బ్యాడ్మింటన్‌లో తెలంగాణకు స్వర్ణం
జాతీయ క్రీడలు
తిరువనంతపురం: వరుసగా మూడో రోజు జాతీయ క్రీడల్లో తెలంగాణ క్రీడాకారులు ‘పసిడి’తో మెరిపించారు. ఆదివారం టెన్నిస్‌లో, సోమవారం కయాకింగ్‌లో తెలంగాణకు స్వర్ణ పతకాలు రాగా... ఇదే స్ఫూర్తితో మంగళవారం మహిళల టీమ్ బ్యాడ్మింటన్ ఈవెంట్‌లో తెలంగాణ జట్టు బంగారు పతకాన్ని సొంతం చేసుకుంది. ఆతిథ్య కేరళతో జరిగిన ఫైనల్లో రుత్విక శివాని, సిక్కి రెడ్డి, మేఘన, రితూపర్ణ దాస్, మనీషాలతో కూడిన తెలంగాణ జట్టు 2-0 తేడాతో విజయం సాధించింది. తొలి మ్యాచ్‌గా జరిగిన సింగిల్స్‌లో రితూపర్ణ దాస్ 21-14, 21-18తో పి.సి.తులసీపై నెగ్గి తెలంగాణకు 1-0 ఆధిక్యాన్ని అందించింది.
రెండో మ్యాచ్‌గా జరిగిన డబుల్స్‌లో రుత్విక శివాని-సిక్కి రెడ్డి జంట 21-18, 18-21, 21-13తో అపర్ణ బాలన్-ఆరతి సునీల్ జోడీని ఓడించడంతో తెలంగాణ విజయం ఖాయమైంది. మరోవైపు కయాకింగ్‌లో తెలంగాణకు మరో పతకం వచ్చింది. పురుషుల కయాక్ సింగిల్స్ 500 మీటర్ల ఈవెంట్‌లో పదమ్‌కర్ ప్రసాద్ కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్నాడు. 500 మీటర్ల దూరాన్ని ప్రసాద్ ఒక నిమిషం 54 సెకన్లలో పూర్తిచేసి మూడో స్థానంలో నిలిచాడు. ఓవరాల్‌గా క్రీడల పదో రోజు తెలంగాణకు రెండు పతకాలు రాగా... ఆంధ్రప్రదేశ్ ఖాతాలో ఒక్క పతకమూ చేరలేదు.
అథ్లెటిక్స్‌లో వివాదాస్పద మహిళా స్ప్రింటర్ దుతీ చంద్ హీట్స్‌లోనే మీట్ రికార్డు నెలకొల్పింది. ఒడిశాకు చెందిన దుతీ 100 మీటర్ల హీట్స్‌ను 11.83 సెకన్లలో పూర్తి చేసి ఫైనల్‌కు చేరింది. ఈ క్రమంలో దుతీ 11.84 సెకన్లతో జ్యోతి పేరిట ఉన్న జాతీయ క్రీడల రికార్డును తిరగరాసింది. ప్రస్తుతం తెలంగాణ 18 పతకాలతో (6 స్వర్ణాలు, 7 రజతాలు, 5 కాంస్యాలు) పదో స్థానంలో... ఆంధ్రప్రదేశ్ 14 పతకాలతో (5 స్వర్ణాలు, 3 రజతాలు, 6 కాంస్యాలు) 14వ స్థానంలో ఉన్నాయి. సర్వీసెస్ 90 పతకాలతో (55 స్వర్ణాలు, 16 రజతాలు, 19 కాంస్యాలు) అగ్రస్థానంలో కొనసాగుతోంది.