
ప్రధాన బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) లేకుండానే టీమిండియా చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) బరిలో దిగనుంది. వెన్నునొప్పి నుంచి కోలుకోని కారణంగా ఈ పేస్ గుర్రం ఐసీసీ టోర్నమెంట్‌కు దూరమయ్యాడు. అయితే, ఈ వన్డే ఫార్మాట్ ఈవెంట్లో బుమ్రా లేని లోటు టీమిండియాపై కచ్చితంగా ప్రభావం చూపిస్తుందంటున్నాడు ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ డేవిడ్ లాయిడ్.
ప్రపంచ స్థాయి బౌలర్ అయిన బుమ్రా స్థానాన్ని వేరొక ఆటగాడు భర్తీ చేయడం అంత సులువేమీ కాదని అభిప్రాయపడ్డాడు. ఈ సందర్భంగా యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్(Arshdeep Singh)ను ఉద్దేశించి డేవిడ్ లాయిడ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. వన్డేల్లో అంతగా అనుభవం లేని అర్ష్‌దీప్.. నేరుగా ఐసీసీ టోర్నీలో అడుగుపెట్టి అద్భుతాలు చేస్తాడని ఊహించలేమన్నాడు.
సిరాజ్‌ను కాదని
కాగా ఫిట్‌నెస్ సమస్యల కారణంగా బుమ్రా దూరమవుతాడని ముందుగానే ఊహించిన భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ).. పేస్ దళంలో సీనియర్ మహ్మద్ షమీతో పాటు అర్ష్‌దీప్ సింగ్‌కు చోటిచ్చింది. అయితే, మరో సీనియర్ బౌలర్ మహ్మద్ సిరాజ్‌పై మాత్రం నమ్మకం ఉంచలేకపోయింది.
సిరాజ్‌ను కాదని అర్ష్‌దీప్‌ను ఐసీసీ ఈవెంట్‌కు ఎంపిక చేయడానికి గల కారణాన్ని కెప్టెన్ రోహిత్ శర్మ ఇప్పటికే వెల్లడించాడు కూడా. ఆరంభంలో కొత్త బంతితో ప్రభావం చూపుతున్న సిరాజ్.. డెత్ ఓవర్లలో మాత్రం రాణించలేకపోతున్నాడని పేర్కొన్న సిరాజ్.. అర్ష్‌దీప్ మాత్రం రెండు సందర్భాల్లోనూ మ్యాజిక్ చేయగలడని పేర్కొన్నాడు. అందుకే తాము ఈ యువ పేసర్ వైపు మొగ్గు చూపినట్లు తెలిపాడు.
ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ కోచ్ డేవిడ్ లాయిడ్ మాట్లాడుతూ.. ‘‘ఒకరు జట్టులో లేకపోవడం వల్ల మరొకరికి చోటు దక్కడం నిజంగా ఓ గొప్ప అవకాశమే. అయితే, బుమ్రా ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్. అతడు జట్టులో లేకుంటే కచ్చితంగా ఆ ప్రభావం ఉంటుంది.
ఇదేమీ టీ20 ఫార్మాట్ కాదు
ఇక అర్ష్‌దీప్ విషయానికి వస్తే.. టీ20లకు, వన్డే ఫార్మాట్ భిన్నంగా ఉంటుంది. నాలుగు ఓవర్లు వేయడానికి.. పది ఓవర్ల బౌలింగ్‌కు కచ్చితంగా తేడా ఉంటుంది. ఇలా వచ్చి అలా వెళ్లిపోవడానికి ఇది టీ20 కాదు. వరుస ఓవర్లు, దీర్ఘమైన స్పెల్స్ వేయాల్సి ఉంటుంది. అయితే, అర్ష్‌దీప్‌నకు అలాంటి అనుభవం లేదు’’ అని పేర్కొన్నాడు.
కాగా అంతర్జాతీయ టీ20లలో అర్ష్‌దీప్ సింగ్ భారత్ తరఫున అత్యధిక వికెట్లు వీరుడిగా కొనసాగుతున్నాడు. అతడి ఖాతాలో ఇప్పటి వరకు 99 వికెట్లు ఉన్నాయి. అయితే, ఇప్పటి వరకు టీమిండియా తరఫున కేవలం తొమ్మిది వన్డేలు మాత్రమే ఆడిన ఈ లెఫ్టార్మ్ పేసర్ పద్నాలుగు వికెట్లు తీయగలిగాడు.
తొమ్మిది వన్డేలు ఆడి
ఇటీవల స్వదేశంలో ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో పాల్గొన్న అర్ష్‌దీప్ సింగ్ ఆఖరిదైన అహ్మదాబాద్ మ్యాచ్‌లో ఆడాడు. ఈ వన్డేలో ఐదు ఓవర్లు బౌల్ చేసిన అర్ష్.. 33 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశాడు.
ఇదిలా ఉంటే.. ఫిబ్రవరి 19 నుంచి పాకిస్తాన్ వేదికగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ మొదలుకానుంది. ఈ టోర్నీలో టీమిండియా తమ మ్యాచ్‌లన్నీ దుబాయ్‌లో ఆడుతుంది.
ఇక ఈ మెగా ఈవెంట్‌కు ఆతిథ్య జట్టు హోదాలో పాకిస్తాన్.. వన్డే ప్రపంచకప్-2023 ప్రదర్శన ఆధారంగా ఆస్ట్రేలియా, భారత్, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, శ్రీలంక అర్హత సాధించాయి. కాగా బుమ్రా స్థానంలో యువ పేసర్ హర్షిత్ రాణా చాంపియన్స్ ట్రోఫీ జట్టులోకి వచ్చాడు.
చదవండి: CT 2025: సురేశ్ రైనా ఎంచుకున్న భారత తుదిజట్టు... వరల్డ్‌కప్ వీరులకు నో ఛాన్స్!
Comments
Please login to add a commentAdd a comment