Ind Vs Eng 2nd Test: Former England Cricketer David Lloyd Comments On Virat Kohli - Sakshi
Sakshi News home page

'మిగిలిన టెస్టులకు కోహ్లిని బ్యాన్‌ చేయండి'

Published Wed, Feb 17 2021 2:16 PM | Last Updated on Thu, Feb 18 2021 2:33 PM

David Lloyd Sensational Comments On Virat Kohli Should Ban For 3 Tests - Sakshi

చెన్నై: టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిపై ఇంగ్లండ్‌ మాజీ క్రికెటర్‌ డేవిడ్‌ లాయిడ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. రూట్‌ అవుట్‌ విషయంలో అంపైర్‌ నితిన్‌ మీనన్‌పై దురుసుగా ప్రవర్తించనందుకు కోహ్లిని మిగిలిన టెస్టుల నుంచి బ్యాన్‌ చేయాలంటూ పేర్కొన్నాడు. అసలు విషయంలోకి వెళితే.. ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టులో అక్షర్‌ పటేల్‌ వేసిన బంతిని రూట్‌ ఆడగా కీపర్‌ పంత్‌ చేతుల్లో పడింది. అయితే రూట్‌ బ్యాట్‌ను తాకుతూ వెళ్లిందనుకొని టీమిండియా అంపైర్‌కు క్యాచ్‌ అప్పీల్‌ చేసింది. కానీ ఫీల్డ్‌ అంపైర్‌ నితిన్‌ మీనన్‌ వారి అప్పీల్‌ను పరిగణలోకి తీసుకోకుండా నాటౌట్‌గా ప్రకటించాడు.

దీంతో టీమిండియా డీఆర్‌ఎస్‌కు వెళ్లింది. అయితే రిప్లేలో బంతి జో రూట్‌ ప్యాడ్‌ను తాకినట్లు కనిపించినా.. బ్యాట్‌కు ఎక్కడా ఎడ్జ్‌ అవలేదని తేలింది. దీంతో ఎల్బీకి ఏమైనా చాన్స్‌ ఉందేమోనని థర్డ్‌ అంపైర్‌ మరోసారి పరిశీలించారు. రిప్లేలో అక్షర్‌ వేసిన బంతి రూట్‌ ప్యాడ్లను తాకుతూ ఆప్‌స్టంప్‌ లైన్‌ మీదుగా వెళ్లినట్లు కనిపించింది. కానీ రివ్యూలో రూట్‌ నాటౌట్‌ అని ప్రకటించడంతో కోహ్లికి కోపం చిర్రెత్తికొచ్చింది. దీంతో అంపైర్‌ నితిన్‌ మీనన్‌ వద్దకు వచ్చి చాలా సేపు వాదించాడు. టీమిండియా ఆటగాళ్లు ఎవరి స్థానాల్లో వారు వెళ్లిపోయేంతవరకు కోహ్లి అంపైర్‌తో మాట్లాడుతున్నట్లు కనిపించింది.


ఈ విషయంపై డేవిడ్‌ లాయిడ్‌ స్పందిస్తూ.. 'ఒక జట్టుకు కెప్టెన్‌గా ఉంటూ కోహ్లి ఇలా ప్రవర్తించడం దారుణం. ఫీల్డ్‌ అంపైర్‌పైకి కోపంతో అలా దూసుకెళ్లడం కరెక్ట్‌ కాదు. జెంటిల్మెన్‌ గేమ్‌ అని పిలుచుకునే క్రికెట్‌లో కోహ్లి చర్యల వల్ల ఇక్కడ కూడా రెడ్‌, యెల్లో కార్డులు జారీ చేసే అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది. అలా చూసుకుంటే అంపైర్‌పై కోహ్లి కోపం వ్యక్తం చేసినందుకు గానూ రెడ్‌ కార్డ్‌ చూపించి మూడు టెస్టులు బ్యాన్‌ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ క్రికెట్‌ కాకుండా మరే ఆటైనా కోహ్లి తన ప్రవర్తనతో ఆన్‌ఫీల్డ్‌ వీడి బయటకు వెళ్లాల్సి వచ్చేది.'అంటూ పేర్కొన్నాడు.  టీమిండియా మాజీ బౌలర్‌.. మ్యాచ్‌ రిఫరీ జవగల్‌ శ్రీనాథ్‌ మాత్రం ఏసీ గదిలో కూర్చొని కోహ్లి తీరుపై తనకేం పట్టనట్లు వ్యవహరించడం ఆశ్చర్యపరిచిందని లాయిడ్‌ తెలిపాడు.

ఇక ఈ మ్యాచ్‌ విషయానికి వస్తే..పర్యాటక జట్టు 317 పరుగుల తేడాతో భారీ పరాజయం చవిచూసింది. సొంతగడ్డపై అశ్విన్‌ సెంచరీతో పాటు రెండు ఇన్నింగ్స్‌లు కలిపి 8 వికెట్లు తీసి ఆల్‌రౌండ్‌ ప్రదర్శన కనబరిచాడు. ప్రస్తుతం ఇరు జట్లు నాలుగు టెస్టుల సిరీస్‌లో 1-1తో సమాంగా ఉన్నాయి. మూడోటెస్టు మ్యాచ్‌ అహ్మదాబాద్‌ వేదికగా ఫిబ్రవరి 24వ తేదీ నుంచి డే నైట్‌ పద్దతిలో జరగనుంది.
చదవండి: కోహ్లి.. నీ ఎక్స్‌ప్రెషన్‌కు అర్థమేంటి!
వినపడట్లేదు.. ఇంకా గట్టిగా: కోహ్లి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement