David Lloyd
-
కోహ్లిపై ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ ఘాటు వ్యాఖ్యలు
పుణె: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిపై ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ డేవిడ్ లాయిడ్ విమర్శల వర్షం కురిపించాడు. గత కొన్నిరోజులుగా అంపైర్ల పట్ల కోహ్లి వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదని మండిపడ్డాడు. భారత్- ఇంగ్లండ్ సిరీస్ ఆసాంతం అంపైర్లను అగౌరవపరిచే విధంగా ప్రవర్తిస్తున్నాడని విమర్శించాడు. కాగా నాలుగో టీ20లో భాగంగా ‘సాఫ్ట్ సిగ్నల్’ కాల్‌తో సూర్యకుమార్ యాదవ్ అవుటైన తీరుపై కోహ్లి తీవ్ర అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఆన్- ఫీల్డ్ అంపైర్లను ఇంగ్లండ్ ఆటగాళ్లు ఒత్తిడికి లోనుచేసినట్లుగా కనిపిస్తోందంటూ మండిపడ్డాడు. అదే విధంగా, మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. ‘‘అసలు అంపైర్ అవుట్గానీ నాటౌట్కానీ ఎందుకు స్పష్టంగా ప్రకటించాలి. ‘నాకు తెలియదు’ అని చెప్పే అవకాశం కూడా అంపైర్‌కు ఉండాలి కదా’’ అని వ్యాఖ్యానించాడు. ఈ నేపథ్యంలో యూకే డెయిలీ మెయిల్‌కు రాసిన కాలమ్‌లో డేవిడ్ ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ‘‘సాఫ్ట్ సిగ్నల్ విషయంలో కోహ్లి ఇంగ్లండ్‌ను తప్పుబట్టాడు. నిజానికి అంపైర్ల విచక్షణకు కూడా అవకాశం ఇవ్వాలని ఈ నిబంధన తెలియజేస్తుంది. అహ్మదాబాద్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ అంపైర్ నితిన్ మీనన్‌పై ఒత్తిడి తెచ్చిందో లేదో నాకు తెలియదు గానీ, కోహ్లి మాత్రం అంపైర్లపై ఒత్తిడి తీసుకువచ్చాడు. అగౌరవపరిచాడు. ఈ టూర్లో వారి పట్ల తన ప్రవర్తన అస్సలు బాగాలేదు’’ అని డేవిడ్ పేర్కొన్నాడు. అదే విధంగా అంపైర్స్ కాల్ నిబంధనను కోహ్లి రద్దు చేయాలనడం సరికాదని అభిప్రాయపడ్డాడు. ఈ మేరకు.. ‘‘తొలి వన్డేకు ముందు, డెసిషన్ రివ్యూ సిస్టంలో భాగమైన అంపైర్స్ కాల్ నిబంధనను తొలగించాలని విరాట్ కోహ్లి అన్నాడు. ఒకవేళ బాల్, స్టంప్స్‌లోని ఏ భాగానికి తాకినా అది అవుట్ అని ఇవ్వాలి. ఇలా ప్రతీది అవుట్ అని ఇస్తూ పోతే, టెస్టు మ్యాచ్ రెండు రోజుల్లో, వనేడ నాలుగు గంటల్లో పూర్తైపోతుంది. కోహ్లి మాటలు చాలా మందిపై ప్రభావం చూపుతాయి. కాబట్టి తను ఏం చేస్తున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు అనే విషయాన్ని ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలి’’ అని ఘాటు వ్యాఖ్యలు చేశాడు. అంపైర్లకు పూర్వ అధికారాలు కట్టబెట్టాలని, మైదానంలో దురుసుగా ప్రవర్తించిన ఆటగాళ్ల పట్ల చర్యలు తీసుకునే విధంగా ఎల్లో కార్డులు, రెడ్ కార్డులు ఇవ్వాలని డేవిడ్ అభిప్రాయపడ్డాడు. చదవండి: కృనాల్- టామ్ కరన్ గొడవ; కోహ్లి రియాక్షన్ చూశారా?! -
'మిగిలిన టెస్టులకు కోహ్లిని బ్యాన్ చేయండి'
చెన్నై: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిపై ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ డేవిడ్ లాయిడ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. రూట్ అవుట్ విషయంలో అంపైర్ నితిన్ మీనన్‌పై దురుసుగా ప్రవర్తించనందుకు కోహ్లిని మిగిలిన టెస్టుల నుంచి బ్యాన్ చేయాలంటూ పేర్కొన్నాడు. అసలు విషయంలోకి వెళితే.. ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టులో అక్షర్ పటేల్ వేసిన బంతిని రూట్ ఆడగా కీపర్ పంత్ చేతుల్లో పడింది. అయితే రూట్ బ్యాట్‌ను తాకుతూ వెళ్లిందనుకొని టీమిండియా అంపైర్‌కు క్యాచ్ అప్పీల్ చేసింది. కానీ ఫీల్డ్ అంపైర్ నితిన్ మీనన్ వారి అప్పీల్‌ను పరిగణలోకి తీసుకోకుండా నాటౌట్‌గా ప్రకటించాడు. దీంతో టీమిండియా డీఆర్ఎస్కు వెళ్లింది. అయితే రిప్లేలో బంతి జో రూట్ ప్యాడ్‌ను తాకినట్లు కనిపించినా.. బ్యాట్‌కు ఎక్కడా ఎడ్జ్ అవలేదని తేలింది. దీంతో ఎల్బీకి ఏమైనా చాన్స్ ఉందేమోనని థర్డ్ అంపైర్ మరోసారి పరిశీలించారు. రిప్లేలో అక్షర్ వేసిన బంతి రూట్ ప్యాడ్లను తాకుతూ ఆప్‌స్టంప్ లైన్ మీదుగా వెళ్లినట్లు కనిపించింది. కానీ రివ్యూలో రూట్ నాటౌట్ అని ప్రకటించడంతో కోహ్లికి కోపం చిర్రెత్తికొచ్చింది. దీంతో అంపైర్ నితిన్ మీనన్ వద్దకు వచ్చి చాలా సేపు వాదించాడు. టీమిండియా ఆటగాళ్లు ఎవరి స్థానాల్లో వారు వెళ్లిపోయేంతవరకు కోహ్లి అంపైర్‌తో మాట్లాడుతున్నట్లు కనిపించింది. ఈ విషయంపై డేవిడ్ లాయిడ్ స్పందిస్తూ.. 'ఒక జట్టుకు కెప్టెన్‌గా ఉంటూ కోహ్లి ఇలా ప్రవర్తించడం దారుణం. ఫీల్డ్ అంపైర్‌పైకి కోపంతో అలా దూసుకెళ్లడం కరెక్ట్ కాదు. జెంటిల్మెన్ గేమ్ అని పిలుచుకునే క్రికెట్లో కోహ్లి చర్యల వల్ల ఇక్కడ కూడా రెడ్, యెల్లో కార్డులు జారీ చేసే అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది. అలా చూసుకుంటే అంపైర్‌పై కోహ్లి కోపం వ్యక్తం చేసినందుకు గానూ రెడ్ కార్డ్ చూపించి మూడు టెస్టులు బ్యాన్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ క్రికెట్ కాకుండా మరే ఆటైనా కోహ్లి తన ప్రవర్తనతో ఆన్‌ఫీల్డ్ వీడి బయటకు వెళ్లాల్సి వచ్చేది.'అంటూ పేర్కొన్నాడు. టీమిండియా మాజీ బౌలర్.. మ్యాచ్ రిఫరీ జవగల్ శ్రీనాథ్ మాత్రం ఏసీ గదిలో కూర్చొని కోహ్లి తీరుపై తనకేం పట్టనట్లు వ్యవహరించడం ఆశ్చర్యపరిచిందని లాయిడ్ తెలిపాడు. ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే..పర్యాటక జట్టు 317 పరుగుల తేడాతో భారీ పరాజయం చవిచూసింది. సొంతగడ్డపై అశ్విన్ సెంచరీతో పాటు రెండు ఇన్నింగ్స్‌లు కలిపి 8 వికెట్లు తీసి ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరిచాడు. ప్రస్తుతం ఇరు జట్లు నాలుగు టెస్టుల సిరీస్‌లో 1-1తో సమాంగా ఉన్నాయి. మూడోటెస్టు మ్యాచ్ అహ్మదాబాద్ వేదికగా ఫిబ్రవరి 24వ తేదీ నుంచి డే నైట్ పద్దతిలో జరగనుంది. చదవండి: కోహ్లి.. నీ ఎక్స్‌ప్రెషన్‌కు అర్థమేంటి! వినపడట్లేదు.. ఇంకా గట్టిగా: కోహ్లి -
స్మిత్వి అన్ని చిన్నపిల్లల బుద్ధులే
లండన్: టీమిండియాతో జరిగిన మూడో టెస్టులో ఆసీస్ ఆటగాడు స్టీవ్ స్మిత్.. రిషబ్ పంత్ గార్డ్ మార్క్‌ను చెరిపేసిన ఘటనపై అన్ని వైపుల నుంచి విమర్శలు వ్యక్తమయిన సంగతి తెలిసిందే. స్మిత్ పనిని పలువురు మాజీ ఆటగాళ్లు తప్పుబడితే ఆసీస్ కెప్టెన్ టిమ్ పైన్ మాత్రం అతనికి మద్దతుగా నిలిచాడు. అంతేగాక వీడియోతో అడ్డంగా దొరికిపోయినా కూడా స్మిత్ తాను చేసింది తప్పు కాదని.. ఇది నాకు అలవాటేనని.. మ్యాచ్ గురించి ఆలోచించకుండా ఇలాంటి పనికిమాలిన వాటిపై ఎందుకు దృష్టి పెడతారంటూ తనను తాను సమర్థించుకోవడం విశేషం. తాజాగా స్మిత్ చర్యపై ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ డేవిడ్ లాయిడ్ స్పందించాడు.(చదవండి: ఇదంతా ఐపీఎల్ వల్లే జరిగింది) 'స్టీవ్ స్మిత్వి అన్ని చిన్నపిల్లల బుద్దులే. అతను చేసింది తప్పు అని తెలిసినా కూడా దానిని కప్పి పుచ్చుకునే ప్రయత్నం చేస్తాడు. రిషబ్ పంత్ గీసుకున్న గార్డ్ మార్క్‌ను చెరిపేయడమే గాక దానిని నేను కావాలని చేయలేదంటూ సమర్థించుకోవడం స్మిత్‌కు మాత్రమే చెల్లింది. మైదానంలో కెమెరాలు ఉంటాయన సంగతి మరిచి బాల్ టాంపరింగ్‌కు పాల్పడిన స్మిత్‌కు గార్డ్ మార్క్ చెరిపేయడం ఒక లెక్క కాకపోవచ్చు. ఒకవేళ ఆ సమయంలో అక్కడ నేను అంపైర్‌గా విధులు నిర్వర్తించి ఉంటే స్మిత్ చర్యను తప్పుబడుతూ కెప్టెన్ దృష్టికి తీసుకొచ్చేవాడిని' అంటూ చెప్పుకొచ్చాడు.(చదవండి: ఏడేళ్ల తర్వాత రీఎంట్రీ.. తొలి మ్యాచ్‌లోనే) -
సైన్యంలోకి ధోని.. మాజీ క్రికెటర్ ఎగతాళి
రిటైర్మెంట్ చర్చను పక్కకు పెడుతూ.. వెస్టిండీస్ పర్యటనకు సెలవిస్తూ ప్రాదేశిక సైన్యలోకి చేరాలని భావించిన టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. మా ధోనికి దేశభక్తి ఎక్కువ.. అంటూ క్రికెట్ భారతం ఉబ్బితబ్బిబ్బై పోతుంది. పలు సందర్భాల్లో దేశం, సైన్యంపై ధోని చూపించిన ప్రేమను నెమరవేసుకుంటోంది. ఈ క్రమంలో ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ డేవిడ్ లాయడ్.. ధోనిని ఎగతాళి చేస్తూ చేసిన ట్వీట్ ఇప్పుడు వారందరిని ఆగ్రహానికి గురిచేసింది. ధోని తన సమయాన్ని ఆర్మీకి కేటాయించబోతున్నాడంటూ వచ్చిన వార్తల పట్ల ఈ ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కాస్త వ్యంగ్యంగా స్పందించాడు. ‘కాల్ ఆఫ్ డ్యూటీ.. సైన్యంలో చేరే ఉద్దేశంతో ధోని విండీస్ పర్యటనకు దూరం కానున్నాడు’ అంటూ ఓ స్పోర్ట్స్ చానెల్ చేసిన ట్వీట్‌కు ఎగతాళిగా పశ్చాతాపంతో నవ్వుతున్నట్టుగా ఉన్న ఎమోజీలతో రీట్వీట్ చేశాడు. ఇది భారత అభిమానులకు ఎక్కడ లేని ఆగ్రహాన్ని తెప్పించింది. వెంటనే సోషల్ మీడియా వేదికగా ఈ ఇంగ్లీష్ మాజీ క్రికెటర్‌పై ట్రోలింగ్‌కు దిగారు. ‘9 టెస్ట్‌లు ఆడిన నువ్వా.. మా ధోని గురించి మాట్లాడేది’ అని ఒకరంటే.. ఈ ముసలాయనకు పళ్లతో పాటు మెదడు కూడా లేనట్టుందని మరొకరు ఘాటుగా కామెంట్ చేస్తున్నారు. మన దేశానికి స్వాతంత్య్రం రాక ముందు జన్మించిన డేవిడ్ లాయడ్ ఇంగ్లండ్ తరఫున 9 టెస్టులు, 8 వన్డేలు ఆడాడు. భారత్‌పై తొలి టెస్టు ఆడిన డేవిడ్.. విండీస్‌పై తొలి వన్డే, చివరి వన్డే ఆడాడు. అనంతం కామెంటెటర్‌గా బాధ్యతలు చేపట్టాడు. If you cannot respect what you should, you better stay away. Feel sorry for this person, so called England cricket legend doesn’t have a better job. — Raveena Bellamkonda (@RaveenaRao) July 22, 2019 చదవండి: ధోని దరఖాస్తుకు ఆమోద ముద్ర! -
కోచ్ లేనందుకే కోహ్లి అలా ఔటయ్యాడు!
అంటిగ్వాలో వెస్టిండీస్‌తో శుక్రవారం జరిగిన మూడో వన్డేలో భారత్ 93 పరుగుల తేడాతో విజయాన్ని సాధించింది. ఐదు వన్డేల సిరీస్‌లో 2-0తో ఆధిక్యాన్ని సొంతం చేసుకుంది. అయితే, ఈ వన్డేలో భారత్ బ్యాటింగ్ విభాగం ఆశించినమేరకు రాణించలేదు. నిర్ణీత 50 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 251 పరుగులు చేసింది. అజింక్యా రహానే మరోసారి అద్భుతంగా ఆడి 72 పరుగులు చేయగా.. మహేంద్రసింగ్ ధోనీ ఫామ్‌ను అందిపుచ్చుకొని అజేయంగా 78 పరుగులు చేశాడు. అనంతరం బౌలర్లు అద్భుతంగా రాణించడంతో వెస్టిండీస్ 158 పరుగులకే చేతులేత్తేసింది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లి 11 పరుగులకే ఔటయ్యాడు. ఇదే అదనుగా భావించిన ఇంగ్లండ్ మాజీ ఆల్‌రౌండర్, ప్రస్తుత కామెంటేటర్ డేవిడ్ లాయిడ్ కోహ్లిపై ట్విట్టర్లో విమర్శనాస్త్రాలు సంధించాడు. కోచ్ లేకపోవడం వల్లే కోహ్లి ఇలా బ్యాటింగ్ విఫలమయ్యాడని ఎద్దేవా చేశాడు. కోహ్లితో విభేదాల కారణంగా కోచ్ పదవి నుంచి అనిల్ కుంబ్లే తప్పుకున్న సంగతి తెలిసిందే. అయితే, డేవిడ్ లాయిడ్ వ్యాఖ్యలపై భారత నెటిజన్లు, విరాట్ కోహ్లి అభిమానులు తీవ్రంగా మండిపడ్డారు. మొదట మీ సొంత జట్టు ఇంగ్లండ్ పరిస్థితి చూసుకోవాలని, పెద్ద టోర్నమెంటుల్లో విఫలమవ్వడం ఆ జట్టుకు అలవాటుగా మారిందని ఎద్దేవా చేశారు. కోచ్ పదవి కోసం క్యూలో నిలబడి.. కోహ్లిని ప్రసన్నం చేసుకోవాలని, అప్పుడైనా కోచ్‌గా అవకాశం దక్కవచ్చునని అతనికి సూచించారు. .