'అలా చేస్తే కాల్చిపారేయాలి'
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లో సీఆర్‌పీఎఫ్ జవాన్లపై అల్లరిమూకలు అనుచితంగా ప్రవర్తించడం పట్ల ప్రముఖ రెజ్లర్ యోగేశ్వర్ దత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. సైనికుల పట్ల దురుసుగా ప్రవర్తించిన వారిని కాల్చిపారేయాలని అన్నాడు. అల్లరి మూకల ఆట కట్టించేందుకు సైనికులకు పూర్తి అధికారాలు ఇవ్వాలని అభిప్రాయపడ్డాడు.
'కశ్మీర్ లో ఏదైతే జరిగిందో అది చాలా తప్పు. మన సీఆర్‌పీఎఫ్ జవాన్లను తీవ్రంగా అవమానించారు. సైనికుడిపై దారుణంగా దాడి చేశారు. అతడి హెల్మెట్ రోడ్డుపై దొర్లకుంటూ వెళ్లింది. భారత్ కు తీరని అవమానం జరిగింది. మన సైనికుడిని యువకులు తోసివేయడం చాలా బాధ కలిగించింది. ఎవరైనా దేశానికి వ్యతిరేకంగా నడుచుకున్నా, సైనికుల పట్ల అనుచితంగా ప్రవర్తించినా కాల్చిపారేయాల'ని యోగేశ్వర్ దత్ అన్నాడు.
శ్రీనగర్ లో పోలింగ్ బూత్ నుంచి తిరిగివస్తున్న సీఆర్‌పీఎఫ్ జవాన్లపై యువకులు దాడి చేసిన వీడియో బయటకు రావడంతో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. పలువురు ప్రముఖులు సైనికులకు మద్దతుగా మాట్లాడారు. సీఆర్‌పీఎఫ్ జవాన్లపై దాడిని క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్, విశ్వనటుడు కమల్ హాసన్ ఖండించారు.