బీసీసీఐ.. చరిత్ర సృష్టించిన అనురాగ్ ఠాకూర్
ముంబై: బీసీసీఐకి నూతన అధ్యక్షుడిగా అనురాగ్ ఠాకూర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తద్వారా బీసీసీఐ చరిత్రలోనే ఈ పదవి చేపట్టిన అత్యంత పిన్నవయస్కుడిగా 41 ఏళ్ల ఠాకూర్ రికార్డు సృష్టించారు. ఆదివారం ముంబైలో జరిగిన బోర్డు ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్‌జీఎం)లో సభ్యులు ఠాకూర్‌కు ప్రత్యక్షంగా మద్దతు తెలిపారు. కాగా, శనివారం ఠాకూర్ తన నామినేషన్ పత్రాలను దాఖలు చేసిన విషయం తెలిసిందే. జగ్మోహన్ దాల్మియా తర్వాత ఆ పగ్గాలు చేపట్టిన శశాంక్ మనోహర్ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ పదవికి పోటీ చేయడానికి నిబంధనలు అడ్డొస్తున్నాయని అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. అనుకున్నట్లుగానే ఆయన ఐసీసీ చైర్మన్ గా ఏకగ్రీవంగా, స్వతంత్రంగానే ఎన్నికైన తొలి చైర్మన్ గానూ రికార్డు సృష్టించారు.
వాస్తవానికి ఆనవాయితీ ప్రకారం ఈసారి ఈస్ట్ జోన్ నుంచి బీసీసీఐ అధ్యక్షుడిని ఎన్నుకోవాల్సి ఉండగా బెంగాల్, అస్సాం, జార్ఖండ్, త్రిపుర, జాతీయ క్రికెట్ క్లబ్ సంఘాలు మద్ధతిస్తున్నాయి. అనురాగ్ ఠాకూర్ ప్రస్తుతం బీసీసీఐ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు జస్టిస్ లోధా కమిటీ సూచించిన ప్రతిపాదనలను అమలు చేయలేని కారణంగానే పదవి నుంచి తప్పుకున్నట్టు మాజీ అధ్యక్షుడు శశాంక్ మనోహర్ గతంలోనే తెలిపారు. తనకన్నా సమర్థులు బోర్డులో ఉన్నారని అన్నారు. బీసీసీఐ కార్యదర్శిగా ఎంసీఏ అధ్యక్షుడు షిర్కే ఎన్నికయ్యారు.