కుంబ్లేకు చేదు అనుభవం!
సెయింట్ కిట్స్: భారత క్రికెట్ జట్టు కొత్త కోచ్గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలి విదేశీ పర్యటనకు వెళ్లిన అనిల్ కుంబ్లేకు చేదు అనుభవం ఎదురైంది. తన లగేజీని బ్రిటీష్ ఎయిర్వేస్ లండన్లోని గాట్విక్ ఎయిర్పోర్ట్లోనే మరచిపోవడంతో కుంబ్లేకు ఇబ్బందికర పరిస్థితి తలెత్తింది. భారత క్రికెట్ జట్టు వెస్టిండీస్ పర్యటనకు వెళ్లిన క్రమంలో కుంబ్లే లగేజీ కిట్ను బ్రిటీష్ ఎయిర్ వేస్ లండన్ ఎయిర్ పోర్ట్లోనే వదిలేసింది. భారత క్రికెట్ జట్టు ముంబైలో బయల్దేరి లండన్ మీదుగా సెయింట్ కిట్స్లో దిగింది.
ప్రధాన కోచ్ అనిల్ కుంబ్లే లగేజీ విషయంలో బ్రిటీష్ ఎయిర్వేస్ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో అతని దుస్తులతో పాటు తదితర వస్తువులన్నీ లండన్ ఎయిర్ పోర్ట్లోనే ఉండిపోయాయి. అయితే కుంబ్లే మాత్రం జట్టుతో కలిసి విండీస్ కు చేరుకున్నాడు. ఈ మేరకు తర్వాత తన లగేజీ కోసం కుంబ్లే ఫిర్యాదుపై సదరు ఎయిర్వేస్ స్పందించింది. తాము చేసిన తప్పిదానికి క్షమించాలని, సాధ్యమైనంత త్వరగా కుంబ్లే లగేజీని అందజేస్తామని ట్విట్టర్ లో పేర్కొంది. గతంలో ఓసారి మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్కు సైతం ఈ తరహా అనుభవమే ఎదురైంది. అప్పట్లో బ్రిటీష్ ఎయిర్వేస్ తీరును సచిన తప్పుబట్టాడు. ఆ ఎయిర్వేస్ ' డోంట్ కేర్' విధానం నచ్చలేదని మాస్టర్ మండిపడ్డాడు.