
బ్యూనస్ ఎయిర్స్ (అర్జెంటీనా): బరిలోకి దిగిన తొలిసారే స్వర్ణం సాధించి చరిత్ర సృష్టించాలని ఆశించిన భారత హాకీ జట్లకు నిరాశ ఎదురైంది. యూత్ ఒలింపిక్స్‌లో భాగంగా మొదటిసారి నిర్వహించిన ఫైవ్–ఎ–సైడ్ హాకీ పోటీల్లో భారత పురుషుల జట్టు మాదిరిగానే భారత మహిళల జట్టు కూడా రజతంతో సంతృప్తి పడింది. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఫైనల్లో భారత్ 1–3 గోల్స్ తేడాతో ఆతిథ్య అర్జెంటీనా చేతిలో పరాజయం పాలైంది. ముంతాజ్ ఖాన్ చేసిన గోల్‌తో భారత్ తొలి నిమిషంలోనే 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే వెంటనే తేరుకున్న అర్జెంటీనా ఏడో నిమిషంలో గియానెల్లా గోల్‌తో స్కోరును 1–1తో సమం చేసింది.
తొమ్మిదో నిమిషంలో సోఫియా రమాల్లో... 12వ నిమిషంలో బ్రిసా బ్రుగెస్సర్ ఒక్కో గోల్ చేయడంతో అర్జెంటీనా 3–1తో ముందంజ వేసింది. ఆ తర్వాత ఈ ఆధిక్యాన్ని కాపాడుకున్న అర్జెంటీనా స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. పురుషుల విభాగం ఫైనల్లో టీమిండియా 2–4తో మలేసియా చేతిలో ఓడిపోయిన సంగతి విదితమే. మూడు రోజులు మిగిలి ఉన్న ఈ క్రీడల్లో భారత్ 3 స్వర్ణాలు, 7 రజతాలతో కలిపి మొత్తం 10 పతకాలతో పదో స్థానంలో ఉంది. ఆర్చరీ వ్యక్తిగత విభాగంలో భారత ఆర్చర్లు ఆకాశ్, హిమాని ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. తొలి రౌండ్‌లో ఆకాశ్ 6–5తో లీ బెంజిమిన్ (కెనడా)పై, హిమాని 7–1తో జిల్ వాల్టర్ (సమోవా)పై గెలుపొందారు.
Comments
Please login to add a commentAdd a comment