సాక్షి, విజయవాడ: భారత్ ‘ఎ’తో తొలి అనధికారిక టెస్టులో ఇన్నింగ్స్ తేడాతో ఓడిపోయిన న్యూజిలాండ్ ‘ఎ’ రెండో టెస్టులోనూ ఇబ్బంది పడుతోంది. భారత్ ‘ఎ’తో ఇక్కడ జరుగుతున్న మ్యాచ్‌లో 236 పరుగులతో వెనుకబడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్ ‘ఎ’ మూడో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 104 పరుగులు చేసింది. ఇంకా 133 పరుగులు వెనుకంజలో ఉన్న న్యూజిలాండ్ ‘ఎ’ పరాజయం నుంచి తప్పించుకోవాలంటే మాత్రం చివరిరోజు బ్యాట్స్‌మెన్ విశేషంగా రాణించాల్సిన అవసరం ఉంది. ఓపెనర్ వర్కర్ (6) నదీమ్ బౌలింగ్‌లో అవుట్‌కాగా... జీత్ రావల్ (117 బంతుల్లో 41 బ్యాటింగ్; 5 ఫోర్లు), నికోల్స్ (93 బంతుల్లో 55 బ్యాటింగ్; 7 ఫోర్లు, ఒక సిక్స్) క్రీజులో ఉన్నారు.
అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 360/4తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ ‘ఎ’ 447 పరుగులవద్ద ఆలౌటైంది. సెంచరీ హీరో అంకిత్ బావ్నే (245 బంతుల్లో 162 నాటౌట్; 21 ఫోర్లు, 5 సిక్స్‌లు) అజేయంగా నిలువగా... పార్థివ్ పటేల్ (101 బంతుల్లో 65; 6 ఫోర్లు, ఒక సిక్స్) తన ఓవర్‌నైట్ స్కోరుకు మరో తొమ్మిది పరుగులు జోడించి అవుటయ్యాడు. పార్థివ్ అవుటయ్యాక లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ నుంచి అంకిత్‌కు అంతగా సహకారం లభించలేదు. దాంతో భారత్ తమ చివరి ఐదు వికెట్లను 75 పరుగుల తేడాలో కోల్పోయింది.
బ్యాట్స్‌మెన్‌పైనే భారం
Published Tue, Oct 3 2017 12:39 AM | Last Updated on Tue, Oct 3 2017 12:39 AM
Advertisement