అరుణ రెడ్డి
విశ్వ వేదికపై మరో తెలుగు తేజం మెరిసింది. ప్రతిష్టాత్మక ప్రపంచకప్ జిమ్నాస్టిక్స్ టోర్నమెంట్‌లో తెలుగమ్మాయి బుద్దా అరుణ రెడ్డి కొత్త చరిత్ర లిఖించింది. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో
జరుగుతున్న ఈ మెగా ఈవెంట్‌లో అరుణ మహిళల వాల్ట్ ఈవెంట్‌లో కాంస్య పతకం సాధించింది. తద్వారా ఈ టోర్నమెంట్ చరిత్రలో పతకం నెగ్గిన తొలి భారతీయ జిమ్నాస్ట్‌గా ఈ హైదరాబాద్ అమ్మాయి రికార్డు నెలకొల్పింది. ఆమె ఖాతాలో మరో పతకం చేరే అవకాశం ఉంది. నేడు జరిగే ఫ్లోర్ ఎక్సర్‌సైజ్ ఫైనల్లో ఆమె తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.
సాక్షి, హైదరాబాద్: అందరి అంచనాలను తారుమారు చేస్తూ తెలుగు అమ్మాయి బుద్దా అరుణ రెడ్డి ప్రపంచకప్ జిమ్నాస్టిక్స్ టోర్నమెంట్‌లో పతకం సొంతం చేసుకుంది. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ నగరంలో జరుగుతున్న ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన 22 ఏళ్ల అరుణ వాల్ట్ ఈవెంట్‌లో మూడో స్థానాన్ని సంపాదించి కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. ఫైనల్లో అరుణ రెడ్డి 13.649 పాయింట్లు స్కోరు చేసింది. జాసా కిస్‌లెప్ (స్లొవేనియా–13.800 పాయింట్లు) స్వర్ణం దక్కించుకోగా... ఎమిలీ (ఆస్ట్రేలియా –13.699 పాయింట్లు) రజతం గెల్చుకుంది. భారత్‌కే చెందిన ప్రణతి నాయక్ (13.416 పాయింట్లు) ఆరో స్థానంతో సరిపెట్టుకుంది. ప్రపంచ చాంపియన్‌షిప్ తర్వాత అంతే ప్రాముఖ్యత కలిగిన టోర్నమెంట్‌గా ప్రపంచకప్‌కు పేరుంది. అంతర్జాతీయ జిమ్నాస్టిక్స్ సమాఖ్య ఆధ్వర్యంలో 2010లో ప్రపంచకప్ సిరీస్ మొదలైంది. రియో ఒలింపిక్స్‌లో నాలుగో స్థానంలో నిలిచిన భారత స్టార్ జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ ఆసియా చాంపియన్‌షిప్, 2014 కామన్వెల్త్ గేమ్స్‌లో కాంస్య పతకాలు గెలిచినా... ప్రపంచకప్‌లో మాత్రం పతకాలను సాధించలేకపోయింది.
నిరీక్షణ ముగిసింది...
పద్నాలుగేళ్లుగా జిమ్నాస్టిక్స్‌లో కొనసాగుతున్న అరుణ రెడ్డి జాతీయస్థాయిలో ఎన్నో పతకాలు సాధిం చింది. అయితే అంతర్జాతీయస్థాయిలో మాత్రం పతకం నెగ్గడం ఇదే తొలిసారి. 2013 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో, 2014 కామన్వెల్త్ క్రీడలు, 2014 ఆసియా క్రీడలు, 2017 ఆసియా చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించినా క్వాలిఫయింగ్ దశను దాటలేకపోయింది. ఈసారి మాత్రం రెండు ఈవెంట్స్‌లో ఫైనల్‌కు చేరుకోవడంతోపాటు కాంస్య పతకాన్ని దక్కించుకుంది.
కరాటే నుంచి జిమ్నాస్టిక్స్ వైపు...
ఐదేళ్ల వయసులో కరాటేలో అడుగు పెట్టిన అరుణ మూడేళ్లపాటు అదే క్రీడలో కొనసాగింది. ఈ దశలో అరుణ శరీరాకృతి జిమ్నాస్టిక్స్‌కు అనువుగా ఉందని ఆమె కరాటే మాస్టర్ సలహా ఇచ్చారు. దాంతో ఆమె కరాటేను వదిలి జిమ్నాస్టిక్స్ వైపు మళ్లింది. హైదరాబాద్‌లోని లాల్‌బహదూర్ స్టేడి యంలో కోచ్ బ్రిజ్ కిశోర్ వద్ద పదేళ్లుగా శిక్షణ పొందుతోన్న అరుణ ఒక్కో అడుగు ముందుకేస్తూ నేడు అంతర్జాతీయ జిమ్నాస్ట్‌గా ఎదిగింది.
నాన్నకు ప్రేమతో...
జిమ్నాస్ట్‌గా కెరీర్‌లో కుదురుకుంటున్న వేళ 2012లో అరుణ రెడ్డి కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. తన కూతురును ఏనాటికైనా చాంపియన్‌గా చూడాలనుకున్న ఆమె తండ్రి నారాయణ రెడ్డి హఠాన్మరణం చెందారు. ఈ ఘటనతో కలత చెందిన అరుణ ఒకదశలో ఆటకు వీడ్కోలు చెప్పాలని భావించింది. అయితే తన కెరీర్‌కు ఎలాంటి ఆటంకం ఉండకూడదనే ఉద్దేశంతో... సొంత ఇంటిని విక్రయించిన నాన్న త్యాగం వృథా కాకూడదని అరుణ భావించింది. అదే ఏడాది ఉదయ్‌పూర్‌లో జరిగిన జాతీయ పోటీల్లో వాల్ట్, బ్యాలెన్సింగ్ బీమ్‌లో స్వర్ణాలు గెలిచి నాన్న కలను సాకారం చేసింది. తండ్రి మరణంతో ఆటపై ఏకాగ్రత లోపించిన దశలో ఆమె తల్లి, అక్క, బావ ధైర్యం చెప్పి నిరంతరం ప్రోత్సహించడంతో అరుణ కెరీర్ మళ్లీ సరైన ట్రాక్‌లోకి వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment