Ankit Bawne
-
మెరుపు అర్ధశతకాలు.. విధ్వంసకర శతకం.. టోర్నీ చరిత్రలోనే అత్యధిక స్కోర్
విజయ్ హజారే ట్రోఫీ 2023లో పరుగుల వరద పారుతుంది. దాదాపు ప్రతి మ్యాచ్‌లో ఆరుకు పైగా రన్‌రేట్‌తో పరుగులు నమోదవుతున్నాయి. నిన్న (డిసెంబర్ 5) మణిపూర్‌తో జరిగిన మ్యాచ్‌లో మహారాష్ట్ర జట్టు రికార్డు స్థాయిలో 427 పరుగులు చేసింది. అంకిత్ బావ్నే విధ్వంసకర శతకంతో (105 బంతుల్లో 167; 17 ఫోర్లు, 10 సిక్సర్లు) విరుచుకుపడగా.. ఓమ్ బోస్లే (60), కౌశల్ తాంబే (51), రుషబ్ రాథోడ్ (65) మెరుపు అర్ధసెంచరీలు సాధించారు. పై పేర్కొన్న నలుగురు ఆటగాళ్లతో పాటు అజిమ్ ఖాజీ (36), కెప్టెన్ నిఖిల్ నాయక్ (33 నాటౌట్) కూడా మెరుపు వేగంతో పరుగులు చేయడంతో మహారాష్ట్ర జట్టు విజయ్ హజారే టోర్నీ చరిత్రలోనే మూడో అత్యధిక టీమ్ స్కోర్‌ను నమోదు చేసింది. ఈ టోర్నీలో అత్యధిక స్కోర్ రికార్డు తమిళనాడు పేరిట ఉంది. 2022 సీజన్లో అరుణాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో తమిళనాడు 506 పరుగుల అతి భారీ స్కోర్ చేసింది. అదే సీజన్లో పాండిచ్చేరిపై ముంబై చేసిన 457 పరుగుల స్కోర్ రెండో అత్యధిక టీమ్ స్కోర్‌గా రికార్డైంది. మ్యాయ్ విషయానికొస్తే.. మహా బ్యాటర్ల విధ్వంసం ధాటికి మణిపూర్ బౌలర్ రెక్స్ సింగ్ 10 ఓవర్లలో 101 పరుగులు సమర్పించుకున్నాడు. మరో బౌలర్ ప్రియ్‌జ్యోత్ సింగ్ 9 ఓవర్లలో ఏకంగా 94 పరుగులు సమర్పించుకున్నాడు. భిష్వోర్జిత్ 2, కిషన్ సింఘా, రెక్స్ సింగ్, ప్రియ్‌జ్యోత్ తలో వికెట్ పడగొట్టారు. లక్ష్యం పెద్దది కావడంతో.. 428 పరుగుల అతి భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన మణిపూర్ ఏ దశలోనూ గెలుపు దిశగా సాగలేదు. లక్ష్యం పెద్దది కావడంతో మణిపూర్ బ్యాటర్లు ఆదిలో ఓటమిని ఒప్పేసుకున్నారు. ప్రియ్‌జ్యోత్ (62), జాన్సన్ సింగ్ (62), కెప్టెన్ లాంగ్లోన్యాంబా (76 నాటౌట్) ఓటమి మార్జిన్‌ను తగ్గించేందుకు తమవంతు ప్రయత్నం చేశారు. మహా బౌలర్లలో రామకృష్ణ ఘోష్ 2, సత్యజిత్, అజిమ్ ఖాజీ, కౌశల్ తాంబే తలో వికెట్ పడగొట్టారు. -
అంకిత్ బావ్నె సెంచరీ
వడోదర: మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ అంకిత్ బావ్నె (116 నాటౌట్; 15 ఫోర్లు) అజేయ శతకానికి తోడు ఫామ్‌లో ఉన్న ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (90; 14 ఫోర్లు, 2 సిక్స్‌లు), శ్రేయస్ అయ్యర్ (61; 3 ఫోర్లు, 5 సిక్స్‌లు)ల దూకుడైన అర్ధ శతకాలతో వెస్టిండీస్‌తో సన్నాహక మ్యాచ్‌లో బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవెన్ భారీ స్కోరు సాధించింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆరు వికెట్ల నష్టానికి 360 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. పృథ్వీ షా (8), హనుమ విహారి (3) త్వరగానే ఔటైనా కెప్టెన్ కరుణ్ నాయర్ (29) తోడుగా మయాంక్ ఇన్నింగ్స్‌ను నడిపించాడు. మూడో వికెట్‌కు 92 పరుగులు జత చేశారు. విండీస్ బౌలర్లలో బిషూ (3/104), గాబ్రియేల్ (2/41) మినహా మిగతావారు ప్రభావం చూపలేదు. -
భారత్ ‘ఎ’ 274 ఆలౌట్
బెంగళూరు: ఆస్ట్రేలియా ‘ఎ’తో జరుగుతోన్న నాలుగు రోజుల అనధికారిక టెస్టులో భారత్ ‘ఎ’ బ్యాట్స్‌మన్ అంకిత్ బావ్నే (159 బంతుల్లో 91 నాటౌట్; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) త్రుటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. దీంతో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 83.1 ఓవర్లలో 274 పరుగులకు ఆలౌటై 31 పరుగుల స్వల్ప ఆధిక్యం సాధించింది. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ ఆట ముగిసే సమయానికి 16 ఓవర్లలో వికెట్ నష్టానికి 42 పరుగులు చేసింది. ఖాజా (16 బ్యాటింగ్), హెడ్ (13 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. చేతిలో మరో 9 వికెట్లున్న ఆసీస్ ప్రస్తుతం 11 పరుగుల ఆధిక్యంలో ఉంది. -
భారత్ ‘ఎ’, కివీస్ ‘ఎ’ రెండో వన్డే టై
సాక్షి, విశాఖపట్నం: చివరి బంతి వరకు నువ్వా నేనా అన్నట్లు సాగిన భారత్ ‘ఎ’, న్యూజిలాండ్ ‘ఎ’ జట్ల మధ్య రెండో వన్డే మ్యాచ్ టైగా ముగిసింది. తొలుత న్యూజిలాండ్ 42 ఓవర్లలో 6 వికెట్లకు 269 పరుగులు చేసింది. గ్లెన్ ఫిలిప్స్ (140 నాటౌట్; 15 ఫోర్లు, 4 సిక్స్‌లు) అజేయ సెంచరీ చేశాడు. భారత బౌలర్లలో సిద్ధార్థ్ కౌల్ మూడు, కరణ్ శర్మ రెండు వికెట్లు తీశారు. అనంతరం భారత్ ‘ఎ’ 42 ఓవర్లలో 9 వికెట్లకు సరిగ్గా 269 పరుగులు సాధించింది. శ్రేయస్ అయ్యర్ (90; 7 ఫోర్లు, 5 సిక్స్‌లు) సెంచరీ చేజార్చుకోగా... ఒకదశలో 223 పరుగులకు 8 వికెట్లు కోల్పోయి పరాజయం అంచులో నిలిచిన భారత్‌ను అంకిత్ బావ్నే (83 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) చివరి వరకు క్రీజ్‌లో నిలిచి ఓటమిని తప్పించాడు. వర్షం కారణంగా మ్యాచ్‌ను 42 ఓవర్లకు కుదించారు. -
బ్యాట్స్‌మెన్‌పైనే భారం
సాక్షి, విజయవాడ: భారత్ ‘ఎ’తో తొలి అనధికారిక టెస్టులో ఇన్నింగ్స్ తేడాతో ఓడిపోయిన న్యూజిలాండ్ ‘ఎ’ రెండో టెస్టులోనూ ఇబ్బంది పడుతోంది. భారత్ ‘ఎ’తో ఇక్కడ జరుగుతున్న మ్యాచ్‌లో 236 పరుగులతో వెనుకబడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్ ‘ఎ’ మూడో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 104 పరుగులు చేసింది. ఇంకా 133 పరుగులు వెనుకంజలో ఉన్న న్యూజిలాండ్ ‘ఎ’ పరాజయం నుంచి తప్పించుకోవాలంటే మాత్రం చివరిరోజు బ్యాట్స్‌మెన్ విశేషంగా రాణించాల్సిన అవసరం ఉంది. ఓపెనర్ వర్కర్ (6) నదీమ్ బౌలింగ్‌లో అవుట్‌కాగా... జీత్ రావల్ (117 బంతుల్లో 41 బ్యాటింగ్; 5 ఫోర్లు), నికోల్స్ (93 బంతుల్లో 55 బ్యాటింగ్; 7 ఫోర్లు, ఒక సిక్స్) క్రీజులో ఉన్నారు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 360/4తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ ‘ఎ’ 447 పరుగులవద్ద ఆలౌటైంది. సెంచరీ హీరో అంకిత్ బావ్నే (245 బంతుల్లో 162 నాటౌట్; 21 ఫోర్లు, 5 సిక్స్‌లు) అజేయంగా నిలువగా... పార్థివ్ పటేల్ (101 బంతుల్లో 65; 6 ఫోర్లు, ఒక సిక్స్) తన ఓవర్‌నైట్ స్కోరుకు మరో తొమ్మిది పరుగులు జోడించి అవుటయ్యాడు. పార్థివ్ అవుటయ్యాక లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ నుంచి అంకిత్‌కు అంతగా సహకారం లభించలేదు. దాంతో భారత్ తమ చివరి ఐదు వికెట్లను 75 పరుగుల తేడాలో కోల్పోయింది. -
అంకిత్ బావ్నే భారీ సెంచరీ
విజయవాడ: న్యూజిలాండ్ 'ఎ' తో జరుగుతున్న రెండో అనధికార టెస్టులో భారత 'ఎ' ఆటగాడు అంకిత్ బావ్నే(162;245 బంతుల్లో 21 ఫోర్లు, 5 సిక్సర్లు) భారీ శతకం సాధించాడు. అతనికి జతగా పార్థివ్ పటేల్ (65;101 బంతుల్లో 6 ఫోర్లు, 1సిక్సర్) రాణించాడు. ఫలితంగా భారత్ 'ఎ' తన తొలి ఇన్నింగ్స్ లో 447 పరుగులు చేసింది. 360/4 ఓవర్ నైట్ స్కోరుతో మూడో రోజు బ్యాటింగ్ కొనసాగించిన భారత 'ఎ' ఆదిలోనే పార్దీవ్ ను ఐదో వికెట్ గా కోల్పోయింది. పార్దీవ్ అవుటైన కాసేపటికి శార్దూల్ ఠాకూర్ (5) అవుటయ్యాడు. ఆపై 116 పరుగుల ఓవర్ నైట్ స్కోరు బ్యాటింగ్ కొనసాగించిన అంకిత్ బావ్నే నిలకడగా బ్యాటింగ్ చేశాడు. కాగా, మరో ఎండ్ నుంచి అతనికి సహకారం కరువైంది. వచ్చిన ఆటగాడు వచ్చినట్లే పెవిలియన్ చేరడంతో అంకిత్ బ్యాట్ ఝుళిపించాడు. ఆ క్రమంలోనే భారత్ 'ఎ' నాలుగొందల పరుగుల మార్కును చేరింది. అంకిత్ బావ్నే చివరి వికెట్ గా పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం భారత్ 'ఎ' 236 పరుగుల ఆధిక్యంలో ఉంది. న్యూజిలాండ్ 'ఎ' తొలి ఇన్నింగ్స్ 211 ఆలౌట్ భారత్ 'ఎ' తొలి ఇన్నింగ్స్ 447 ఆలౌట్ -
అంకిత్ బావ్నే సెంచరీ
సాక్షి, విజయవాడ: మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ అంకిత్ బావ్నే (166 బంతుల్లో 116 బ్యాటింగ్; 13 ఫోర్లు, 5 సిక్స్‌లు) అజేయ సెంచరీ, పార్థివ్ పటేల్ (78 బంతుల్లో 56 బ్యాటింగ్; 4 ఫోర్లు, ఒక సిక్స్) అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నారు. ఫలితంగా న్యూజిలాండ్ ‘ఎ’తో జరుగుతున్న రెండో అనధికారిక టెస్టులో భారత్ ‘ఎ’ భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. వీరిద్దరూ ఐదో వికెట్‌కు అజేయంగా 154 పరుగులు జోడించడం విశేషం. ఓవర్‌నైట్ స్కోరు 33/1తో రెండో రోజు బ్యాటింగ్ కొనసాగించిన భారత్ ‘ఎ’ ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 82 ఓవర్లలో నాలుగు వికెట్లకు 360 పరుగులు సాధించింది. ప్రస్తుతం భారత్ ‘ఎ’ 149 పరుగుల ఆధిక్యంలో ఉంది. అంతకుముందు శ్రేయస్ అయ్యర్ ధాటిగా ఆడాడు. ప్రియాంక్ పాంచల్ (46; 7 ఫోర్లు)తో కలిసి శ్రేయస్ అయ్యర్ (79 బంతుల్లో 82; 10 ఫోర్లు, 2 సిక్స్‌లు) రెండో వికెట్‌కు 133 పరుగులు జత చేశాక అవుటయ్యాడు. అయ్యార్ అవుటయ్యాక స్కోరు బోర్డుకు మరో తొమ్మిది పరుగులు కలిశాక ప్రియాంక్ కూడా పెవిలియన్ చేరుకున్నాడు. ఈ దశలో కెప్టెన్ కరుణ్ నాయర్ (43; 7 ఫోర్లు), అంకిత్ బావ్నే నిలకడగా ఆడుతూ నాలుగో వికెట్‌కు 64 పరుగులు జోడించి భారత్ ‘ఎ’ స్కోరును 200 పరుగులు దాటించారు. క్రీజ్‌లో నిలదొక్కుకున్న నాయర్‌ను స్పిన్నర్ సోధి అవుట్ చేయడంతో భారత్ ‘ఎ’ నాలుగో వికెట్ కోల్పోయింది. అనంతరం అంకిత్ బావ్నే, పార్థివ్ పటేల్ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడి భారత్ ‘ఎ’ ఇన్నింగ్స్‌ను పటిష్ట పరిచారు. -
ట్రిఫుల్, డబుల్ సెంచరీలతో రికార్డు బద్దలు
ముంబై: మహారాష్ట్ర క్రికెటర్లు స్వప్నిల్ గుగాలే, అంకిత్ బావ్నే సరికొత్త రికార్డు సృష్టించారు. రంజీ క్రికెట్ లో అత్యధిక భాగస్వామ్యం నమోదు చేసి పాత రికార్డులను చెరివేశారు. ఢిల్లీతో జరుగుతున్న రంజీ మ్యాచ్‌లో స్వప్నిల్, అంకిత్ కలిసి 594 పరుగుల రికార్డు భాగస్వామ్యం నమోదు చేశారు. రంజీ క్రికెట్ చరిత్రలో ఏ వికెట్ కైనా ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం కావడం విశేషం. స్వప్నిల్ ట్రిఫుల్, అంకిత్ డబుల్ సెంచరీలతో పరుగుల వరద పారించారు. 41 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన మహారాష్ట్ర వీరిద్దరి విజృంభణతో భారీ స్కోరు చేసింది. స్వప్నిల్(351; 521 బంతుల్లో 37 ఫోర్లు, 5 సిక్సర్లు), అంకిత్(258; 500 బంతుల్లో 18 ఫోర్లు, 2 సిక్సర్లు) అజేయంగా నిలిచి జట్టుకు భారీ స్కోరు అందించారు. వీరిద్దరీని అవుట్ చేసేందుకు ఢిల్లీ బౌలర్లు విఫలయత్నం చేశారు. 635/2 స్కోరు వద్ద మహారాష్ట్ర తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. మొదటి ఇన్నింగ్స్ ఆరంభించిన ఢిల్లీ వికెట్ నష్టపోకుండా 21 పరుగులు చేసింది.