ప్రధాన కోచ్ కుంబ్లే.. బ్యాటింగ్ కోచ్ రవిశాస్త్రి?
ముంబై: భారత క్రికెట్ ప్రధాన కోచ్గా మాజీ స్పిన్నర్ అనిల్ కుంబ్లే ఎంపికకు రంగం సిద్ధమైంది. భారత క్రికెట్ జట్టు కోచ్ ఎంపికలో భాగంగా పలువురు అభ్యర్ధులను ఇంటర్య్వూలు చేసిన అనంతరం కుంబ్లే వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. కాగా, ప్రధాన కోచ్ పదవి కోసం పోటీ పడ్డ టీమిండియా మాజీ డైరెక్టర్ రవిశాస్త్రికి బ్యాటింగ్ కోచ్గా బాధ్యతలు అప్పజెప్పేందుకు బీసీసీఐ సుముఖంగా ఉన్నట్లు సమాచారం. ఈ ప్రక్రియలో భాగంగా బోర్డు అడ్వైజరీ కమిటీ సభ్యులు సచిన్, గంగూలీ, లక్ష్మణ్ల బృందం పలువురు అభ్యర్ధులను ఇంటర్య్వూ చేసిన అనంతరం కుంబ్లేను ప్రధాన కోచ్ గా, రవిశాస్త్రిని బ్యాటింగ్ కోచ్ నియమించేందుకు ఆసక్తి కనబరిచినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే కోచ్ ఎంపికపై తుది నివేదిక సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. భారత ప్రధాన కోచ్ పదవి ఇంటర్య్వూకు అనిల్ కుంబ్లే తో పాటు ప్రవీణ్ ఆమ్రే, లాల్‌చంద్ రాజ్‌పుత్, రవిశాస్త్రి, టామ్ మూడీ, స్టువర్ట్ లా, ఆండీ మోల్స్ తదితరులు హాజరయ్యారు. గతేడాది వన్డే వరల్డ్ కప్ ముగిసిన అనంతరం డంకెన్ ఫ్లెచర్ కోచ్ పదవి కాలం ముగిసింది. ఆ తరువాత దాదాపు ఆరు నెలల పాటు టీమిండియా డైరెక్టర్ గా రవిశాస్త్రికి బాధ్యతలు అప్పజెప్పారు. కాగా, మరోసారి పూర్తిస్థాయి కోచ్ ను నియమించాలని భావించిన బీసీసీఐ అందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది. దీనిలో భాగంగా పలువురు అభ్యుర్ధులను ఇంటర్య్వూ ద్వారా పరిశీలించిన బోర్డు అడ్వైజరీ కమిటీ విశేష అనుభవమున్న అనిల్ కుంబ్లేను ప్రధాన కోచ్ గా చేయాలని సూచించినట్లు విశ్వసనీయ సమాచారం. బీసీసీఐ నుంచి శుక్రవారం అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.