ఐదోసారి ఫైనల్లోకి ముర్రే
మెల్‌బోర్న్: ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో బ్రిటన్ టెన్నిస్ స్టార్ ఆండీ ముర్రే ఐదోసారి ఫైనల్లోకి దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో సెమీఫైనల్లో రెండో సీడ్ ముర్రే 4-6, 7-5, 6-7 (4/7), 6-4, 6-2తో 13వ సీడ్ మిలోస్ రావ్‌నిచ్ (కెనడా)పై విజయం సాధించాడు. గతంలో ఫైనల్‌కు చేరిన నాలుగుసార్లూ రన్నరప్‌తోనే సరిపెట్టుకున్న ముర్రే ఈసారి ఏం చేస్తాడో వేచి చూడాలి. ఆదివారం జరిగే ఫైనల్లో టాప్ సీడ్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా)తో ముర్రే తలపడతాడు. 2010 ఫైనల్లో ఫెడరర్ చేతిలో ఓడిన ముర్రే... 2011, 2013, 2015లలో జొకోవిచ్ చేతిలో ఓడిపోయి రన్నరప్‌తో సంతృప్తి పడ్డాడు.
నేడు మహిళల ఫైనల్ (సెరెనా X కెర్బర్)
మహిళల సింగిల్స్ టైటిల్ కోసం నేడు (శనివారం) జరిగే ఫైనల్లో టాప్ సీడ్, డిఫెండింగ్ చాంపియన్ సెరెనా విలియమ్స్ (అమెరికా)తో ఏడో సీడ్ ఎంజెలిక్ కెర్బర్ (జర్మనీ) తలపడుతుంది. ఇప్పటికే 21 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన సెరెనా ఫైనల్లో నెగ్గితే... ఓపెన్ శకంలో అత్యధికంగా 22 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ సొంతం చేసుకున్న స్టెఫీ గ్రాఫ్ (జర్మనీ) సరసన నిలుస్తుంది. కెర్బర్ గెలిస్తే... 1994లో స్టెఫీ గ్రాఫ్ తర్వాత ఆస్ట్రేలియన్ ఓపెన్ నెగ్గిన మరో జర్మనీ క్రీడాకారిణిగా గుర్తింపు పొందుతుంది.