Telangana players
-
జాతీయ స్కూల్స్ చెస్‌లో తెలంగాణకు ఏడు పతకాలు
సాక్షి, హైదరాబాద్: జాతీయ స్కూల్స్ చెస్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ క్రీడాకారులు పతకాల పంట పండించారు. తమిళనాడులో జరిగిన ఈ పోటీల్లో తెలంగాణకు ఏడు పతకాలు లభించాయి. ఇందులో ఐదు స్వర్ణాలు, ఒక రజతం, ఒక కాంస్యం ఉన్నాయి. అండర్–15 బాలుర విభాగంలో వేముల అద్వైత్ విఘ్నేశ్ (7.5 పాయింట్లు)... అండర్–15 బాలికల విభాగంలో యశ్వి జైన్ (7 పాయింట్లు)... అండర్–13 బాలుర విభాగంలో చల్లా సహర్ష (8 పాయింట్లు)... అండర్–11 బాలికల విభాగంలో మోదిపల్లి దీక్షిత (7.5 పాయింట్లు)... అండర్–9 బాలికల విభాగంలో పుంగవనం సంహిత (8 పాయింట్లు) పసిడి పతకాలు గెలిచారు. అండర్–7 బాలుర విభాగంలో ఆదుళ్ల దివిత్ రెడ్డి (7.5 పాయింట్లు) కాంస్యం, అండర్–7 బాలికల విభాగంలో బోగా వంశిక (7 పాయింట్లు) రజతం సాధించారు. పతకాలు సాధించిన వారికి నెలనెలా భారత గ్రాండ్‌మాస్టర్ ఎం.శ్యామ్సుందర్తో ఉచిత శిక్షణ శిబిరం ఏర్పాటు చేస్తామని తెలంగాణ రాష్ట్ర చెస్ సంఘం అధ్యక్షుడు కేఎస్ ప్రసాద్ ప్రకటించారు. -
ప్రిక్వార్టర్ ఫైనల్లో భారత మహిళల జట్టు
చెంగ్డూ (చైనా): ప్రపంచ టేబుల్ టెన్నిస్ (టీటీ) టీమ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ, మనిక బత్రా, దియా చిటాలె, రీత్ టెనిసన్, స్వస్తిక ఘోష్‌లతో కూడిన భారత మహిళల జట్టు ప్రిక్వార్టర్ ఫైనల్ దశకు అర్హత సాధించింది. సోమవారం జరిగిన గ్రూప్–5 చివరి లీగ్ మ్యాచ్‌లో భారత మహిళల జట్టు 3–1తో ఈజిప్ట్‌ను ఓడించింది. తొలి మ్యాచ్‌లో జాతీయ చాంపియన్ శ్రీజ 11–6, 11–4, 11–1తో హనా గోడాపై నెగ్గగా... రెండో మ్యాచ్‌లో మనిక 8–11, 11–6, 11–7, 2–11, 11–8తో దీనా మెష్రఫ్‌ను ఓడించడంతో భారత్ 2–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. మూడో మ్యాచ్‌లో దియా 11–5, 10–12, 11–9, 9–11, 4–11తో యుస్రా హెల్మీ చేతిలో ఓడిపోయింది. నాలుగో మ్యాచ్‌లో శ్రీజ 11–8, 11–8, 9–11, 11–6తో దీనా మెష్రఫ్‌పై గెలుపొందడంతో భారత విజయం ఖరారైంది. నాలుగు జట్లున్న గ్రూప్–5లో భారత్ ఐదు పాయింట్లతో రెండో స్థానంలో, జర్మనీ ఆరు పాయింట్లతో టాపర్‌గా నిలిచాయి. -
తెలంగాణ ‘పసిడి’ పంట
గువాహటి: ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా నాలుగు స్వర్ణ పతకాలతో ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో మంగళవారం తెలంగాణ క్రీడాకారులు అదరగొట్టారు. అండర్–21 బాలుర టేబుల్ టెన్నిస్ (టీటీ) సింగిల్స్ విభాగంలో సూరావజ్జుల స్నేహిత్ చాంపియన్‌గా అవతరించగా... అండర్–21 బాలుర సైక్లింగ్ టైమ్ ట్రయల్ ఈవెంట్లో తని‹Ù్క గౌడ్... అథ్లెటిక్స్‌లో అండర్–17 బాలికల 200 మీటర్లలో జీవంజి దీప్తి... అండర్–17 బాలికల 100 మీటర్ల హర్డిల్స్‌లో అగసార నందిని పసిడి పతకాలు సొంతం చేసుకున్నారు. టీటీ ఫైనల్స్‌లో స్నేహిత్ 9–11, 12–10, 12–10, 5–11, 11–8, 11–6తో రీగన్ అల్బుక్యూర్క్యూ (మహారాష్ట్ర)ను ఓడించి స్వర్ణ పతకాన్ని దక్కించుకున్నాడు. సైక్లింగ్ ఒక కిలోమీటర్ టైమ్ ట్రయల్ ఈవెంట్లో తనిష్క్ ఒక నిమిషం 08.352 సెకన్లలో గమ్యానికి చేరి విజేతగా నిలిచాడు. కెంగలగుట్టి వెంకప్ప (కర్ణాటక) రజతం, గుర్ప్రీత్ సింగ్ (పంజాబ్) కాంస్యం గెలిచారు. ఇంతకుముందు లాంగ్‌జంప్‌లో స్వర్ణం నెగ్గిన నందిని 100 మీటర్ల హర్డిల్స్‌లో 14.07 సెకన్లలో గమ్యానికి చేరి చాంపియన్‌గా నిలిచింది. ప్రాంజలి పాటిల్ (మహారాష్ట్ర–14.57 సెకన్లు) రజతం, ప్రియా గుప్తా (మహారాష్ట్ర–14.57 సెకన్లు) వరుసగా రజత, కాంస్య పతకాలు గెలిచారు. ప్రాంజలి, ప్రియా ఒకే సమయంలో రేసు ముగించగా... ఫొటో ఫినిష్ ద్వారా రజత, కాంస్య పతకాలను నిర్ణయించారు. ఈ క్రీడల్లోనే 100 మీటర్లలో పసిడి సొంతం చేసుకున్న దీప్తి మంగళవారం 200 మీటర్లలోనూ చిరుతలా దూసుకుపోయింది. 24.84 సెకన్లలో రేసును పూర్తి చేసి దీప్తి చాంపియన్‌గా నిలిచింది. పాయల్ (ఢిల్లీ–24.87 సెకన్లు) రజతం, సుదేష్ణ (మహారాష్ట్ర–25.24 సెకన్లు) కాంస్యం సాధించారు. తెలంగాణ 6 స్వర్ణాలు, 2 రజతాలు, 2 కాంస్యాలతో కలిపి మొత్తం 10 పతకాలతో 11వ స్థానంలో ఉంది. యశ్వంత్‌కు స్వర్ణం... ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో మంగళవారం ఆంధ్రప్రదేశ్ పసిడి బోణీ చేసింది. అండర్–21 బాలుర 110 మీటర్ల హర్డిల్స్‌లో లావేటి యశ్వంత్ కుమార్ స్వర్ణ పతకాన్ని సాధించాడు. యశ్వంత్ 14.10 సెకన్లలో గమ్యానికి చేరి విజేతగా నిలిచాడు. అండర్–21 బాలికల హైజంప్‌లో జీజీ జార్జి స్టీఫెన్ (ఆంధ్రప్రదేశ్–1.60 మీటర్లు) కాంస్యం... అండర్–21 బాలుర ట్రిపుల్ జంప్ గెయిలీ వెనిస్టర్ (ఆంధ్రప్రదేశ్–15.51 మీటర్లు) కాంస్యం సాధిం చారు. ఆంధ్రప్రదేశ్ ఒక స్వర్ణం, ఒక రజతం, మూడు కాంస్యాలతో కలిపి మొత్తం ఐదు పతకాలతో 24వ స్థానంలో ఉంది. -
టెన్నిస్ జట్టులో నలుగురు తెలంగాణ అమ్మాయిలు
న్యూఢిల్లీ: దక్షిణాసియా క్రీడల్లో పాల్గొనే భారత టెన్నిస్ జట్లను ప్రకటించారు. మహిళల జట్టులో ఏకంగా నలుగురు తెలంగాణ క్రీడాకారిణులకు చోటు లభించడం విశేషం. తెలంగాణకు చెందిన జాతీయ చాంపియన్ సౌజన్య భవిశెట్టితోపాటు కాల్వ భువన, సామ సాత్విక, చిలకలపూడి శ్రావ్య శివానిలకు జాతీయ జట్టులో స్థానం లభించింది. ఈ నలుగురితోపాటు ప్రేరణ బాంబ్రీ (ఢిల్లీ), ప్రార్థన తొంబారే (మహారాష్ట్ర) కూడా భారత జట్టులోకి ఎంపికయ్యారు. పురుషుల జట్టులో సాకేత్ మైనేని, నిక్కీ పునాచా (ఆంధ్రప్రదేశ్), విష్ణువర్ధన్ (తెలంగాణ), మనీశ్ సురేశ్ కుమార్, శ్రీరామ్ బాలాజీ, జీవన్ నెడుంజెళియన్ (తమిళనాడు) భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తారు. జాతీయ మాజీ చాంపియన్ అశుతోష్ సింగ్ భారత పురుషుల, మహిళల జట్లకు కోచ్ కమ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. దక్షిణాసియా క్రీడలు డిసెంబర్ 1 నుంచి 12 వరకు నేపాల్‌లో జరుగుతాయి. -
క్రీడాకారులకు అత్యుత్తమ శిక్షణ అందిస్తాం
క్రీడా శాఖ సమీక్షలో మంత్రి పద్మారావు గౌడ్ హామీ సాక్షి, హైదరాబాద్: బంగారు పతకాల తెలంగాణను తీర్చిదిద్దడమే లక్ష్యంగా క్రీడాకారులకు అత్యుత్తమ శిక్షణను అందిస్తామని రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి పద్మారావుగౌడ్ అన్నారు. గురువారం క్రీడా, యువజన శాఖపై సచివాలయంలోని ఆయన చాంబర్లో ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. సుమారు 3 గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. కోచ్‌ల జీతభత్యాల పెంపు, నిర్మాణంలో ఉన్న స్టేడియాల స్థితిగతులు, క్రీడా శాఖలో దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న పలు అంశాలపై చర్చలు జరిపారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో క్రీడలకు అధిక ప్రాధాన్యతనిస్తున్నామని అన్నారు. క్రీడాకారులకు అత్యుత్తమ శిక్షణ ఇప్పించాలనే కృత నిశ్చయంతో పనిచేస్తున్నామని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారులను కూడా ప్రోత్సహించి మున్ముందు ఒలింపిక్స్‌లో కూడా పతకాలు సాధించేలా పనిచేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో క్రీడా హాస్టల్స్‌ను ఏర్పాటు చేసి గ్రామీణ క్రీడాకారులకు అత్యున్నతమైన సదుపాయాలు కల్పించేందుకు కృషిచేస్తామని అన్నారు. ప్రస్తుతం క్రీడాకారులకు శిక్షణ ఇచ్చే ఒలింపియన్లను తగిన విధంగా ప్రోత్సహిస్తున్నామని, ప్రతీ జిల్లాలో కనీసం ఐదుగురు కోచ్‌లను నియమిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో క్రీడా శాఖ కార్యదర్శి వెంకటేశం, ‘శాట్స్’ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి, ఎండీ దినకర్ బాబు, ఓఎస్డీ డా. రాజేశ్వర్ రావు, స్పోర్ట్స్ స్కూల్ ఓఎస్డీ నర్సయ్య, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
బ్యాడ్మింటన్‌లో తెలంగాణకు స్వర్ణం
జాతీయ క్రీడలు తిరువనంతపురం: వరుసగా మూడో రోజు జాతీయ క్రీడల్లో తెలంగాణ క్రీడాకారులు ‘పసిడి’తో మెరిపించారు. ఆదివారం టెన్నిస్‌లో, సోమవారం కయాకింగ్‌లో తెలంగాణకు స్వర్ణ పతకాలు రాగా... ఇదే స్ఫూర్తితో మంగళవారం మహిళల టీమ్ బ్యాడ్మింటన్ ఈవెంట్లో తెలంగాణ జట్టు బంగారు పతకాన్ని సొంతం చేసుకుంది. ఆతిథ్య కేరళతో జరిగిన ఫైనల్లో రుత్విక శివాని, సిక్కి రెడ్డి, మేఘన, రితూపర్ణ దాస్, మనీషాలతో కూడిన తెలంగాణ జట్టు 2-0 తేడాతో విజయం సాధించింది. తొలి మ్యాచ్‌గా జరిగిన సింగిల్స్‌లో రితూపర్ణ దాస్ 21-14, 21-18తో పి.సి.తులసీపై నెగ్గి తెలంగాణకు 1-0 ఆధిక్యాన్ని అందించింది. రెండో మ్యాచ్‌గా జరిగిన డబుల్స్‌లో రుత్విక శివాని-సిక్కి రెడ్డి జంట 21-18, 18-21, 21-13తో అపర్ణ బాలన్-ఆరతి సునీల్ జోడీని ఓడించడంతో తెలంగాణ విజయం ఖాయమైంది. మరోవైపు కయాకింగ్‌లో తెలంగాణకు మరో పతకం వచ్చింది. పురుషుల కయాక్ సింగిల్స్ 500 మీటర్ల ఈవెంట్లో పదమ్‌కర్ ప్రసాద్ కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్నాడు. 500 మీటర్ల దూరాన్ని ప్రసాద్ ఒక నిమిషం 54 సెకన్లలో పూర్తిచేసి మూడో స్థానంలో నిలిచాడు. ఓవరాల్‌గా క్రీడల పదో రోజు తెలంగాణకు రెండు పతకాలు రాగా... ఆంధ్రప్రదేశ్ ఖాతాలో ఒక్క పతకమూ చేరలేదు. అథ్లెటిక్స్‌లో వివాదాస్పద మహిళా స్ప్రింటర్ దుతీ చంద్ హీట్స్‌లోనే మీట్ రికార్డు నెలకొల్పింది. ఒడిశాకు చెందిన దుతీ 100 మీటర్ల హీట్స్‌ను 11.83 సెకన్లలో పూర్తి చేసి ఫైనల్‌కు చేరింది. ఈ క్రమంలో దుతీ 11.84 సెకన్లతో జ్యోతి పేరిట ఉన్న జాతీయ క్రీడల రికార్డును తిరగరాసింది. ప్రస్తుతం తెలంగాణ 18 పతకాలతో (6 స్వర్ణాలు, 7 రజతాలు, 5 కాంస్యాలు) పదో స్థానంలో... ఆంధ్రప్రదేశ్ 14 పతకాలతో (5 స్వర్ణాలు, 3 రజతాలు, 6 కాంస్యాలు) 14వ స్థానంలో ఉన్నాయి. సర్వీసెస్ 90 పతకాలతో (55 స్వర్ణాలు, 16 రజతాలు, 19 కాంస్యాలు) అగ్రస్థానంలో కొనసాగుతోంది. -
రాహుల్, వృశాలి శుభారంభం
జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ సాక్షి, విజయవాడ: తెలంగాణ క్రీడాకారులు సి. రాహుల్ యాదవ్, జి. వృశాలి జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో శుభారంభం చేశారు. ఇక్కడి డీఆర్ఎంసీ ఇండోర్ స్టేడియంలో సోమవారం వ్యక్తిగత విభాగంలో మెయిన్ డ్రా మ్యాచ్‌లను ఏపీ సీఎం చంద్రబాబునాయుడు లాంఛనంగా ప్రారంభించారు. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో రాహుల్ 21-12, 21-12తో మనజీత్ సింగ్ (త్రిపుర)పై గెలిచి రెండో రౌండ్లోకి ప్రవేశించాడు. కిరణ్ కుమార్ (టీఎస్) 21-9, 13-21, 14-21తో ఆశిష్ శర్మ (ఢిల్లీ) చేతిలో పరాజయం చవిచూడగా... వికాస్ హర్ష (ఏపీ) 21-10, 21- 18తో కబీర్ కంజార్కర్ (మహారాష్ట్ర)పై, భార్గవ రెడ్డి (ఏపీ) 21-13, 21-15తో రాజు ఛెత్రి (నాగాలాండ్)పై గెలిచారు. మహిళల సింగిల్స్‌లో వృశాలి 21-14, 21-12తో రుతపర్ణ పండ (ఒరిస్సా)పై, ప్రాషి జోషి (టీఎస్) 21-7, 21-7తో జైసీ బ్రిడ్జెట్టి (పుదుచ్చేరి)పై గెలిచారు. కె.వైష్ణవి (టీఎస్) 17-21, 21-3, 21-11తో ప్రతాన తాప (నాగాలాండ్)పై, పూర్ణిమ (ఏపీ) 21-15, 21-14తో నిషా (చండీగఢ్)పై, సాయి ఉత్తేజిత (ఏపీ) 21-10, 21-16తో సీమ (హరియాణా)పై విజయం సాధించారు. ఎయిరిండియాకు ఆడుతున్న తెలుగమ్మాయి హారిక 21-4, 21-8తో జూహి దేవాంగన్ (చండీగఢ్)పై గెలిచింది.