
జైపూర్: బౌలర్లు, బ్యాట్స్‌మెన్ సమష్టిగా రాణించడంతో దేశవాళీ రంజీ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్‌లో ఆంధ్ర జట్టు రెండో విజయాన్ని సాధించింది. రాజస్తాన్‌తో జరిగిన ఎలైట్ గ్రూప్ ‘ఎ’ లీగ్ మ్యాచ్‌లో ఆంధ్ర 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. 152 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన ఆంధ్ర 4 వికెట్లు కోల్పోయి 49.5 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించి విజయాన్ని అందుకుంది. ఒకదశలో 50 పరుగులకు 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ఆంధ్ర జట్టును కెప్టెన్ హనుమ విహారి (107 బంతుల్లో 52 నాటౌట్; 9 ఫోర్లు), వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ శ్రీకర్ భరత్ (64 బంతుల్లో 50; 8 ఫోర్లు, సిక్స్) బాధ్యతాయుత ఆటతీరుతో ఆదుకున్నారు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 88 పరుగులు జోడించి విజయాన్ని ఖాయం చేశారు.
అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 243/8తో రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన రాజస్తాన్ 257 పరుగులకు ఆలౌటైంది. చీపురుపల్లి స్టీఫెన్ (3/78), శశికాంత్ (3/66) మరోసారి తమ పేస్ ప్రతాపం చూపించారు. మ్యాచ్‌లో కీలకమైన 7 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన శశికాంత్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు. తాజా విజయంతో ఆంధ్రకు 6 పాయింట్లు దక్కాయి. దీంతో ఎలైట్ గ్రూప్ ‘ఎ’ అండ్ ‘బి’లో ఇప్పటివరకు రెండు విజయాలు, రెండు ‘డ్రా’లతో 14 పాయింట్లు సాధించిన ఆంధ్ర పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది. ఆంధ్ర తదుపరి మ్యాచ్‌ను ఈ నెల 11 నుంచి ఒంగోలులో హైదరాబాద్‌తో ఆడుతుంది.
హైదరాబాద్ బోణీ...
హ్యాట్రిక్ పరాజయాలతో డీలా పడ్డ హైదరాబాద్ ఎట్టకేలకు నాలుగో మ్యాచ్‌లో గెలిచి ఊపిరి పీల్చుకుంది. హైదరాబాద్ వేదికగా కేరళతో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 6 వికెట్ల తేడాతో నెగ్గింది. ఓవర్‌నైట్ స్కోరు 204/7తో సోమవారం రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన కేరళ 86.5 ఓవర్లలో 218 పరుగులకు ఆలౌటైంది. హైదరాబాద్‌కు 155 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. హైదరాబాద్ 46 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. తన్మయ్ (32; 4 ఫోర్లు), అక్షత్ రెడ్డి (32; 4 ఫోర్లు, సిక్స్), మల్లికార్జున్ (38; 4 ఫోర్లు, 1 సిక్స్), హిమాలయ్ అగర్వాల్ (34 నాటౌట్; 5 ఫోర్లు) రాణించారు. తొలి ఇన్నింగ్స్‌లో అజేయ సెంచరీతో కదం తొక్కిన హైదరాబాద్ కీపర్ కొల్లా సుమంత్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఈ విజయంతో హైదరాబాద్ ఖాతాలో 6 పాయింట్లు చేరాయి.