విజయవాడ: న్యూజిలాండ్ 'ఎ' తో జరుగుతున్న రెండో అనధికార టెస్టులో భారత 'ఎ' ఆటగాడు అంకిత్ బావ్నే(162;245 బంతుల్లో 21 ఫోర్లు, 5 సిక్సర్లు) భారీ శతకం సాధించాడు. అతనికి జతగా పార్థివ్ పటేల్ (65;101 బంతుల్లో 6 ఫోర్లు, 1సిక్సర్) రాణించాడు. ఫలితంగా భారత్ 'ఎ' తన తొలి ఇన్నింగ్స్ లో 447 పరుగులు చేసింది. 360/4 ఓవర్ నైట్ స్కోరుతో మూడో రోజు బ్యాటింగ్ కొనసాగించిన భారత 'ఎ' ఆదిలోనే పార్దీవ్ ను ఐదో వికెట్ గా కోల్పోయింది.
పార్దీవ్ అవుటైన కాసేపటికి శార్దూల్ ఠాకూర్ (5) అవుటయ్యాడు. ఆపై 116 పరుగుల ఓవర్ నైట్ స్కోరు బ్యాటింగ్ కొనసాగించిన అంకిత్ బావ్నే నిలకడగా బ్యాటింగ్ చేశాడు. కాగా, మరో ఎండ్ నుంచి అతనికి సహకారం కరువైంది. వచ్చిన ఆటగాడు వచ్చినట్లే పెవిలియన్ చేరడంతో అంకిత్ బ్యాట్ ఝుళిపించాడు. ఆ క్రమంలోనే భారత్ 'ఎ' నాలుగొందల పరుగుల మార్కును చేరింది. అంకిత్ బావ్నే చివరి వికెట్ గా పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం భారత్ 'ఎ' 236 పరుగుల ఆధిక్యంలో ఉంది.
న్యూజిలాండ్ 'ఎ' తొలి ఇన్నింగ్స్ 211 ఆలౌట్
భారత్ 'ఎ' తొలి ఇన్నింగ్స్ 447 ఆలౌట్