
జకార్తా: పారా ఆసియా క్రీడల్లో భారత్ కొత్త చరిత్ర సృష్టించింది. శనివారం ఈ క్రీడల చివరి రోజు భారత బ్యాడ్మింటన్ క్రీడాకారులు మరో రెండు స్వర్ణాలు కైవసం చేసుకోవడంతో మొత్తం 72 (15 స్వర్ణాలు, 24 రజతాలు, 33 కాంస్యాలు) పతకాలతో పట్టికలో తొమ్మిదో స్థానంతో ముగించింది. 172 పతకాలతో చైనా అగ్రస్థానంలో నిలిచింది.
పారా ఆసియా క్రీడల చరిత్రలో భారత్‌కిదే అత్యుత్తమ ప్రదర్శన. 2014 క్రీడల్లో భారత్ 33 (3 స్వర్ణాలు, 14 రజతాలు, 16 కాంస్యాలు) పతకాలు సాధించింది. పోటీల చివరి రోజు బ్యాడ్మింటన్ పురుషుల ఎస్‌ఎల్3 సింగిల్స్ ఫైనల్లో ప్రమోద్ భగత్ 21–19, 15–21, 21–14తో ఉకున్ రుకైన్‌డీ (ఇండోనేసియా)పై గెలిచాడు. ఎస్‌ఎల్4 ఫైనల్లో తరుణ్ 21–16, 21–6తో యుయాంగ్ (చైనా)పై నెగ్గాడు.