న్యూఢిల్లీ: ముందూ వెనక చూడకుండా భారత మాజీ క్రికెటర్ ఒకరు చేసిన వ్యాఖ్య గురువారం క్రికెట్ వర్గాల్లో చర్చకు దారి తీసింది. దానిపై తీవ్ర విమర్శలు రావడంతో ఆయన వెనక్కి తగ్గారు. మాజీ వికెట్ కీపర్ ఫరూక్ ఇంజినీర్ ఒక మీడియాతో మాట్లాడుతూ...‘ఇటీవల జరిగిన వరల్డ్ కప్ సమయంలో నేను భారత సెలక్టర్లను చూశాను. వారిలో ఒక్కరిని కూడా నేను గుర్తుపట్టను. టీమిండియా బ్లేజర్ వేసుకున్న ఒక వ్యక్తిని అడిగితే తాను సెలక్టర్‌ను అని చెప్పాడు. ఇంతకీ వారు చేస్తున్న పనేమిటో తెలుసా. కెప్టెన్ కోహ్లి భార్య అనుష్క శర్మకు అతను టీ అందిస్తున్నాడు’ అని ఫరూఖ్ వ్యాఖ్యానించారు. దీనిపై అనుష్క శర్మ ట్విట్టర్‌లో తీవ్రంగా స్పందించింది. తాను, కోహ్లి స్నేహితులుగా ఉన్ననాటినుంచి అనవసరపు వివాదాల్లోకి తనను ఎన్నో సార్లు లాగారని, భార్యగా మారిన తర్వాత కూడా అది కొనసాగిందని ఆమె చెప్పింది.
అయితే తానెప్పుడూ ఇలాంటి వాటిపై స్పందించలేదని, ఇప్పుడు మాత్రం తప్పడం లేదని బదులిచ్చింది. ‘నేను నా సొంత డబ్బులతో మ్యాచ్, ఫ్లయిట్ టికెట్లు కొంటాను. ప్రపంచ కప్‌లో నేను ఒకే ఒక మ్యాచ్‌కు వచ్చాను. ఫ్యామిలీ బాక్స్‌లోకి కూర్చున్నాను తప్ప సెలక్టర్ల బాక్స్‌లో కాదు. సెలక్టర్లను విమర్శించాలనుంటే నేరుగా అనండి కానీ నన్ను లాగవద్దు. ఈ వ్యాఖ్య చాలా బాధించడంతోనే నేను మాట్లాడుతున్నాను. అయినా నేను టీ తాగను. కాఫీ మాత్రమే తాగుతాను’ అని అనుష్క వ్యాఖ్యానించింది. అనంతరం యు టర్న్ తీసుకున్న ఫరూఖ్ ఇంజినీర్ తాను సరదాగా మాత్రమే అలా అన్నానని చెప్పారు.
‘ఫరూఖ్ చెప్పిన మాటలు పచ్చి అబద్ధం. దురుద్దేశపూరితం. పరువుకు భంగం కలిగించేలా ఉన్నాయి. ప్రపంచకప్‌లో భారత కెప్టెన్ భార్య కూర్చున్న బాక్స్ దరిదాపుల్లో కూడా సెలక్టర్లు లేరు. ఏదో పిచ్చి ప్రేలాపన చేసి పైశాచిక ఆనందం పొందే ప్రయత్నం చేయడం దురదృష్టకరం. తప్పుడు ఆరోపణలతో భారత సెలక్టర్లతో పాటు కెప్టెన్ భార్య పరువు కూడా తీస్తున్నారు. 82 ఏళ్ల వయసు ఉన్న వ్యక్తి దానికి తగినట్లుగా వ్యవహరించాలి’
–ఎమ్మెస్కే ప్రసాద్, సెలక్షన్ కమిటీ చైర్మన్
Comments
Please login to add a commentAdd a comment