పుణె: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిపై ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ డేవిడ్ లాయిడ్ విమర్శల వర్షం కురిపించాడు. గత కొన్నిరోజులుగా అంపైర్ల పట్ల కోహ్లి వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదని మండిపడ్డాడు. భారత్- ఇంగ్లండ్ సిరీస్ ఆసాంతం అంపైర్లను అగౌరవపరిచే విధంగా ప్రవర్తిస్తున్నాడని విమర్శించాడు. కాగా నాలుగో టీ20లో భాగంగా ‘సాఫ్ట్ సిగ్నల్’ కాల్‌తో సూర్యకుమార్ యాదవ్ అవుటైన తీరుపై కోహ్లి తీవ్ర అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఆన్- ఫీల్డ్ అంపైర్లను ఇంగ్లండ్ ఆటగాళ్లు ఒత్తిడికి లోనుచేసినట్లుగా కనిపిస్తోందంటూ మండిపడ్డాడు.
అదే విధంగా, మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. ‘‘అసలు అంపైర్ అవుట్‌గానీ నాటౌట్‌కానీ ఎందుకు స్పష్టంగా ప్రకటించాలి. ‘నాకు తెలియదు’ అని చెప్పే అవకాశం కూడా అంపైర్‌కు ఉండాలి కదా’’ అని వ్యాఖ్యానించాడు. ఈ నేపథ్యంలో యూకే డెయిలీ మెయిల్‌కు రాసిన కాలమ్‌లో డేవిడ్ ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ‘‘సాఫ్ట్ సిగ్నల్ విషయంలో కోహ్లి ఇంగ్లండ్‌ను తప్పుబట్టాడు. నిజానికి అంపైర్ల విచక్షణకు కూడా అవకాశం ఇవ్వాలని ఈ నిబంధన తెలియజేస్తుంది. అహ్మదాబాద్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ అంపైర్ నితిన్ మీనన్‌పై ఒత్తిడి తెచ్చిందో లేదో నాకు తెలియదు గానీ, కోహ్లి మాత్రం అంపైర్లపై ఒత్తిడి తీసుకువచ్చాడు. అగౌరవపరిచాడు. ఈ టూర్‌లో వారి పట్ల తన ప్రవర్తన అస్సలు బాగాలేదు’’ అని డేవిడ్ పేర్కొన్నాడు.
అదే విధంగా అంపైర్స్ కాల్ నిబంధనను కోహ్లి రద్దు చేయాలనడం సరికాదని అభిప్రాయపడ్డాడు. ఈ మేరకు.. ‘‘తొలి వన్డేకు ముందు, డెసిషన్ రివ్యూ సిస్టంలో భాగమైన అంపైర్స్ కాల్ నిబంధనను తొలగించాలని విరాట్ కోహ్లి అన్నాడు. ఒకవేళ బాల్, స్టంప్స్‌లోని ఏ భాగానికి తాకినా అది అవుట్ అని ఇవ్వాలి. ఇలా ప్రతీది అవుట్ అని ఇస్తూ పోతే, టెస్టు మ్యాచ్ రెండు రోజుల్లో, వనేడ నాలుగు గంటల్లో పూర్తైపోతుంది. కోహ్లి మాటలు చాలా మందిపై ప్రభావం చూపుతాయి. కాబట్టి తను ఏం చేస్తున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు అనే విషయాన్ని ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలి’’ అని ఘాటు వ్యాఖ్యలు చేశాడు. అంపైర్లకు పూర్వ అధికారాలు కట్టబెట్టాలని, మైదానంలో దురుసుగా ప్రవర్తించిన ఆటగాళ్ల పట్ల చర్యలు తీసుకునే విధంగా ఎల్లో కార్డులు, రెడ్ కార్డులు ఇవ్వాలని డేవిడ్ అభిప్రాయపడ్డాడు.
చదవండి: కృనాల్- టామ్ కరన్ గొడవ; కోహ్లి రియాక్షన్ చూశారా?!
Comments
Please login to add a commentAdd a comment