లండన్: ప్రపంచ క్రికెట్‌లో రోజురోజుకూ వేళ్లూనుకుంటున్న ఫిక్సింగ్ జాడ్యానికి అడ్డుకట్ట వేసేందుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మరిన్ని కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది. దీంట్లో భాగంగా తమ అవినీతి నిరోధక కోడ్‌ను సవరించి మరింత పకడ్బందీగా రూపొందించారు. కోడ్‌ను ఆమోదం కోసం వచ్చే జనవరిలో జరిగే సమావేశం ముందు ఉంచనున్నారు. రెండు రోజుల పాటు జరిగిన ఐసీసీ బోర్డు సమావేశంలో బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌కు చెందిన తొమ్మిది మంది ఆటగాళ్ల ఫిక్సింగ్ వ్యవహారంపై వివరాలను సమీక్షించారు.
అలాగే పాక్ యువ పేసర్ మహ్మద్ ఆమిర్‌పై విధించిన ఐదేళ్ల నిషేధాన్ని ఎత్తివేసే అంశం కూడా చర్చకు వచ్చినప్పటికీ సవరించిన కోడ్ అమల్లోకి వచ్చాక పరిశీలించేందుకు నిర్ణయించారు. వచ్చే ఏడాది బంగ్లాదేశ్‌లో జరిగే టి20 ప్రపంచకప్ కోసం స్టేడియాల నిర్మాణానికి తుది గడువును నవంబర్ 30 వరకు పొడిగించారు. ఈనెల 27న ఈ టోర్నీ షెడ్యూల్‌ను ఢాకాలో ప్రకటించనున్నారు. తొలిసారిగా వన్డే ప్రపంచకప్‌లో చోటు దక్కించుకున్న అఫ్ఘానిస్తాన్ క్రికెట్ అభివృద్ధికి ఐసీసీ డెవలప్‌మెంట్ ఇంటర్నేషనల్ (ఐడీఐ) బోర్డు 1.1మిలియన్ డాలర్ల మేర ఆర్థిక సహాయాన్ని పెంచేందుకు అనుమతించింది.
అవినీతి నిరోధక కోడ్‌కు మార్పులు
Published Sun, Oct 20 2013 1:28 AM | Last Updated on Fri, Sep 1 2017 11:47 PM
Advertisement