
విండీస్ పర్యటనకు కుంబ్లేనే...
ముంబై: భారత క్రికెట్ జట్టు కోచ్‌గా అనిల్ కుంబ్లే మరో సిరీస్‌కు కూడా కొనసాగనున్నారు. ‘విండీస్‌తో జరిగే సిరీస్ వరకు కూడా కుంబ్లే కోచ్‌గా ఉంటారు. అయితే అది ఆయన అంగీకారం మీద ఆధారపడి ఉంటుంది’ అని పరిపాలకుల కమిటీ (సీఓఏ) చీఫ్ వినోద్ రాయ్ వెల్లడించారు. మరోవైపు కాన్‌ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రస్ట్ సమస్యలు పరిష్కరించేందుకు బీసీసీఐ త్వరలోనే కొత్తగా ఎథిక్స్ ఆఫీసర్‌ను నియమించనుంది. ఈ అంశంపై చాలా ఫిర్యాదులు వచ్చాయని, ఎథిక్స్ ఆఫీసర్ వీటిపై దృష్టి పెడతారని రాయ్ చెప్పారు.
26న ఎస్‌జీఎం: బీసీసీఐ ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్‌జీఎం) ఈ నెల 26న జరగనుంది. ఇందులో కొత్త కోచ్ ఎంపిక అంశం చర్చించడం లేదని బోర్డు స్పష్టం చేసింది. ప్రధానంగా లోధా కమిటీ సిఫారసుల అమలుపైనే ఇందులో చర్చ జరగనుంది. దీంతో పాటు ఇటీవల జరిగిన ఐసీసీ సమావేశాలు, వాటి పరిణామాలు, రాబోయే సిరీస్‌లు, పాకిస్తాన్‌తో ఇటీవల దుబాయ్‌లో జరిగిన సమావేశం తదితర ఏడు అంశాలతో బీసీసీఐ అజెండా సిద్ధమైంది.