కంటోన్మెంట్ ఎన్నికల్లో ‘గులాబీ’ హవా
4 వార్డుల్లో టీఆర్‌ఎస్.. 2 చోట్ల టీఆర్‌ఎస్ రెబెల్స్ పాగా
ఒకచోట కాంగ్రెస్, మరోచోట స్వతంత్ర అభ్యర్థి విజయం
ఖాతా తెరవని టీడీపీ-బీజేపీ కూటమి
డిపాజిట్ కోల్పోయిన సర్వే వారసులు
గెలవని సాయన్న కూతురు
హైదరాబాద్: సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్ జయకేతనం ఎగురవేసింది. మొత్తం ఎనిమిది వార్డులకుగానూ.. టీఆర్‌ఎస్ నాలుగు వార్డుల్లో గెలుపొంది ఆధిక్యంలో నిలిచింది. మంగళవారం ఉదయం సికింద్రాబాద్ పీజీ కళాశాలలో ప్రారంభమైన ఓట్ల లెక్కింపు ఆద్యంతం ఆసక్తిని రేకెత్తించింది. రెండో వార్డులో కేశవరెడ్డి, నాలుగో వార్డులో నళిని కిరణ్, ఆరో వార్డులో పాండు యాదవ్, ఎనిమిదో వార్డులో లోకనాథం కారు గుర్తుపై గెలుపొందారు.
మొదటి వార్డులో టీఆర్‌ఎస్ రెబెల్ అభ్యర్థి జక్కుల మహేశ్వర్‌రెడ్డి, మూడో వార్డులో టీఆర్‌ఎస్ రెబెల్ అభ్యర్థి అనిత ప్రభాకర్ విజయం సాధించారు. ఐదో వార్డులో స్వతంత్ర అభ్యర్థి రామకృష్ణ, ఏడో వార్డులో కాంగ్రెస్ అభ్యర్థిని పి.భాగ్యశ్రీ గెలుపొందారు. ఎనిమిది వార్డుల్లో మొత్తం 74,712 ఓట్లు పోలవ్వగా.. ఇందులో 22,788 ఓట్లు సాధించి టీఆర్‌ఎస్ ప్రథమ స్థానంలో నిలిచింది. టీడీపీ-బీజేపీ కూటమికి 13,713 ఓట్లు, కాంగ్రెస్ పార్టీకి 9,641 ఓట్లు దక్కాయి.
ఉపాధ్యక్ష పదవి టీఆర్‌ఎస్‌కే..
బోర్డు ఉపాధ్యక్ష పదవిని దక్కించుకునేందుకు టీఆర్‌ఎస్‌కు ఒక వార్డు సభ్యుని మద్దతు దొరికితే సరిపోతుంది. బోర్డు ఎన్నికల్లో టీఆర్‌ఎస్ బలపరిచిన అభ్యర్థులు నాలుగు స్థానాల్లో గెలుపొందారు. రెండు వార్డుల్లో పార్టీ రెబెల్స్, మరో స్థానంలో స్వతంత్ర అభ్యర్థి గెలుపొందిన నేపథ్యంలో ఉపాధ్యక్ష పదవిని దక్కించుకోవడం టీఆర్‌ఎస్‌కు కష్టసాధ్యం కాదన్నది స్పష్టమవుతోంది. రెబెల్స్, స్వతంత్రులను కలుపుకునిపోతామని ఇప్పటికే మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు ప్రకటించడం గమనార్హం.
నేతల వారసులకు ఎదురుదెబ్బ..
నాలుగో వార్డు నుంచి పోటీ చేసిన స్థానిక టీడీపీ ఎమ్మెల్యే సాయన్న కూతురు లాస్య నందిత రెండో స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక రెండు, ఐదో వార్డుల నుంచి బరిలో నిలిచిన కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ కూతురు సుహాసినీ, కొడుకు నవనీత్ డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయారు.
రెండో వార్డులో సుహాసినీ 560 ఓట్లతో నాలుగో స్థానంలోనూ.. ఐదో వార్డులో నవనీత్ 341 ఓట్లతో ఆరో స్థానంలోనూ నిలిచారు. ఇక స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలు టీడీపీకి చెందినవారే అయినా ఆ పార్టీ పోటీ చేసిన ఐదు స్థానాల్లోనూ ఓటమిపాలైంది. టీడీపీ మిత్రపక్షం బీజేపీ మూడు స్థానాల్లో పోటీ చేసినా ఒక్కచోటా గెలవలేకపోయింది.