ఎమ్మెల్యే పద్మారావుగౌడ్‌ను ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన కేసీఆర్
భువనగిరి నుంచి క్యామ మల్లేశ్, నల్లగొండ నుంచి కంచర్ల పోటీ
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ పార్లమెంటు స్థానం నుంచి బీఆర్‌ఎస్ అభ్య ర్థిగా మాజీ మంత్రి, సికింద్రాబాద్ ఎమ్మెల్యే తిగుళ్ల పద్మారావు గౌడ్ పేరును పార్టీ అధినేత కె. చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ఈ మేరకు శనివారం ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఇతర కీలక నేతలతో కేసీఆర్ భేటీ అయ్యారు. సుమారు వారంపాటు ఢిల్లీలో ఉన్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు కూడా శనివారం జరిగిన ఈ భేటీకి హాజరయ్యారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు, ముఖ్య నేతలతో చర్చించి అందరి అభిప్రాయం మేరకే పద్మారావు గౌడ్ అభ్య ర్థిత్వాన్ని ఖరారు చేసినట్లు బీఆర్‌ఎస్ ప్రకటించింది.
అలాగే నల్లగొండ లోక్‌సభ బీఆర్‌ఎస్ అభ్య ర్థిగా కంచర్ల కృష్ణారెడ్డి పేరును గతంలోనే ఖరారు చేయగా తాజాగా మరోమారు కీలక నేతలతో కేసీఆర్ ఫోన్లో మాట్లాడారు. నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డికి కంచర్ల కృష్ణారెడ్డి సోదరుడు కావడం గమనార్హం. భువనగిరి స్థానం నుంచి కురుమ సామాజికవర్గానికి చెందిన క్యామ మల్లేశ్ యాదవ్ పేరును ఖరారు చేశారు. భువనగిరి లోక్‌సభ నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డితోపాటు జిట్టా బాలకృష్ణారెడ్డి, దూదిమెట్ల బాలరాజు యాదవ్ తదితరుల పేర్లను పరిశీలించినా సామాజికవర్గ సమీకరణల్లో భాగంగా క్యామ మల్లేశ్ అభ్య ర్థిత్వం వైపు కేసీఆర్ మొగ్గు చూపారు.
మొత్తంగా 17 ఎంపీ సీట్లకుగాను తాజాగా ప్రకటించిన ముగ్గురు పేర్లతో బీఆర్‌ఎస్ 16 సీట్లకు అభ్యర్థులను ప్రకటించినట్లయింది. హైదరాబాద్ లోకసభ స్థానం నుంచి కూడా బలమైన అభ్య ర్థిని బరిలోకి దింపుతామని బీఆర్‌ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఒకట్రెండు రోజుల్లో హైదరాబాద్ నుంచి పోటీ చేసే అభ్యర్థి ఎవరనే అంశంపై స్పష్టత రానుంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానానికి జరిగే ఉప ఎన్నిక అభ్యర్థి పేరును కూడా వీలైనంత త్వరగా ప్రకటిస్తామని కేసీఆర్ వెల్లడించినట్లు సమాచారం. కాగా, భువనగిరి నుంచి తనను అభ్య ర్థిగా ఎంపిక చేయడం పట్ల కృతజ్ఞతలు తెలుపుతూ క్యామ మల్లేశ్ యాదవ్ శనివారం కేసీఆర్‌ను కలిశారు. మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం ఈ భేటీలో పాల్గొన్నారు.
ఎంపీగా పోటీకి విముఖత చూపినా బుజ్జగించి..
బీఆర్‌ఎస్ సీనియర్ నేతగా, తెలంగాణ ఉద్యమ కాలం నుంచి నేటి వరకు పారీ్టకి విధేయుడుగా వున్న పద్మారావు గౌడ్ అందరివాడిగా గుర్తింపు తెచ్చుకున్నందునే ఆయన పేరును ఖరారు చేసినట్లు కేసీఆర్ ప్రకటించారు. సికింద్రాబాద్ అభివృద్ధికి చేసిన కృషి, స్థానిక నేతగా ‘పజ్జన్న’గా ఆదరాభిమానాలు పొందిన పద్మారావు గౌడ్ సరైన అభ్య ర్థిగా సమావేశం ఏకగ్రీవంగా అంగీకరించినట్లు బీఆర్‌ఎస్ వెల్లడించింది. రెండు రోజుల క్రితం పద్మారావు అభ్య ర్థిత్వం తెరపైకి రాగా పోటీకి ఆయన విముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది. అయితే పద్మారావుతోపాటు ఆయన కుటుంబ సభ్యులను ఎర్రవెల్లి ఫాంహౌస్‌కు పిలిచి మరీ బుజ్జగించినట్లు సమాచారం.
జాబితాలో బీసీలకు ప్రాధాన్యత
ఇప్పటి వరకు ప్రకటించిన 16 లోక్‌సభ స్థానాల్లో బీఆర్‌ఎస్ బీసీలకు ప్రాధాన్యత ఇస్తూ అభ్యర్థులను ఖరారు చేసింది. సామాజికవర్గాలవారీగా రెడ్లకు 4, మున్నూరు కాపు 2, మాదిగలకు 2, కమ్మ, వెలమ, ముదిరాజ్, గౌడ, కురుమ, లంబాడా, గోండులకు ఒక్కో సీటు చొప్పున కేటాయించింది. హైదరాబాద్ నుంచి కూడా బీసీ అభ్య ర్థినే రంగంలోకి దింపే అవకాశం ఉంది. దీంతో జనరల్ స్థానాల్లో సగం చోట్ల బీసీ అభ్యర్థులే పోటీ చేయనున్నట్లు కానుంది. బీఆర్‌ఎస్‌కు ప్రస్తుతం లోక్‌సభలో తొమ్మిది మంది ఎంపీలు ఉండగా వారిలో సిట్టింగ్ ఎంపీలు నామా నాగేశ్వర్‌రావు, మాలోత్ కవిత, మన్నె శ్రీనివాస్‌రెడ్డి మాత్రమే పోటీ చేస్తున్నారు. మరో ఐదుగురు ఎంపీలు కాంగ్రెస్, బీజేపీలలో చేరారు.
Comments
Please login to add a commentAdd a comment