హైదరాబాద్ : బోనాల ఉత్సవాలకు ప్రసిద్ధి చెందిన కీలకమైన సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో ఎన్నికలు ఈసారి ఆసక్తి రేపుతున్నాయి. పూర్తిగా సిటీ ఓటర్లున్న ఈ లోక్‌సభ నియోజకవర్గంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తనయుడు, యువ నాయకుడు తలసాని సాయికిరణ్ టీఆర్‌ఎస్ తరఫున తొలిసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఘనవిజయం సాధించడంతో సాయికిరణ్ గెలుపు ఈసారి నల్లేరు మీద నడకేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రచారంలో దూసుకుపోతున్న సాయికిరణ్ అన్ని వర్గాల ఆదరణను చూరగొంటూ.. ప్రజలతో మమేకమవుతున్నారు. యువనేత తలసాని సాయికిరణ్ ప్రొఫైల్ ఇది..
తలసాని శ్రీనివాస్, స్వర్ణ దంపతులకు 1986, మే 13లో జన్మించారు. ఆస్ట్రేలియాలోని హ్యూమన్ రిసోర్సెస్ మేనేజ్‌మెంట్ అండ్ ఇండస్ట్రీయల్ రిలేషన్స్‌లో ఎంబీఏ పూర్తి చేశారు. ప్రజలకు సేవలందించే తత్వమున్న సాయికిరణ్, అందులో భాగంగా భారత్‌కు తిరిగొచ్చాక.. ఆశాకిరణ్ పేరుతో ఒక స్వచ్ఛంద సంస్థను నెలకొల్పారు. అనాథ పిల్లలు, అత్యాచార బాధితులకు ఆశ్రయమివ్వడమే ఈ సంస్థ ఆశయం. అలాగే తలసాని సాయి సేవాదళ్ పేరుతో అనాథ పిల్లలకు ఆహారం పంపిణీ కూడా మొదలుపెట్టారు.
2014లో టీఆర్‌ఎస్‌లో చేరిన సాయికిరణ్, పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ వచ్చారు. గతేడాది జరిగిన ముందస్తు ఎన్నికల్లో.. సనత్‌నగర్, కూకట్‌పల్లి, సికింద్రాబాద్ నియోజకవర్గాల్లోని ఇంటింటికీ తిరుగుతూ టీఆర్‌ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం చాలా కృషి చేశారు. ఇలా పలు కార్యక్రమాలతో, టీఆర్‌ఎస్ కార్యకర్తలు, ప్రజల్లోనూ సాయికిరణ్ మంచి ఇమేజ్ సంపాదించుకున్నారు. దీన్నిగుర్తించిన సీఎం కేసీఆర్, లష్కర్ ఎంపీ సీటుకు సాయికిరణ్ సరైన అభ్యర్థని, ఆయనను ఎంపిక చేసినట్టు గులాబీ వర్గాలు తెలిపాయి. ఒకవైపు తండ్రి శ్రీనివాస్ యాదవ్ వారసత్వం, మరోవైపు వరుస విజయాలతో దూసుకెళ్తున్న కారు పార్టీ, అధినాయకుడు కేసీఆర్ చరిష్మా.. సాయి కిరణ్‌ను సికింద్రా'బాద్'షాను చేస్తాయని గులాబీ వర్గాలు బలంగా విశ్వసిస్తున్నాయి.
(సాక్షి అడ్వర్ట్‌టోరియల్)
Comments
Please login to add a commentAdd a comment