
కౌలాలంపూర్: చిన్న గెలుపును కూడా ధూమ్ ధామ్ చేస్తూ ఆర్భాటంగా జరుపుకునే రోజులివి. అలాంటిది తన గెలుపును తనతో పాటు ఓడిన వ్యక్తితో కలిపి జరుపుకుని అసలైన ఛాంపియన్ గా నిలిచాడు పారా కరాటే ఛాంపియన్ ఫర్జాద్ సఫావి.
మలేషియాలోని మెలాకాలో జరిగిన ఏషియన్ పారా కరాటే చాంపియన్ షిప్ పోటీల్లో హృదయాలను కదిలించే సంఘటన ఒకటి చోటు చేసుకుంది. పారా కరాటే చాంపియన్ షిప్ పోటీల్లో ఇరాన్ ఆటగాడు ఫర్జాద్ సఫావి బంగారు పతకాన్ని గెలుచుకున్నాడని ప్రకటించగానే అతడు మొదట ప్రేక్షకులకు సంప్రదాయబద్ధంగా వంగి అభివాదం చేశాడు. అనంతరం ఫైనల్లో తనపై ఓటమి పాలై రన్నరప్ గా నిలిచిన ఆటగాడు స్టేజి విడిచి వెళ్తోన్న విషయాన్ని గమనించి పరుగున అతడి వద్దకు వెళ్లి అతని చేతిని పైకి ఎత్తి తన విజయాన్ని అతనికి కూడా ఆపాదించాడు.
దీంతో ఈ వీడియో చూసిన వారంతా ఛాంపియన్ ఆటగాడు ఛాంపియన్ లా వ్యవహరించాడంటూ అతడిపై ప్రశంసల వర్షాన్ని కురిపిస్తున్నారు. ఈ సంఘటన తాలూకు వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఈ దృష్యాన్ని చూసిన వారెవరైనా భావోద్వేగానికి లోనుకావడం ఖాయం. శుభాకాంక్షలు ఫర్జాద్ క్రీడాస్ఫూర్తి అంటే ఏంటో చూపించావు. దయార్ద హృదయంతో మా హృదయాలను గెలుచుకున్నావు. నుసిక్యూ అసలైన చాంపియన్ అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.
ఇది కూడా చదవండి: నాన్న చనిపోయారు.. కానీ ఆయన గుండె చప్పుడు విన్నారు..