Medalist
-
పారా షట్లర్లకు రూ. 50 లక్షలు నజరానా
న్యూఢిల్లీ: పారిస్ పారాలింపిక్స్‌లో పతకాలు సాధించిన ఐదుగురు పారా షట్లర్లకు భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) రూ. 50 లక్షల నజరానా ప్రకటించింది. ఇటీవల జరిగిన దివ్యాంగుల విశ్వ క్రీడల్లో భారత షట్లర్లు ఐదు పతకాలు (ఒక స్వర్ణం, రెండు రజతాలు, రెండు కాంస్యాలు) సాధించారు. పురుషుల సింగిల్స్ ఎస్ఎల్3 విభాగంలో స్వర్ణం గెలిచిన నితీశ్ కుమార్‌కు రూ. 15 లక్షలు, రజత పతకాలు గెలిచిన సుహాస్ యతిరాజ్ (పురుషుల సింగిల్స్ ఎస్ఎల్4), తులసిమతి మురుగేశన్ (మహిళల సింగిల్స్ ఎస్‌యూ5)లకు రూ. 10 లక్షల చొప్పున నగదు బహుమతి ప్రకటించింది. మహిళల సింగిల్స్ ఎస్‌యూ5లో కాంస్యం నెగ్గిన మనీషా రామదాస్, ఎస్‌యూ5లో కాంస్యం సాధించిన నిత్యశ్రీకి రూ. 7.5 లక్షల చొప్పున నజరానా ప్రకటించింది. ‘అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా రాణిస్తున్న భారత పారా షట్లర్లకు నగదు బహుమతి అందించాలని నిర్ణయించాం. పారాలింపిక్స్‌లో సాధించిన పతకాలకు ఇది గుర్తింపు లాంటిది. మరిన్ని పతకాలు సాధించేందుకు పారా షట్లర్లకు అన్ని విధాలుగా అండగా నిలుస్తాం’ అని బ్యాడ్మింటన్ సంఘం కార్యదర్శి సంజయ్ మిశ్రా పేర్కొన్నాడు. -
ఒట్టు... మను బాకర్ భోజనమే చేయలేదు!
గెలుపు, ఓటములకు అతీతంగా కొన్ని విషయాలు ఆసక్తికరంగా ఉంటాయి. ఆట అంటే ‘గెలుపు’ లేదా ‘ఓటమి’ మాత్రమే కాదు. గెలుపుకు ముందు, గెలిచిన తరువాత, ఓటమికి ముందు ఓటమికి తరువాత విషయాలు కూడా పసందుగా ఉంటాయి. ‘షూటర్ మను బాకర్ పారిస్ ఒలింపిక్స్‌లో భోజనం చేయలేదు’ అనే విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అరె మనకు పతకాలు తెచ్చిన అమ్మాయి భోజనం చేయలేదా? ఎందుకు చేయలేదు?పారిస్ ఒలింపిక్స్‌లో వ్యక్తిగత విభాగంలో కాంస్యం, మిక్స్డ్ టీమ్ విభాగంలో మరో కాంస్యాన్ని గెలుచుకొని రికార్డ్ సృష్టించింది షూటర్ మను బాకర్. ‘ఇది మను ఒలింపిక్స్’ అంటూ క్రీడాభిమానుల ప్రశంసలు అందుకుంది. 25 మీటర్ల విభాగంలో మూడో పతకం కొద్దిలో చేజారింది.హిస్టారిక్ మెడల్ హాట్రిక్ మిస్ అయిన తరువాత ఆమె ఏం ఆలోచించిందనే విషయానికి వస్తే... మొదటిది... నాలుగు సంవత్సరాల తరువాత లాస్ ఏంజెల్స్‌లో జరగనున్న ఒలింపిక్స్ గురించి. రెండోది... భోజనం గురించి. మొదటి విషయం సరే, రెండో విషయమే అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.ఆడి ఆడి అలిసిపోయిన మను బాకర్‌ను విశ్రాంతి గురించి అడిగినప్పుడు... ‘నేను చేసే మొదటి పని ఇంటి భోజనం చేయడం. ఇన్ని రోజులు నేను భోజనం చేయలేదు. విలేజ్‌లో బ్రేక్ ఫాస్ట్ చేసి, షూటింగ్ రేంజ్‌కు వచ్చేదాన్ని. అక్కడ స్నాక్స్ తినేదాన్ని. విలేజ్‌లో మధ్నాహ్న భోజనం ఉంటుంది. ప్రాక్టీస్ తర్వాత 3 లేదా 5 గంటల మధ్య మాత్రమే తిరిగి భోజనశాలకు రావడానికి వీలయ్యేది. ఆ సమయానికి మధ్యాహ్న భోజనం అయిపోయేది. దాంతో సాయంత్రం ఏదో తినేదాన్ని’ అని ఒక ఇంటర్వ్యూలో చెప్పింది మను బాకర్.మను మధ్యాహ్న భోజనానికి దూరమైన విషయం ఆమె తల్లి సుమేధకు కూడా తెలిసి పోయింది.కుమార్తె విజయం కోసం రోజూప్రార్థనలు చేసిన ఆమె ఇలా అన్నది...‘మను ఇంటికి తిరిగి రాగానే వేడి వేడి ఆలూ పరోట తినిపిస్తాను. మనుకు ఆలూ పరోట అంటే ఎంతో ఇష్టం’ ‘కుమార్తె గెలుపు వార్త మాత్రమే వినాలి... తన ఓటమిని చూడలేను’ అనుకుందో ఏమో మను బాకర్ లైవ్ మ్యాచ్‌లు చూడడానికి ఇష్టపడేది కాదు సుమేధ.‘మా అమ్మ నన్ను ఛాంపియన్ చేయడం కోసం ఎంతో కష్టపడింది. అమ్మా... నువ్వు ఎప్పుడు ఆయురారోగ్యాలతో ఉండాలి’ అంటున్న మను బాకర్ అమ్మ చేతి వంట కోసం ఎదురు చూస్తోంది.‘ఏదైనా సరే, మా ఇంట్లో అమ్మ చేతివంట తినడం అంటే ఎంతో ఇష్టం. ఐ రియల్లీ లవ్ ఆలూ పరోటా. ఆలూ పరోటా తినక నాలుగు నెలలు అవుతోంది’ అంటుంది మను బాకర్ మనకు విజయాలు మాత్రమే కనిపిస్తాయి. ఆ విజయాల వెనుక ఎన్ని సర్దుబాట్లు ఉంటాయో చెప్పడానికి మను బాకర్ ఒక ఉదాహరణ.ఒకటి రెండు రోజులంటే ఫరవాలేదుగానీ ఎన్నో రోజులు మధ్నాహ్న భోజనం లేకుండా గడిపింది మను. ఆ సమయంలో ఆమెకు కోపం రాలేదు. ఎందుకంటే మను బాకర్ ‘గెలుపు’ ఆకలితో ఉంది. రెండు పతకాలతో ఆ ఆకలి తీరింది.డైట్ రొటీన్భోజనానికి సంబంధించి వ్యక్తిగత ఇష్టాయిష్టాలు వేరు. క్రీడాకారిణిగా వేరు. శాకాహారి అయిన మను బాకర్ ‘డైట్ రోటిన్’ విషయానికి వస్తే... హెల్తీ ఫ్యాట్స్. లో–జీఐ కార్బోహైడ్రేడ్స్తో కూడిన సింపుల్ డైట్కుప్రాధాన్యత ఇస్తుంది. అలసట, గాయాలకు దూరంగా ఉండడానికి డైట్లో హైడ్రేషన్‌కు అధికప్రాధాన్యత ఇస్తుంది. మను డైట్లో రకరకాల పండ్లు, విటమిన్ సి అధికంగా ఉండే కూరగాయలు ఉంటాయి. హై–ఎనర్జీ, షుగర్ ఫుడ్స్‌కు దూరంగా ఉంటుంది.ఆహారానికి ఎంతప్రాధాన్యత ఇస్తుందో కంటినిండా నిద్రకు అంతేప్రాధాన్యత ఇస్తుంది. యోగా, జిమ్ తరువాత ప్రతిరోజూ ఏడు నుంచి ఎనిమిది గంటలు షూటింగ్ ప్రాక్టీస్ చేస్తుంది. మానసిక ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని పెయింటింగ్స్ వేస్తుంటుంది. మైండ్ ఫోకస్డ్గా ఉండడానికి క్రియేటివ్ వర్క్ ఉపయోగపడుతుందని చెబుతుంది మను బాకర్. -
వృత్తి అగర్వాల్‌కు ఐదో పతకం
పనాజీ (గోవా): జాతీయ క్రీడల్లో తెలంగాణ స్విమ్మర్ వృత్తి అగర్వాల్ అద్భుత ప్రతిభ కనబరిచింది. ఈ క్రీడల్లో శుక్రవారం ఆమె ఐదో పతకాన్ని సొంతం చేసుకుంది. 400 మీటర్ల ఫ్రీస్టయిల్ ఈవెంట్లో వృత్తి (4ని:30.03 సెకన్లు) రజత పతకాన్ని దక్కించుకుంది. గుజరాత్లో జరిగిన గత జాతీయ క్రీడల్లో వృత్తి మూడు రజతాలు, ఒక కాంస్యంతో నాలుగు పతకాలు సాధించింది. ఈసారి ఆమె మూడు రజతాలు, రెండు కాంస్యాలతో ఐదు పతకాలను తన ఖాతాలో జమ చేసుకుంది. ఫైనల్లో రష్మిక–శివాని జోడీ జాతీయ క్రీడల మహిళల టెన్నిస్ ఈవెంట్ డబుల్స్ విభాగంలో తెలంగాణకు చెందిన భమిడిపాటి శ్రీవల్లి రష్మిక–శ్రావ్య శివాని జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో రష్మిక –శివాని ద్వయం 6–4, 6–7 (5/7), 10–5తో షర్మదా బాలూ–సోహా సాదిక్ (కర్ణాటక) జంటను ఓడించింది. సింగిల్స్ విభాగంలో రష్మిక సెమీఫైనల్లోకి ప్రవేశించింది. -
ప్రణయ్ ప్రతాపం.. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో పతకం ఖరారు
దశాబ్దకాలంగా భారత అగ్రశ్రేణి షట్లర్‌గా కొనసాగుతున్న హెచ్ఎస్ ప్రణయ్ ఎట్టకేలకు విశ్వవేదికపై తన సత్తా చాటుకున్నాడు. అత్యంత ప్రతిభావంతుడైనప్పటికీ నిలకడలేమితో ఇన్నాళ్లూ అందని ద్రాక్షగా ఊరించిన ప్రపంచ చాంపియన్‌షిప్ పతకం తొలిసారి ప్రణయ్ మెడలో పడనుంది. 2021, 2022 ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో క్వార్టర్ ఫైనల్లో వెనుదిరిగి పతకానికి చేరువై దూరమైన ఈ కేరళ స్టార్ మూడో ప్రయత్నంలో మాత్రం అసాధారణ ఆటతీరుతో సక్సెస్ సాధించాడు. ప్రపంచ నంబర్‌వన్, టోక్యో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత, ప్రపంచ చాంపియన్, యూరోపియన్ చాంపియన్ అయిన డెన్మార్క్ స్టార్ విక్టర్ అక్సెల్సన్ను అతని సొంతగడ్డపైనే ఓడించి ప్రణయ్ తన కెరీర్లోనే చిరస్మరణీయ విజయాన్ని అందుకున్నాడు. ఈ మెగా ఈవెంట్లో తొలిసారి సెమీఫైనల్ చేరిన ప్రణయ్ కనీసం కాంస్య పతకాన్ని ఖరారు చేసుకున్నాడు. కోపెన్‌హాగెన్ (డెన్మార్క్): ఈ సీజన్లో సూపర్ ఫామ్‌లో ఉన్న భారత స్టార్ షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్ మరో అద్భుతం చేశాడు. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ పురుషుల సింగిల్స్‌లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లి కనీసం కాంస్య పతకాన్ని ఖరారు చేసుకున్నాడు. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ ప్రణయ్ 13–21, 21–15, 21–16తో టాప్ సీడ్ విక్టర్ అక్సెల్సన్ (డెన్మార్క్)ను ఓడించాడు. నేడు జరిగే సెమీఫైనల్లో కున్లావుత్ వితిద్సర్న్ (థాయ్‌లాండ్) తో ప్రణయ్ ఆడతాడు. అక్సెల్సన్తో 68 నిమిషాలపాటు హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో ప్రణయ్ తొలి గేమ్‌ను చేజార్చుకున్నా నిరాశపడకుండా పట్టుదలతో ఆడి వరుసగా రెండు గేమ్‌లు గెలిచి ముందంజ వేశాడు. సొంతగడ్డపై జరుగుతున్న మెగా ఈవెంట్లో ప్రణయ్ ధాటికి అక్సెల్సన్కు అనూహ్య పరాజయం తప్పలేదు. తొలి గేమ్ కోల్పోయిన ప్రణయ్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్, మరో కోచ్ గురుసాయిదత్ సూచనలతో తన వ్యూహం మార్చుకున్నాడు. సుదీర్ఘ ర్యాలీలు ఆడుతూ, అడపాదడపా కళ్లు చెదిరే స్మాష్‌లతో ప్రణయ్ ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టి అనవసర తప్పిదాలు చేసేలా చేశాడు. రెండో గేమ్‌లో స్కోరు 13–10 వద్ద ప్రణయ్ వరుసగా నాలుగు పాయింట్లు గెలిచి 17–10తో ఆధిక్యంలోకి వెళ్లాడు. అదే ఊపులో రెండో గేమ్‌ను సొంతం చేసుకొని మ్యాచ్‌లో నిలిచాడు. మూడో గేమ్‌లోనూ ప్రణయ్ దూకుడు కొనసాగిస్తూ అక్సెల్సన్పై ఒత్తిడి పెంచాడు. స్కోరు 7–6 వద్ద ప్రణయ్ ఒక్కసారిగా చెలరేగి వరుసగా ఐదు పాయింట్లు నెగ్గి 13–6తో ముందంజ వేశాడు. ఆ తర్వాత అక్సెల్సన్ తేరుకునే ప్రయత్నం చేసినా ప్రణయ్ ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా ఆడుతూ విజయం అందుకున్నాడు. సాత్విక్–చిరాగ్ జోడీ ఓటమి పురుషుల డబుల్స్ విభాగం నుంచి ప్రపంచ రెండో ర్యాంక్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) నిష్క్రమించింది. క్వార్టర్ ఫైనల్లో సాత్విక్–చిరాగ్ ద్వయం 18–21, 19–21తో ప్రపంచ 11వ ర్యాంక్ జంట కిమ్ అస్ట్రుప్–ఆండెర్స్ స్కారప్ రస్ముసెన్ (డెన్మార్క్) చేతిలో పోరాడి ఓడిపోయింది. గత ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం నెగ్గి చరిత్ర సృష్టించిన సాత్విక్–చిరాగ్ ద్వయం ఈసారి అలాంటి ఫలితాన్ని పునరావృతం చేయలేకపోయింది. ఇప్పటిదాకా 14 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత షట్లర్లు గెలిచిన పతకాల సంఖ్య. మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు (1 స్వర్ణం, 2 రజతాలు, 2 కాంస్యాలు), సైనా నెహ్వాల్ (1 రజతం, 1 కాంస్యం), పురుషుల సింగిల్స్‌లో ప్రకాశ్ పదుకొనే (1 కాంస్యం), సాయిప్రణీత్ (1 కాంస్యం), కిడాంబి శ్రీకాంత్ (1 రజతం), లక్ష్య సేన్ (1 కాంస్యం), గుత్తా జ్వాల–అశి్వని పొన్నప్ప (1 కాంస్యం), సాత్విక్–చిరాగ్ శెట్టి (1 కాంస్యం) ఈ జాబితాలో ఉన్నారు. ప్రణయ్ సెమీస్‌లో ఓడితే కాంస్య పతకం దక్కుతుంది. ఫైనల్ చేరి గెలిస్తే స్వర్ణ పతకం, ఓడితే రజత పతకం లభిస్తుంది. 2011 నుంచి ప్రతి ప్రపంచ చాంపియన్‌షిప్‌లోనూ భారత బ్యాడ్మింటన్ క్రీడాకారులు పతకాలు సాధిస్తుండటం విశేషం. -
మీరు ఆడండి.. మేము అండగా ఉంటాం.. ‘టోక్యో’తో మారిన సీన్!
టోక్యో ఒలింపిక్స్ భారత క్రీడా ముఖ చిత్రాన్ని మార్చనున్నాయా? క్రికెట్‌తో పాటు ఇతర క్రీడలకు కార్పోరేటు దన్ను విస్తరించనుందా? ఆటగాళ్లకు మెరుగైన సౌకర్యాలు, శిక్షణ లభించనున్నాయా అంటే అవుననే సమాధానం వస్తోంది. సాక్షి, వెబ్‌డెస్క్: అనేక అనుమానాల మధ్య మొదలైన టోక్యో ఒలింపిక్స్ భారత క్రీడలపై భారీ ప్రభావం చూపింది. ఆరంభంలో అపజయాలు పలకరించినా విశ్వ క్రీడల చివరల్లో భారత ఆటగాళ్లు చూపిన తెగువ, పోరాడిన తీరు ఇండియన్ల మనసుపై చెరగని ముద్రని వేశాయి. గట్టి ప్రోత్సాహం లభిస్తే మన ఆటగాళ్లు విశ్వవేదికలపై మరింత మెరుగైన ప్రదర్శన, పతాకలు తేవడం గ్యారంటీ అనే భరోసా ఇచ్చాయి. దీంతో ఆటగాళ్లకు మెరుగైన శిక్షణ, వసతులు కల్పించడంతో పాటు ఆర్థికంగా అండగా ఉండేందుకు కార్పోరేటు కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి. ప్రైవేటు రంగంలో కోచింగ్ సెంటర్లు ఒలింపిక్ క్రీడల్లో అథ్లెటిక్స్ విభాగంలో అప్పుడెప్పుడో రన్నింగ్ రేసులో పీటీ ఉష పతకం ఆశలు రేపగా దాదాపు నలభై ఏళ్లకు జావెలిన్ త్రోలో నీరజ్ చోప్డా ఆ కలను నిజం చేశాడు. రెజ్లింగ్‌లో భజరంగ్ పునియా రజతంతో మెరిశాడు. అయితే వీరిద్దరు ఒలింపిక్స్‌కి ముందు ఇన్స్పైర్ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ (ఐఐఎస్)లో శిక్షణ పొందారు. ఇండియా నుంచి ఒలింపిక్స్‌లో పోటీ పడుతున్న క్రీడాకారులకు అత్యుత్తమ శిక్షణ ఇచ్చేందుకు ఐఐఎస్ పని చేస్తోంది. దీనికి ఆర్థిక సహకారాన్ని జిందాల్ ఇండస్ట్రీస్‌తో పాటు కోటక్ గ్రూప్, ఇండస్ఇండ్, సిటీబ్యాంక్, బ్రిడ్జిస్టోన్, బోరోసిల్ ఇలా మొత్తం 20కి పైగా కార్పోరేట్ కంపెనీలు ఆర్థిక సాయం అందిస్తున్నాయి. ప్రభుత్వ పరంగా కాకుండా క్రీడాకారులకు అత్యుత్తమ శిక్షణ ఇచ్చే ప్రైవేటు ఇన్సిస్టి్యూట్గా ఐఐఎస్ పేరు మార్మోగిపోతుంది. పెరుగుతున్న ఫండింగ్ ఐఐఎస్‌లో శిక్షణ తీసుకున్న ఇద్దరు ఒలింపిక్ పతకాలు తేవడంతో ఈ ఏడాది ఐఐఎస్‌కు తమ ఫండింగ్‌ను 40 శాతం పెంచుతామంటూ జేఎస్‌డబ్ల్యూ సిమెంట్స్ ఎండీ పార్థ్ జిందాల్ ప్రకటించారు. తమలాగే రిలయన్స్, ఆదానీ, టాటాలు కూడా పెంచే అవకాశం ఉందంటూ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ విషఁంలో రిలయన్స్ ఒక అడుగు ముందుకు వేసి గోస్పోర్ట్స్ ఫౌండేషన్ పేరుతో ఎన్జీవోని నిర్వహిస్తోంది. కంపెనీలకు అవసరమే మనదేశంలో క్రికెట్‌కి క్రేజ్ ఎక్కువ. బ్రాండ్ ప్రచారం చేసుకోవాలన్నా క్రికెట్ ప్రధానంగా అయ్యింది. అయితే క్రికెట్ స్సాన్సర్షిప్, ఆటగాళ్ల ఎండార్స్మెంట్ ఫీజులు కోట్లలో ఉంటున్నాయి. వీటిని దక్కించుకోవాలంటే భారీగా ఖర్చు చేయాల్సి వస్తోంది. దీంతో ఇతర క్రీడలను ప్రోత్సహించడం అనివార్యత ఎప్పటి నుంచో ఉంది. ఎడిల్‌వైస్ కంపెనీ అయితే 2008 నుంచి ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్ (ఏజీక్యూ) పేరుతో ప్రత్యేకంగా ఫండ్ ఏర్పాటు చేసి శిక్షణ ఇస్తోంది. అయితే దేశం మొత్తం గుర్తించి... సెలబ్రేట్ చేసుకునే స్థాయిలో ఆటగాళ్ల నుంచి విజయాలు రాలేదు. ఒలింపిక్ చరిత్రలోనే ఈసారి ఇండియాకు అత్యధిక పతకాలు వచ్చాయి. దీంతో మెరుగైన ఆటగాళ్లకు స్పాన్సర్ చేసేందుకు ఒలింపిక్ అసోసియేషన్‌తో ఎడిల్‌వైస్ కంపెనీ చర్చలు ప్రారంభించింది. పీపీపీ మోడ్ ఒడిషా, టాటా గ్రూపులు సంయుక్తంగా పబ్లిక్, ప్రైవేటు పార్ట్నర్షిప్లో పురుష, మహిళా హకీ జట్లను స్పాన్సర్షిప్ అందించాయి. నలభై ఏళ్ల తర్వాత పురుషుల హాకీ జట్టు కాంస్య పతకం సాధించగా మహిళల జట్టు తృటిలో పతకాన్ని కోల్పోయినా స్ఫూర్తిదాయక ఆటతీరుని కనబరిచింది. దీంతో పీపీపీ మోడ్‌లో ఆటగాళ్లకు అండగా నిలించేందుకు రియలన్స్, జిందాల్‌లు ముందుకు వచ్చాయి. అథ్లెటిక్స్‌కి రిలయన్స్ స్పాన్సర్ చేస్తుండగా స్విమ్మింగ్‌కి చేదోడుగా ఉండేందుకు జిందాల్ అంగీకారం తెలిపింది. ఒడిషా తరహాలో ఒక్కో రాష్ట్రం ఒక్కో క్రీడకు అండగా నిలిస్తే విశ్వపోటీల్లో ఇండియా ప్రదర్శన మరో స్థాయిలో ఉంటుందని జిందాల్ స్పోర్ట్స్ హెడ్ వినీల్ కార్నిక్ తెలిపారు. -
అరుణ చరిత్ర
విశ్వ వేదికపై మరో తెలుగు తేజం మెరిసింది. ప్రతిష్టాత్మక ప్రపంచకప్ జిమ్నాస్టిక్స్ టోర్నమెంట్లో తెలుగమ్మాయి బుద్దా అరుణ రెడ్డి కొత్త చరిత్ర లిఖించింది. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో జరుగుతున్న ఈ మెగా ఈవెంట్లో అరుణ మహిళల వాల్ట్ ఈవెంట్లో కాంస్య పతకం సాధించింది. తద్వారా ఈ టోర్నమెంట్ చరిత్రలో పతకం నెగ్గిన తొలి భారతీయ జిమ్నాస్ట్‌గా ఈ హైదరాబాద్ అమ్మాయి రికార్డు నెలకొల్పింది. ఆమె ఖాతాలో మరో పతకం చేరే అవకాశం ఉంది. నేడు జరిగే ఫ్లోర్ ఎక్సర్సైజ్ ఫైనల్లో ఆమె తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. సాక్షి, హైదరాబాద్: అందరి అంచనాలను తారుమారు చేస్తూ తెలుగు అమ్మాయి బుద్దా అరుణ రెడ్డి ప్రపంచకప్ జిమ్నాస్టిక్స్ టోర్నమెంట్లో పతకం సొంతం చేసుకుంది. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ నగరంలో జరుగుతున్న ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన 22 ఏళ్ల అరుణ వాల్ట్ ఈవెంట్లో మూడో స్థానాన్ని సంపాదించి కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. ఫైనల్లో అరుణ రెడ్డి 13.649 పాయింట్లు స్కోరు చేసింది. జాసా కిస్లెప్ (స్లొవేనియా–13.800 పాయింట్లు) స్వర్ణం దక్కించుకోగా... ఎమిలీ (ఆస్ట్రేలియా –13.699 పాయింట్లు) రజతం గెల్చుకుంది. భారత్‌కే చెందిన ప్రణతి నాయక్ (13.416 పాయింట్లు) ఆరో స్థానంతో సరిపెట్టుకుంది. ప్రపంచ చాంపియన్‌షిప్ తర్వాత అంతే ప్రాముఖ్యత కలిగిన టోర్నమెంట్‌గా ప్రపంచకప్‌కు పేరుంది. అంతర్జాతీయ జిమ్నాస్టిక్స్ సమాఖ్య ఆధ్వర్యంలో 2010లో ప్రపంచకప్ సిరీస్ మొదలైంది. రియో ఒలింపిక్స్‌లో నాలుగో స్థానంలో నిలిచిన భారత స్టార్ జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ ఆసియా చాంపియన్‌షిప్, 2014 కామన్వెల్త్ గేమ్స్‌లో కాంస్య పతకాలు గెలిచినా... ప్రపంచకప్‌లో మాత్రం పతకాలను సాధించలేకపోయింది. నిరీక్షణ ముగిసింది... పద్నాలుగేళ్లుగా జిమ్నాస్టిక్స్‌లో కొనసాగుతున్న అరుణ రెడ్డి జాతీయస్థాయిలో ఎన్నో పతకాలు సాధిం చింది. అయితే అంతర్జాతీయస్థాయిలో మాత్రం పతకం నెగ్గడం ఇదే తొలిసారి. 2013 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో, 2014 కామన్వెల్త్ క్రీడలు, 2014 ఆసియా క్రీడలు, 2017 ఆసియా చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించినా క్వాలిఫయింగ్ దశను దాటలేకపోయింది. ఈసారి మాత్రం రెండు ఈవెంట్స్‌లో ఫైనల్‌కు చేరుకోవడంతోపాటు కాంస్య పతకాన్ని దక్కించుకుంది. కరాటే నుంచి జిమ్నాస్టిక్స్ వైపు... ఐదేళ్ల వయసులో కరాటేలో అడుగు పెట్టిన అరుణ మూడేళ్లపాటు అదే క్రీడలో కొనసాగింది. ఈ దశలో అరుణ శరీరాకృతి జిమ్నాస్టిక్స్‌కు అనువుగా ఉందని ఆమె కరాటే మాస్టర్ సలహా ఇచ్చారు. దాంతో ఆమె కరాటేను వదిలి జిమ్నాస్టిక్స్ వైపు మళ్లింది. హైదరాబాద్‌లోని లాల్‌బహదూర్ స్టేడి యంలో కోచ్ బ్రిజ్ కిశోర్ వద్ద పదేళ్లుగా శిక్షణ పొందుతోన్న అరుణ ఒక్కో అడుగు ముందుకేస్తూ నేడు అంతర్జాతీయ జిమ్నాస్ట్‌గా ఎదిగింది. నాన్నకు ప్రేమతో... జిమ్నాస్ట్‌గా కెరీర్లో కుదురుకుంటున్న వేళ 2012లో అరుణ రెడ్డి కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. తన కూతురును ఏనాటికైనా చాంపియన్‌గా చూడాలనుకున్న ఆమె తండ్రి నారాయణ రెడ్డి హఠాన్మరణం చెందారు. ఈ ఘటనతో కలత చెందిన అరుణ ఒకదశలో ఆటకు వీడ్కోలు చెప్పాలని భావించింది. అయితే తన కెరీర్‌కు ఎలాంటి ఆటంకం ఉండకూడదనే ఉద్దేశంతో... సొంత ఇంటిని విక్రయించిన నాన్న త్యాగం వృథా కాకూడదని అరుణ భావించింది. అదే ఏడాది ఉదయ్‌పూర్‌లో జరిగిన జాతీయ పోటీల్లో వాల్ట్, బ్యాలెన్సింగ్ బీమ్‌లో స్వర్ణాలు గెలిచి నాన్న కలను సాకారం చేసింది. తండ్రి మరణంతో ఆటపై ఏకాగ్రత లోపించిన దశలో ఆమె తల్లి, అక్క, బావ ధైర్యం చెప్పి నిరంతరం ప్రోత్సహించడంతో అరుణ కెరీర్ మళ్లీ సరైన ట్రాక్‌లోకి వచ్చింది. -
శ్యామ్‌కు పతకం ఖాయం
న్యూఢిల్లీ: ఇండియా ఓపెన్ అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్లో భారత బాక్సర్ కాకర శ్యామ్ కుమార్ (49 కేజీలు) సెమీఫైనల్లోకి ప్రవేశించి కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకున్నాడు. వైజాగ్‌కు చెందిన శ్యామ్ మంగళవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో ఇలాహి ఇంగాతన్ (ఇండోనేసియా)పై గెలుపొందాడు. మహిళల విభాగంలో మేరీకోమ్ (51 కేజీలు), సరితా దేవి (60 కేజీలు) కూడా సెమీస్ చేరారు. -
పారాలింపియన్లకు సన్మానం
నగదు బహుమతులు అందజేసిన ‘సుమధుర’ గ్రూపు హైదరాబాద్: రియో పారాలింపిక్స్ పతక విజేతలను హైదరాబాద్‌లో ఘనంగా సత్కరించారు. బంగారు పతకాలు గెలిచిన దేవేంద్ర జజారియా (జావెలిన్ త్రో), మరియప్పన్ తంగవేలు (హైజంప్)తో పాటు కాంస్యం నెగ్గిన వరుణ్ సింగ్ భటి (హైజంప్)లను ‘సుమధుర’ అక్రొపొలిస్ గ్రూప్ ఘనంగా సన్మానించింది. శనివారం పార్క్ హయత్ హోటల్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర రవాణా మంత్రి మహేందర్ రెడ్డి ముఖ్యఅతిథిగా విచ్చేయగా, గౌరవ అతిథిగా ఢిల్లీలోని తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలాచారి, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పాల్గొన్నారు. మంత్రి మహేందర్, వేణుగోపాలాచారి చేతుల మీదుగా విజేతలకు రూ. 5 లక్షల చెక్‌ను అందజేశారు. తంగవేలు కోచ్ సత్యనారాయణకు రూ. 4 లక్షలు బహుకరించారు. ఈ కార్యక్రమంలో సుమధుర గ్రూపు చైర్మన్ జి.మధుసూదన్, వైస్ చైర్మన్ రామారావు, డెరైక్టర్ భరత్ తదితరులు పాల్గొన్నారు. వైకల్యాన్ని లెక్కజేయకుండా పతకాలు సాధించి దేశ గౌరవాన్ని పెంచారంటూ అథ్లెట్లపై అతిథులు ప్రశంసల వర్షం కురిపించారు.