కోల్‌కతా: భారత్ తరఫున మూడు ఫార్మాట్‌లలో కలిపి 180 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ 184 వికెట్లు తీయడంతో పాటు 1,712 పరుగులు కూడా సాధించాడు. ఇప్పుడు ఇంగ్లండ్‌తో జరగబోయే టి20 సిరీస్ కోసం అతను తొలిసారి వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. సుదీర్ఘ కాలం పాటు తనదైన బౌలింగ్, బ్యాటింగ్ శైలిని పోలిన రవీంద్ర జడేజా నీడలోనే ఉండిపోయిన అతను... ఇటీవలే కొన్ని అత్యుత్తమ ప్రదర్శనలతో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్నాడు.
దాదాపు 11 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌లో ఎంతో సాధించానని, ఇప్పుడు కొత్తగా తనను తాను నిరూపించుకోవాల్సిన అవసరం లేదని అక్షర్ పటేల్ వ్యాఖ్యానించాడు. ‘భారత జట్టుకు సంబంధించి మూడు ఫార్మాట్‌లలో సంధి దశ నడుస్తోందనేది వాస్తవం. అయితే దీనిపై సెలక్టర్లే నిర్ణయం తీసుకుంటారు. నాకు సంబంధించి నేను కొత్తగా నిరూపించుకోవాల్సింది ఏమీ లేదు. అప్పగించిన పనిని సమర్థంగా చేయడమే నాకు తెలుసు. అలా చేస్తే చాలు జట్టులో స్థానం గురించి చింతించాల్సిన అవసరం ఉండదు.
ఫార్మాట్ ఏదైనా అవకాశం లభించిన ప్రతీసారి ఆటను మెరుగుపర్చుకుంటూ ఉత్తమ ప్రదర్శన ఇస్తాను. జట్టులో నా స్థానం గురించి ఎప్పుడూ ఆందోళన చెందను’ అని అతను అన్నాడు. తాజాగా వైస్ కెప్టెన్సీతో కొంత బాధ్యత పెరిగిందనేది మాత్రం వాస్తవమని అక్షర్ అభిప్రాయపడ్డాడు.
‘టీమ్ నాయకత్వ బృందంలో నాకు కూడా అవకాశం దక్కడం సంతోషం. దీని వల్ల బాధ్యత మరింత పెరుగుతుంది. మన టి20 జట్టు స్థిరంగా ఉంది కాబట్టి కొత్తగా అనూహ్య నిర్ణయాలేమీ ఉండవు. అయితే మైదానంలో వేగంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది’ అని అతను చెప్పాడు. భారత జట్టులో ఓపెనర్లకు మాత్రమే వారి స్థానాల విషయంలో స్పష్టత ఉంటుందని, మూడు నుంచి ఏడో స్థానం వరకు బ్యాటర్లు ఎక్కడైనా ఆడేందుకు సిద్ధంగా ఉండాలని అతను అభిప్రాయ పడ్డాడు.
‘ఏడాది కాలంగా ఇది కొనసాగుతోంది. 3–7 బ్యాటర్లు మ్యాచ్‌లో ఆ సమయంలో ఉన్న పరిస్థితిని బట్టి ఎక్కడైనా ఆడాల్సి ఉంటుంది. దీని గురించి ఆటగాళ్లందరికీ ఇప్పటికే చెప్పేశాం’ అని పటేల్ వెల్లడించాడు. మరోవైపు ఆస్ట్రేలియాతో సిరీస్ కోసం జట్టులో తాను ఎంపిక కాకపోవడంపై ఎలాంటి నిరాశ కలగలేదని... 15 మందిని ఎంపిక చేస్తారని, తనకు చోటు దక్కకపోవడం పెద్ద విషయం కాదని అక్షర్ స్పష్టం చేశాడు. ఆ సిరీస్‌లో భారత జట్టు ప్రదర్శన గురించి ఇప్పుడు చర్చ అనవసరమని, ఇప్పుడు కొత్తగా మళ్లీ మొదలు పెడుతున్నామని ఈ గుజరాత్ ఆల్‌రౌండర్ వ్యాఖ్యానించాడు.
Comments
Please login to add a commentAdd a comment