సాక్షి, హైదరాబాద్: బీజేపీ సీనియర్ నేత కిషన్‌రెడ్డితో భేటీ దరిమిలా టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ బీజేపీలో చేరతారంటూ ప్రచారం తెర మీదకు వచ్చింది. అయితే ఆ ఊహాగానాలకు తెర దించుతూ కేటీఆర్‌తో ఫొటో దిగి మరీ సోషల్ మీడియాలో ఫొటోను షేర్ చేశారు. తాజాగా.. తన నియోజకవర్గంలోని సీతాఫల్ మండిలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి.. పార్టీ మారే ప్రచారాన్ని ఖండించారు.
‘‘నా ఊపిరి ఉన్నంతవరకు టిఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతా. ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబంతోనే ఉంటా. పార్టీలో నేను ఆత్మ సంతృప్తితో ఉన్నా. సికింద్రాబాద్ నుంచే మళ్లీ బరిలో దిగుతా. హైకమాండ్ గనుక ఆదేశిస్తే.. జపాన్ నుంచైనా పోటీ చేస్తా’’ అని పద్మారావు ప్రకటించారు. బీజేపీ నుంచి తనను ఎవరూ సంప్రదించలేదని, ఏ పార్టీ లోకి వెళ్లాల్సిన అవసరం తనకు లేదని, టీఆర్‌ఎస్‌లో సంతృప్తిగానే ఉన్నట్లు పద్మారావు స్పష్టం చేశారు.
కిషన్‌రెడ్డితో వ్యక్తిగత బంధం..
బీజేపీ సీనియర్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో నాకు వ్యక్తిగత సంబంధం ఉంది. అందుకే ఆయన్ని నా కూతురు వివాహానికి ఆహ్వానించా. పెళ్లికి ఆయన రాలేక పోయారు కాబట్టి మా ఇంటికి వచ్చారు అని భేటీపై స్పష్టత ఇచ్చారు.
ఇక మునుగోడులో గెలుపు టీఆర్‌స్‌దేనన్న పద్మారావు.. గవర్నర్ తమిళిసై పైనా విమర్శలు గుప్పించారు. సికింద్రాబాద్ నియోజకవర్గానికి 102 కోట్ల అభివృద్ధి పనులు మంజూరయ్యాయని, కానీ.. కేంద్రం నుంచి ఎలాంటి నిధులు రాలేదని తెలిపారు. తమిళిసై తెలంగాణకు గవర్నర్ అని, పాక్‌కు కాదని ఎద్దేవా చేశారు.
గవర్నర్ వద్ద చాలా ఫైల్స్ పెండింగ్‌లో ఉన్నాయని, అవసరానికి తగ్గట్లు నిర్ణయాలు ఉండాలని పేర్కొన్నారు. నల్లగొండ మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ పార్టీ మారిక వ్యవహారంపై స్పందిస్తూ.. ఎంపీగా ఉన్నప్పుడు ఆత్మగౌరవం గుర్తు రాలేదా? అప్పుడే రాజీనామా చేసి వెళ్లొచ్చు కదా? అని పద్మారావు నిలదీశారు.
మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ టీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసిన నేపథ్యంలో పద్మారావు కూడా పార్టీని వీడుతున్నట్లు సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం జరిగింది. దీనికి తోడు మునుగోడు ప్రచారానికి ఆయన దూరంగా ఉండడంతో ఆ ప్రచారానికి మరింత బలం చేకూరుంది. అయితే ఆయన ప్రచారంలో పాల్గొంటారని తాజాగా టీఆర్‌ఎస్ శ్రేణులు స్పష్టత ఇచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment