photo credit: IPL Twitter
ఐపీఎల్-2023లో భాగంగా నిన్న (ఏప్రిల్ 11) మరో రసవత్తర మ్యాచ్ జరిగింది. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన థ్రిల్లర్ గేమ్‌లో ముంబై ఇండియన్స్ ఆఖరి బంతికి విజయం సాధించింది. ఈ సీజన్‌లో ఇది వరుసగా మూడో లాస్ట్ బాల్ విక్టరీ మ్యాచ్ కావడం విశేషం. అంతకుముందు రింకూ సింగ్ ఊచకోతతో (ఆఖరి 5 బంతుల్లో 5 సిక్సర్లు) కేకేఆర్, ఆ తర్వాత స్టోయినిస్, పూరన్ విధ్వంసంతో లక్నో, తాజాగా రోహిత్, తిలక్ వర్మ మెరుపులతో ముంబై ఆఖరి బంతికి విజయం సాధించాయి. ముంబై గెలుపుకు ఆఖరి ఓవర్లో కేవలం 5 పరుగులు చేయాల్సి ఉండినప్పటికీ, నోర్జే కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ముంబైకి ముచ్చెమటలు పట్టించాడు. అయితే, ఆఖరి బంతికి టిమ్ డేవిడ్ 2 పరుగులు తీయడంతో ముంబై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ఇదిలా ఉంటే, ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో ముంబై ఇండియన్స్ రెండు మ్యాచ్‌ల తర్వాత విజయం సాధించడంతో ఢిల్లీ ఆటగాడి మెరుపు ఇన్నింగ్స్ మరుగునపడిపోయింది. ఈ మ్యాచ్‌లో క్లిష్ట సమయంలో బ్యాటింగ్‌కు దిగిన అక్షర్.. ఆకాశమే హద్దుగా చెలరేగి 25 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 54 పరుగులు చేసి డీసీ గౌరవప్రదమైన స్కోర్ సాధించేందుకు తోడ్పడ్డాడు. ఇటీవలికాలంలో ఫార్మాట్లకతీతంగా చెలరేగుతున్న అక్షర్.. ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లోనూ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తూ పరిపూర్ణమైన బ్యాటర్‌గా గర్తింపు తెచ్చుకున్నాడు.
ఈ సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌పై 11 బంతుల్లో ఫోర్, సిక్స్ సాయంతో 16 పరుగులు చేసిన అక్షర్.. ఆతర్వాత గుజరాత్ టైటాన్స్‌పై 36 పరుగులు (22 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో), రాజస్థాన్ రాయల్స్‌పై 2 పరుగులు చేశాడు. ఐపీఎల్‌కు ముందు అక్షర్ అంతర్జాతీయ టీ20ల్లో కూడా అద్భుతంగా రాణించాడు. శ్రీలంకతో సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో 20 బంతుల్లో 31 పరుగులు చేసిన అక్షర్.. రెండో టీ20లో 31 బంతుల్లో 65, మూడో టీ20లో 9 బంతుల్లో 21 పరుగులు స్కోర్ చేశాడు. బ్యాటింగ్ విషయంలో దినదినాభివృద్ధి చెందుతున్న అక్షర్.. టీమిండియాతో పాటు తన ఐపీఎల్ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్‌కు కూడా కీలక ఆటగాడిగా మారాడు.
Comments
Please login to add a commentAdd a comment