ఐపీఎల్ 2025 ఎడిషన్ కోసం గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్ మెంటార్‌గా టీమిండియా మాజీ ప్లేయర్ పార్థివ్ పటేల్ ఎంపికైనట్లు తెలుస్తుంది. దేశవాలీ క్రికెట్‌లో గుజరాత్‌కే ప్రాతినిథ్యం వహించిన పార్థివ్ తన సొంత జట్టుతో మరోసారి జత కట్టనున్నాడని సమాచారం. పార్థివ్.. గ్యారీ కిర్‌స్టన్ స్థానాన్ని భర్తీ చేయనున్నట్లు తెలుస్తుంది.
కిర్‌స్టన్ పాకిస్తాన్ వైట్ బాల్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న నేపథ్యంలో ఈ ఎంపిక జరిగినట్లు సమాచారం. ప్రస్తుతం గుజరాత్ హెడ్ కోచ్‌గా ఆశిష్ నెహ్రా వ్యవహరిస్తున్నాడు. ఆ జట్టుకు సారధిగా శుభ్‌మన్ గిల్ ఉన్నాడు. ఫ్రాంచైజీ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా విక్రమ్ సోలంకి పని చేస్తున్నాడు.
కాగా, పార్థివ్ పటేల్ గతంలో ముంబై ఇండియన్స్ టాలెంట్ స్కౌట్‌లో సభ్యుడిగా పని చేశాడు. దేశవాలీ క్రికెట్ నుంచి యువ ఆటగాళ్లను ఎంపిక చేసే విషయంలో పార్థివ్ కీలకంగా వ్యవహరించేవాడు. పార్థివ్ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించకముందు ముంబై ఇండియన్స్‌లో సభ్యుడిగా ఉన్నాడు. పార్థివ్ జట్టులో ఉన్నప్పుడు ముంబై ఇండియన్స్ 2020 ఎడిషన్ టైటిల్ నెగ్గింది.
గుజరాత్ టైటాన్స్ 2022 ఎడిషన్‌తో ఐపీఎల్ అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. నెహ్రా ఆథ్వర్యంలో, హార్దిక్ నేతృత్వంలో ఆ జట్టు తొలి ఎడిషన్‌లోనే విజేతగా నిలిచింది. ఆ తర్వాతి సీజన్‌లో గుజరాత్ రన్నరప్‌తో సరిపెట్టుకుంది. అనంతరం 2024 ఎడిషన్‌లో గిల్ సారథ్యంలో ఎనిమిదో స్థానంలో నిలిచింది.
39 ఏళ్ల పార్థివ్ పటేల్ 2002-2018 మధ్యలో టీమిండియా తరఫున 25 టెస్ట్‌లు, 38 వన్డేలు, 2 టీ20లు ఆడి 1700 పైచిలుకు పరుగులు చేశాడు. ఇందులో 10 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. వికెట్‌కీపర్ కమ్ బ్యాటర్ అయిన పార్థివ్ టెస్ట్‌ల్లో 73, వన్డేల్లో 41, టీ20ల్లో ఒక్కరిని ఔట్ చేయడంలో భాగమయ్యాడు. 2008-2020 వరకు ఐపీఎల్ ఆడిన పార్థివ్ 139 మ్యాచ్‌ల్లో 2848 పరుగులు చేశాడు. ఇందులో 13 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఐపీఎల్‌లో పార్థివ్ 95 మంది ఔట్ చేయడంలో భాగమయ్యాడు.
చదవండి: రిటైర్మెంట్ నిర్ణయం వెనక్కు తీసుకునేందుకు రెడీ: వార్నర్
Comments
Please login to add a commentAdd a comment