జంబో భుజాలు అరిగిపోయేలా.. | Anil kumble birthday special.. | Sakshi
Sakshi News home page

జంబో భుజాలు అరిగిపోయేలా..

Published Tue, Oct 17 2017 11:28 AM | Last Updated on Tue, Oct 17 2017 11:47 AM

Anil kumble  birthday special..

ఒకప్పుడు టీమిండియాలో సచిన్‌ పెద్దన్నగా ఉండేవాడు. కెప్టెన్‌ కాకపోయినప్పటికీ జట్టులో ఏదైనా వివాదం తలెత్తితే సచిన్‌ రంగంలోకి దిగేవాడు. బోర్డుతోనూ పెద్దన్నగానే వ్యవహరించేవాడు. ఆ తర్వాత జట్టులో పెద్దన్నగా వ్యవహరించింది....ఆనాటి మేటి బౌలర్‌ అనిల్‌ కుంబ్లే. భుజాలు అరిగిపోయేలా అతనితో కెప్టెన్లు ఎడాపెడా బౌలింగ్‌ చేయించినా కుంబ్లే ముఖంలో ఎప్పుడూ  చిరునవ్వు ఉండేది. క్రికెట్‌లో కుంబ్లే సాధించిన విజయాలు ఒక ఎత్తయితే వివాద రహితుడిగా కెరీర్‌ను కొనసాగించడం మరోఎత్తు. కెప్టెన్, జట్టులోని ఆటగాళ్లు, బోర్డుతోనూ ఏనాడూ కుంబ్లే వివాదాలకు తెరతీయలేదు.  నేడు ఆయన పుట్టిన రోజు సందర్భంగా కుంబ్లే గురించి మరిన్ని విశేషాలు..!      
    

బ్యాటింగ్‌ చేసినా, బౌలింగ్‌ చేసినా, ఫీల్డింగ్‌ చేసినా ఎప్పుడూ జట్టు ప్రయోజనాల గురించే ఆలోచించిన అతి కొద్దిమందిలో కుంబ్లే కచ్చితంగా చోటు సంపాదించుకుంటాడు. ఇన్ని ప్రత్యేకతలున్న కుంబ్లే రికార్డుల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. రికార్డులకన్నా గొప్పది అతని వ్యక్తిత్వం. బ్యాటింగ్‌ చేసినా, బౌలింగ్‌ చేసినా, ఫీల్డింగ్‌ చేసినా ఎప్పుడూ జట్టు ప్రయోజనాల గురించే ఆలోచించిన అతి కొద్ది మందిలో కుంబ్లే ఖచ్చితంగా చోటు సంపాదించుకుంటాడు. ఇన్ని ప్రత్యేకతలున్న కుంబ్లే రికార్డుల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.

రికార్డులకన్నా గొప్పది అతని వ్యక్తిత్వం. కుంబ్లే అసలుపేరు అనిల్‌ రాధాకృష్ణన్‌ కుంబ్లే. 1970 అక్టోబర్‌ 17న  బెంగళూరులోని కృష్ణస్వామి, సరోజ దంపతులకు జన్మించారు. చిన్నతనం నుంచే కుంబ్లేకు క్రికెట్‌పై మక్కువ ఉండేది. బెంగళూరు వీధుల్లో బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ చేసేవాడు. 13 ఏళ్ల ప్రాయంలోనే యంగ్‌ క్రికెటర్స్‌ క్లబ్‌లో చేరాడు. ఇతనికి దినేశ్‌ అనే సోదరుడు కూడా ఉన్నాడు. కుంబ్లే విసిరిన బంతి జంబోజెట్‌ వేగంతో వస్తుందని అతనికి జంబో అనే ముద్దుపేరు పెట్టారు.

ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు..
1989 నవంబర్‌లో ఫస్ట్‌క్లాస్‌  క్రికెట్‌ ఆడిన కుంబ్లే 4 వికెట్లు సాధించాడు. ఆ తర్వాత అండర్‌–19 జట్టులో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించి  సెంచరీ సాధించాడు. 1990 ఏప్రిల్‌ 5న మొదటిసారిగా శ్రీలంకతో వన్డే మ్యాచ్‌ ఆడాడు. అదే ఏటా ఇంగ్లాండ్‌పై టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. తర్వాత భారత్‌లో జరిగిన  3 టెస్టుల సిరీస్‌లో 19.8 సరాసరితో 21 వికెట్లు సాధించాడు.  టెస్టుల్లో మొదటి 50 వికెట్లను కేవలం 10 మ్యాచ్‌ల్లోనే సొంతం చేసుకున్నాడు. 21 టెస్టుల్లో 100 వికెట్లు సాధించాడు. వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 12 పరుగులకే 6 వికెట్లును చేజిక్కించుకున్నాడు.

1996 వన్డే ప్రపంచకప్‌నాటికి కుంబ్లే బౌలింగ్‌ శిఖరాలకు చేరింది. ఆ ప్రపంచకప్‌లో 16 వికెట్లను తీసాడు. టెస్టు క్రికెట్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు పడగొట్టిన రెండో బౌలర్‌ కుంబ్లే. ఇన్ని ఘనతలు సాధించినప్పటికీ టెస్టుల్లో తన సెంచరీని 118వ మ్యాచ్‌లో పూర్తిచేసాడు. ఇన్నింగ్స్‌లో అత్యధికసార్లు 5 వికెట్లు తీసిన భారతీయ బౌలర్‌ కుంబ్లే. 2004లో కపిల్‌దేవ్‌ రికార్డును అధిగమించి టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. షేన్‌వార్న్‌ తర్వాత 600 వికెట్ల క్లబ్‌లో చేరిన రెండో బౌలర్‌ కుంబ్లే.  వన్డేల్లో 300 వికెట్ల క్లబ్‌లో చేరిన  రెండో బౌలర్‌. 

కెప్టెన్‌గా..
అనిల్‌ కుంబ్లే టేస్టుల్లో 14 మ్యాచ్‌లకు నాయకత్వం వహించారు. వీటిలో భారత్‌ 3గెలిచి 5 ఓడగా 6 మ్యాచ్‌లు డ్రా అయ్యాయి. 5 టెస్టు సిరీస్‌ల్లో 2007 పాకిస్థాన్‌ సిరీస్, 2008 ఆస్ట్రేలియా సిరీస్‌లను భారత్‌ గెలిచింది. వన్డేల్లో ఒకె ఒక మ్యాచ్‌కు నాయకత్వం వహించగా ఈ మ్యాచ్‌ భారత్‌ గెలిచింది.

కోచ్‌గానూ....
2007 ప్రపంచకప్‌లో భారతజట్టు పేలవ ఆటతీరుకు సీనియర్‌ ఆటగాళ్లపై విమర్శలు రావడంతో బాధ్యతాయుతంగా వన్డే క్రికెట్‌నుంచి నిష్క్రమిస్తున్నట్లు ప్రకటించాడు. 2008లో ఆస్ట్రేలియాలో జరగుతున్న మూడో టెస్టు నాలుగోరోజు ఫిట్‌గా లేనందును టెస్టులోంచి కూడా తప్పుకుంటున్నట్లు ప్రకటించి ఆశ్చర్యానికి గురిచేసాడు. పదివికెట్లు తీసిన ఫిరోజ్‌షా కోట్ల మైదానంలోనే క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. క్రికెట్‌ నుంచి రిటైర్‌ అయ్యాక భారత జట్టు కోచ్‌గానూ కుంబ్లే సేవలందించాడు.

కుంబ్లే కోచ్‌గా ఉన్న కాలంలో వెస్టిండీస్‌, ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్‌తో వరుస టెస్టు సిరీస్‌లను భారత్‌ గెలిచింది. ఇక చాంపియన్స్‌ ట్రోఫి ఫైనల్‌కు చేరి పాక్‌ చేతిలో ఓడిన విషయం అందరికి తెలిసిందే. తదనాంతరం భారత ఆటగాళ్లు కోచ్‌గా కుంబ్లేపై అయిష్టత కనబర్చడంతో తనంతట తానే కోచ్‌పదవి రేసులో నుంచి తప్పుకున్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement