అర్జెంటీనా సంచలనం
తొలిసారి సెమీస్‌లోకి హాకీ ప్రపంచకప్
ది హేగ్ (నెదర్లాండ్స్): పురుషుల హాకీ ప్రపంచకప్‌లో అర్జెంటీనా కొత్త చరిత్ర సృష్టించింది. మంగళవారం జరిగిన గ్రూప్ ‘బి’ లీగ్ మ్యాచ్‌లో 5-1తో దక్షిణాఫ్రికాపై గెలిచి తొలిసారి సెమీఫైనల్లోకి అడుగుపెట్టింది. ఈ గ్రూప్‌లో ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలు సాధించిన అర్జెంటీనా మొత్తం 12 పాయింట్లతో ఒలింపిక్ చాంపియన్ జర్మనీని వెనక్కి నెట్టి నాకౌట్ దశకు చేరుకుంది. అర్జెంటీనా, నెదర్లాండ్స్ చేతిలో ఓడటం జర్మనీ అవకాశాలను ఘోరంగా దెబ్బతీశాయి. ప్రపంచకప్ చరిత్రలో జర్మనీ సెమీస్‌కు చేరలేకపోవడం ఇది రెండోసారి. గతంలో 1971లో కెన్యా.... పశ్చిమ జర్మనీకి షాకిచ్చి ముందంజ వేసింది.
దక్షిణాఫ్రికాతో జరిగిన ఏకపక్ష మ్యాచ్‌లో జోక్విమ్ మెనిన్ (20వ ని.), గొంజాగో పిల్లట్ (25, 61వ ని.), లుకాస్ విల్లా (49, 63వ ని.)లు అర్జెంటీనాకు గోల్స్ అందించారు. క్లింటన్ పాంథర్ (57వ ని.) దక్షిణాఫ్రికా తరఫున ఏకైక గోల్ చేశాడు. 1986, 2002 ప్రపంచకప్‌లలో ఆరోస్థానంలో నిలిచిన అర్జెంటీనాకు ఇదే అత్యుత్తమ ప్రదర్శన. మరోవైపు భారత్ 9-10వ స్థానం కోసం దక్షిణ కొరియాతో శనివారం తలపడుతుంది.