IND VS ENG 1st T20: చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో ఉన్న టీమిండియా బౌలర్‌ | ARSHDEEP SINGH NEED 5 MORE WICKETS TO BECOME THE FIRST INDIAN BOWLER TO COMPLETE 100 WICKETS IN MENS T20I | Sakshi
Sakshi News home page

IND VS ENG 1st T20: చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో ఉన్న టీమిండియా బౌలర్‌

Published Wed, Jan 22 2025 11:05 AM | Last Updated on Wed, Jan 22 2025 12:53 PM

ARSHDEEP SINGH NEED 5 MORE WICKETS TO BECOME THE FIRST INDIAN BOWLER TO COMPLETE 100 WICKETS IN MENS T20I

టీమిండియా లెఫ్ట్‌ ఆర్మ్‌ పేసర్‌ అర్షదీప్‌ సింగ్‌ చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో ఉన్నాడు. అర్షదీప్‌ ఇవాళ (జనవరి 22) ఇంగ్లండ్‌తో జరుగబోయే తొలి టీ20లో ఐదు వికెట్లు తీస్తే.. పొట్టి ఫార్మాట్‌లో భారత్‌ తరఫున 100 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా రికార్డుల్లోకెక్కుతాడు. 

అర్షదీప్‌ ఇప్పటివరకు 60 మ్యాచ్‌లు ఆడి 2 నాలుగు వికెట్ల ఘనతల సాయంతో 95 వికెట్లు తీశాడు. వెటరన్‌ స్పిన్నర్‌ యుజ్వేంద్ర చహల్‌ అర్షదీప్‌ కంటే ఓ వికెట్‌ అధికంగా తీసి భారత్‌ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో  అగ్రస్థానంలో ఉన్నాడు. చహల్‌ 80 మ్యాచ్‌ల్లో 2 నాలుగు వికెట్ల ఘనతలు, ఓ ఐదు వికెట్ల ఘనత సాయంతో 96 వికెట్లు తీశాడు.

టీ20ల్లో భారత్‌ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు (టాప్‌-10)..
యుజ్వేంద్ర చహల్‌-96
అర్షదీప్‌ సింగ్‌-95
భువనేశ్వర్‌ కుమార్‌-90
జస్ప్రీత్‌ బుమ్రా-89
హార్దిక్‌ పాండ్యా-89
అశ్విన్‌-72
కుల్దీప్‌ యాదవ్‌-69
అక్షర్‌ పటేల్‌-65
రవి బిష్ణోయ్‌-56
రవీంద్ర జడేజా-54

కాగా, భారత్‌, ఇంగ్లండ్‌ జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ఇవాల్టి నుంచి ప్రారంభం కానుంది. తొలి టీ20 కోల్‌కతా వేదికగా ఇవాళ రాత్రి 7 గంటలకు మొదలవుతుంది. భారత్‌, ఇంగ్లండ్‌ జట్లు ఇప్పటివరకు 24 టీ20ల్లో ఎదురెదురుపడ్డాయి. ఇందులో భారత్‌ 13 మ్యాచ్‌ల్లో నెగ్గగా.. ఇంగ్లండ్‌ 12 మ్యాచ్‌ల్లో గెలిచింది. భారత్‌ వేదికగా ఇరు జట్లు 11 మ్యాచ్‌ల్లో తలపడగా.. భారత్‌ 6, ఇంగ్లండ్‌ 5 మ్యాచ్‌ల్లో గెలుపొందాయి.

తొలి టీ20కు వేదిక అయిన ఈడెన్‌ గార్డెన్స్‌లో భారత్‌ ఇప్పటివరకు 7 టీ20లు ఆడింది. ఇందులో భారత్‌ ఆరింట విజయాలు సాధించింది. ఒక్క మ్యాచ్‌లో మాత్రమే ఓటమిని ఎదుర్కొంది. ఆ ఒక్క ఓటమి భారత్‌ ఇంగ్లండ్‌ చేతుల్లోనే (2011) ఎదుర్కోవడం గమనార్హం.

జట్ల బలాబలాల విషయానికొస్తే.. ఇరు జట్లు సమతూకంగా కనిపిస్తున్నాయి. ఇరు జట్లలో విధ్వంసకర బ్యాటర్లు ఉండటంతో పాటు మ్యాచ్‌ విన్నింగ్‌ బౌలర్లు ఉన్నారు. ఈడెన్‌ గార్డెన్స్‌ పిచ్‌ బ్యాటర్లకు సహకరించనున్న నేపథ్యంలో తొలి టీ20లో పరుగుల వరద పారడం ఖాయం.

భీకర ఫామ్‌లో తిలక్‌, సంజూ
టీమిండియా టాపార్డర్‌ బ్యాటర్లు తిలక్‌ వర్మ, సంజూ శాంసన్‌ భీకర ఫామ్‌లో ఉన్నారు. ఇటీవల సౌతాఫ్రికాతో జరిగిన నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో వీరిద్దరూ చెలరేగిపోయారు. తిలక్‌ చివరి రెండు టీ20ల్లో మెరుపు సెంచరీలు చేయగా.. సంజూ మొదటి, నాలుగు మ్యాచ్‌ల్లో శతక్కొట్టాడు. సౌతాఫ్రికా సిరీస్‌కు ముందు బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ సంజూ సెంచరీ చేశాడు. సంజూ గత ఐదు టీ20ల్లో మూడు సెంచరీలు చేశాడు.

ఇప్పటికే జట్టును ప్రకటించిన ఇంగ్లండ్‌
తొలి టీ20 కోసం ఇంగ్లండ్‌ జట్టును నిన్ననే ప్రకటించారు. ఈ జట్టు బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాల్లో సమతూకంగా ఉంది. కెప్టెన్‌ జోస్‌ బట్లర్‌తో పాటు ఫిల్‌ సాల్ట్‌ ఓపెనర్‌గా బరిలోకి దిగనున్నాడు. యువ ఆటగాడు జేకబ్‌ బేతెల్‌ తొలిసారి భారత్‌తో తలపడనున్నాడు.

ఇంగ్లండ్‌ తుది జట్టు: జోస్‌ బట్లర్‌ (కెప్టెన్‌), ఫిల్‌ సాల్ట్‌, బెన్‌ డకెట్‌, హ్యారీ బ్రూక్‌, లియామ్‌ లివింగ్‌స్టోన్‌, జేకబ్‌ బేతెల్‌, జేమీ ఓవర్టన్‌, గస్‌ అట్కిన్సన్‌, జోఫ్రా ఆర్చర్‌, ఆదిల్‌ రషీద్‌, మార్క్‌ వుడ్‌

భారత తుది జట్టు (అంచనా): సంజూ శాంసన్‌, అభిషేక్‌ శర్మ, తిలక్‌ వర్మ, సూర్యకుమార్‌ యాదవ్‌ (కెప్టెన్‌), హార్దిక్‌ పాండ్యా, రింకూ సింగ్‌, అక్షర్‌ పటేల్‌, వాషింగ్టన్‌ సుందర్‌, మహ్మద్‌ షమీ, అర్షదీప్‌ సింగ్‌, వరుణ్‌ చక్రవర్తి

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement