IPL 2022: Axar Patel Reveal Interesting Story Behind Spelling His Name - Sakshi
Sakshi News home page

IPL 2022: అక్షర్‌ పటేల్‌ .. పేరు వెనుక ఇంత పెద్ద కథ దాగుందా!

Published Tue, Apr 12 2022 5:41 PM | Last Updated on Tue, Apr 12 2022 7:39 PM

IPL 2022 Axar Patel Reveal Interesting Story Behind Spelling His Name - Sakshi

టీమిండియా స్పిన్‌ ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌.. ప్రస్తుతం ఐపీఎల్‌లో బిజీగా ఉన్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న అక్షర్‌ ఆ జట్టుకు కీలక ఆటగాడిగా ఉన్నాడు. కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆఖర్లో బ్యాటింగ్‌ వచ్చిన అక్షర్‌ 14 బంతుల్లో 22 పరుగులు చేయడమే గాక శార్దూల్‌ ఠాకూర్‌తో మంచి భాగస్వామ్యం నెలకొల్పి జట్టును 200 పరుగుల స్కోరు దాటించాడు. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ మంచి విజయాన్ని అందుకొని రెండు వరుస పరాజయాలకు చెక్‌ పెట్టింది. ఈ సంగతి అలా ఉంచితే.. అక్షర్‌ పటేల్‌ తన పేరు వెనుక దాగున్నఆసక్తికర కథను పంచుకున్నాడు. బ్రేక్‌ఫాస్ట్‌ విత్‌ చాంపియన్స్‌ పేరిట గౌరవ్‌ కపూర్‌ హోస్ట్‌ చేసిన కార్యక్రమంలో అక్షర్‌ పాల్గొన్నాడు.

''చిన్నప్పుడు  నా పేరు అక్సర్‌ పటేల్‌ అనే ఉండేది. కన్ఫూజన్‌ వల్ల స్కూల్లో అందరూ 'అక్షర్‌' అని పిలిచేవారు. సరైనా స్పెలింగ్‌ ఏంటా అనేది పెద్ద మిస్టరీగా ఉండిపోయింది. అయితే స్కూల్‌ లివింగ్‌ సర్టిఫికేట్‌ కోసం ప్రిన్సిపాల్‌ వద్దకు వెళ్లినప్పుడు అక్సర్‌ కాస్త అక్షర్‌ పటేల్‌గా మారిపోయింది. అండర్-19 వరల్డ్‌కప్‌ కోసం బెంగళూరులో ఒక క్యాంప్‌ను ఏర్పాటు చేశారు. అప్పటికి నా స్కూలింగ్‌ పూర్తయ్యి కాలేజీలో ఉ‍న్నాను. ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న అండర్‌-19 వరల్డ్‌కప్‌కు పాస్‌పోర్ట్‌ అవసరం వచ్చి పడింది. పాస్‌పోర్ట్‌ కోసం లైసెన్స్‌తో పాటు స్కూల్‌ సర్టిఫికేట్‌ కావాలి. దీంతో స్కూల్‌కు వెళ్లి ప్రిన్సిపాల్‌తో మాట్లాడి సర్టిఫికేట్‌ తెచ్చుకున్నాను. అప్పుడే నా పేరు అక్సర్‌ నుంచి అక్షర్‌గా మారింది. ఇదే విషయాన్ని మా నాన్న వద్ద ప్రస్తావిస్తే.. ఏమో ఈ పేరుతోనే నీకు మంచి భవిష్యత్తు ఉందేమో.. అందుకే దేవుడే నీ పేరును మార్చాడంటూ చెప్పారు. అలా ఈరోజు మీ ముందుకు అక్షర్‌ పటేల్‌గా వచ్చాను.. దేవుడి దయవల్ల క్రికెట్‌లో రాణిస్తున్నాను. 

ఈరోజు సందర్భం వచ్చింది కాబట్టి మరో విషయం పంచుకుంటున్నా. మా నానమ్మకు నన్ను ఒక క్రికెటర్‌గా చూడాలన్న కోరిక బలంగా ఉండేది. మ్యాచ్‌ ప్రసారమయ్యే టెలివిజన్‌ చానెల్‌లో తెరపై నా పేరు చూడాలని ఆశపడేది. మేం గుజరాత్‌లో ఉన్నప్పుడు కేడా వర్సెస్‌ గాంధీనగర్‌ మ్యాచ్‌లో పాల్గొన్నా.  ఇంతలో నానమ్మ చనిపోయిందన్న వార్త వినాల్సి వచ్చింది. ఇంటికి వెళితే నాన్న గట్టిగా హత్తుకొని చిన్న పిల్లాడిలా ఏడ్చేశాడు.. ఆ సమయంలో ఒక్క విషయం చెప్పాడు.

ఇంతకముందు నేను నిన్నేం అడగలేదు.. ఇకపై కూడా ఏం అడగను.. కానీ ఒక్క పని మాత్రం చేసిపెట్టు. నిన్ను క్రికెటర్‌గా టీవీలో చూడాలని మా అమ్మ(నానమ్మ) ఆశపడింది. అప్పుడే నిశ్చియించుకున్నా.. గొప్ప క్రికెటర్‌ కావాలని.. ఇష్టాన్ని పట్టుదలగా మార్చుకొని మంచి ఆటగాడిగా పేరు తెచ్చుకునే పనిలో పడ్డాను. నానమ్మ కోరుకున్నట్లే నా పేరు టీవీలో కనిపించింది.. ఈ వార్త మా నాన్నను చాలా సంతోషపెట్టింది. ఎందుకంటే నాన్నకు ఇచ్చిన మాటను నెరవేర్చాను కాబట్టి'' అంటూ సంతోషంతో పేర్కొన్నాడు.

2014లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన అక్షర్‌ పటేల్‌ టీమిండియా తరపున  6 టెస్టులు, 38 వన్డేలు, 15 టి20లు ఆడాడు. ఐపీఎల్‌లో ఇప్పటివరకు 113 మ్యాచ్‌ల్లో పాల్గొన్నాడు.

చదవండి: Arjuna Ranatunga: దేశం తగలబడిపోతుంటే ఐపీఎల్‌ ముఖ్యమా.. వదిలి రండి!

IPL 2022: ఎస్‌ఆర్‌హెచ్‌ బౌలర్‌ ఖాతాలో చెత్త రికార్డు.. డేల్‌ స్టెయిన్‌ తర్వాత..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement