క్రీడాకారులకు అత్యుత్తమ శిక్షణ అందిస్తాం
క్రీడా శాఖ సమీక్షలో మంత్రి పద్మారావు గౌడ్ హామీ
సాక్షి, హైదరాబాద్: బంగారు పతకాల తెలంగాణను తీర్చిదిద్దడమే లక్ష్యంగా క్రీడాకారులకు అత్యుత్తమ శిక్షణను అందిస్తామని రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి పద్మారావుగౌడ్ అన్నారు. గురువారం క్రీడా, యువజన శాఖపై సచివాలయంలోని ఆయన చాంబర్‌లో ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. సుమారు 3 గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. కోచ్‌ల జీతభత్యాల పెంపు, నిర్మాణంలో ఉన్న స్టేడియాల స్థితిగతులు, క్రీడా శాఖలో దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న పలు అంశాలపై చర్చలు జరిపారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో క్రీడలకు అధిక ప్రాధాన్యతనిస్తున్నామని అన్నారు.
క్రీడాకారులకు అత్యుత్తమ శిక్షణ ఇప్పించాలనే కృత నిశ్చయంతో పనిచేస్తున్నామని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారులను కూడా ప్రోత్సహించి మున్ముందు ఒలింపిక్స్‌లో కూడా పతకాలు సాధించేలా పనిచేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో క్రీడా హాస్టల్స్‌ను ఏర్పాటు చేసి గ్రామీణ క్రీడాకారులకు అత్యున్నతమైన సదుపాయాలు కల్పించేందుకు కృషిచేస్తామని అన్నారు. ప్రస్తుతం క్రీడాకారులకు శిక్షణ ఇచ్చే ఒలింపియన్లను తగిన విధంగా ప్రోత్సహిస్తున్నామని, ప్రతీ జిల్లాలో కనీసం ఐదుగురు కోచ్‌లను నియమిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో క్రీడా శాఖ కార్యదర్శి వెంకటేశం, ‘శాట్స్’ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి, ఎండీ దినకర్ బాబు, ఓఎస్డీ డా. రాజేశ్వర్ రావు, స్పోర్ట్స్ స్కూల్ ఓఎస్డీ నర్సయ్య, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.