హంగ్జౌ: వరుసగా నాలుగో రోజు తమ పతకాల వేటను కొనసాగిస్తూ ఆసియా పారా క్రీడల్లో భారత బృందం కొత్త చరిత్ర సృష్టించింది. ఈ క్రీడల చరిత్రలో అత్యధిక పతకాలను సొంతం చేసుకుంది. 2018 జకార్తా ఆసియా పారా క్రీడల్లో భారత్ అత్యధికంగా 72 పతకాలను దక్కించుకోగా... హాంగ్జౌలో నాలుగో రోజు పోటీలు ముగిసేసరికి భారత బృందం 18 స్వర్ణాలు, 23 రజతాలు, 41 కాంస్యాలతో కలిపి 82 పతకాలతో ఎనిమిదో స్థానంలో ఉంది.
మరో రెండు రోజులపాటు కొనసాగే ఈ క్రీడల్లో ఈసారి భారత్ పతకాల్లో ‘సెంచరీ’ని దాటే అవకాశముంది. గురువారం భారత్‌కు మూడు స్వర్ణాలు, మూడు రజతాలు, 12 కాంస్యాలతో కలిపి మొత్తం 18 పతకాలు వచ్చాయి. అథ్లెటిక్స్‌లో పురుషుల ఎఫ్46 కేటగిరీ షాట్‌పుట్ ఈవెంట్‌లో సచిన్ సర్జేరావు ఖిలారి ఇనుప గుండును 16.03 మీటర్ల దూరం విసిరి స్వర్ణ పతకాన్ని గెల్చుకున్నాడు.
అనంతరం ఆర్6 మిక్స్‌డ్ 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ ఎస్‌హెచ్1 విభాగంలో భారత షూటర్ సిద్ధార్థ బాబు 247.7 పాయింట్లు స్కోరు పసిడి పతకాన్ని సాధించాడు. ఆర్చరీలో శీతల్ దేవి–రాకేశ్ కుమార్ జోడీ కాంపౌండ్ మిక్స్‌డ్ ఈవెంట్‌లో 151–149తో లిన్ యుషాన్–అయ్ జిన్‌లియాంగ్ (చైనా) జంటపై నెగ్గి బంగారు పతకాన్ని దక్కించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment