న్యూఢిల్లీ: అంచనాలకు మించి రాణించిన భారత గ్రాండ్‌మాస్టర్ కార్తికేయన్ మురళి జిబ్రాల్టర్ అంతర్జాతీయ మాస్టర్స్ చెస్ టోర్నమెంట్‌లో రన్నరప్‌గా నిలిచాడు. ఇంగ్లండ్‌లో జరిగిన ఈ టోర్నమెంట్‌లో చెన్నైకి చెందిన 19 ఏళ్ల కార్తికేయన్ మురళి మొత్తం ఎనిమిది పాయింట్లు సాధించి రెండో స్థానంలో నిలిచాడు. కార్తికేయన్ చివరి ఐదు రౌండ్‌లలో ఐదుగురు గ్రాండ్‌మాస్టర్లు లారినో నిటో డేవిడ్ (స్పెయిన్), ఫాబియన్ లిబిస్‌జెవ్‌స్కీ (ఫ్రాన్స్), రవూఫ్ మమెదోవ్ (అజర్‌బైజాన్), మాక్సిమ్ మత్లకోవ్ (రష్యా), మాక్సిమి వాచియెర్ లాగ్రెవ్ (ఫ్రాన్స్)లను ఓడించడం విశేషం. ఇందులో మమెదోవ్, మాక్సిమ్, లాగ్రెవ్ ఎలోరేటింగ్ 2700 కంటే ఎక్కువ ఉంది. రన్నరప్‌గా నిలిచిన కార్తికేయన్‌కు 20 వేల పౌండ్లు (రూ. 18 లక్షల 61 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి. 8.5 పాయింట్లతో ఆర్తమియెవ్ వ్లాదిస్లావ్ (రష్యా) చాంపియన్‌గా నిలిచాడు. 10 రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల క్రీడాకారులు కూడా అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ఎం.ఆర్.లలిత్ బాబు ఏడు పాయింట్లతో ఈ టోర్నీలో ఎనిమిదో స్థానాన్ని సంపాదించాడు. అంతేకాకుండా టోర్నీ మొత్తంలో ఒక్క గేమ్‌లో కూడా అతను ఓడిపోలేదు. మొత్తం పది గేముల్లో లలిత్ ఎనిమిదింటిని గ్రాండ్‌మాస్టర్లతో ఆడాడు. నిల్స్ గ్రాండెలియుస్ (స్వీడన్), సేతురామన్ (భారత్), గవైన్ జోన్స్ (ఇంగ్లండ్), మైకేల్ ఆడమ్స్ (ఇంగ్లండ్), సో వెస్లీ (అమెరికా), ఇవాన్ సారిచ్ (క్రొయేషియా)లతో ‘డ్రా’ చేసుకోగా... ఇవాన్ చెపరినోవ్ (జార్జియా), అలెగ్జాండర్ ఇండిక్
(సెర్బియా)లపై గెలిచాడు.
ఆంధ్రప్రదేశ్‌కే చెందిన గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి ఆరు పాయింట్లతో 49వ ర్యాంక్‌లో, ద్రోణవల్లి హారిక 5.5 పాయింట్లతో 76వ ర్యాంక్‌లో నిలిచారు. తెలంగాణకు చెందిన గ్రాండ్‌మాస్టర్ హర్ష భరతకోటి ఆరు పాయింట్లతో 47వ స్థానాన్ని దక్కించుకున్నాడు. సీఆర్‌జీ కృష్ణ 5.5 పాయింట్లతో 82వ ర్యాంక్‌ను పొందాడు. ఇద్దరు గ్రాండ్‌మాస్టర్లు సేతురామన్ (భారత్), కాటరీనా లాగ్నో (రష్యా)లపై సీఆర్‌జీ కృష్ణ గెలుపొందినా గ్రాండ్‌మాస్టర్ (జీఎం) టైటిల్‌కు అవసరమైన చివరిదైన మూడో జీఎం నార్మ్‌ను పొందలేకపోయాడు. టోర్నీ మొత్తంలో 150 మంది క్రీడాకారులు పాల్గొనగా అందులో 94 మంది గ్రాండ్‌మాస్టర్లు ఉన్నారు. భారత్ నుంచి 26వ మంది పోటీపడ్డారు.
రన్నరప్ కార్తికేయన్ మురళి
Published Sat, Feb 2 2019 12:25 AM | Last Updated on Sat, Feb 2 2019 12:25 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment