దశాబ్దకాలంగా భారత అగ్రశ్రేణి షట్లర్‌గా కొనసాగుతున్న హెచ్‌ఎస్ ప్రణయ్ ఎట్టకేలకు విశ్వవేదికపై తన సత్తా చాటుకున్నాడు. అత్యంత ప్రతిభావంతుడైనప్పటికీ నిలకడలేమితో ఇన్నాళ్లూ అందని ద్రాక్షగా ఊరించిన ప్రపంచ చాంపియన్‌షిప్ పతకం తొలిసారి ప్రణయ్ మెడలో పడనుంది.
2021, 2022 ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో క్వార్టర్ ఫైనల్లో వెనుదిరిగి పతకానికి చేరువై దూరమైన ఈ కేరళ స్టార్ మూడో ప్రయత్నంలో మాత్రం అసాధారణ ఆటతీరుతో సక్సెస్ సాధించాడు.
ప్రపంచ నంబర్‌వన్, టోక్యో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత, ప్రపంచ చాంపియన్, యూరోపియన్ చాంపియన్ అయిన డెన్మార్క్ స్టార్ విక్టర్ అక్సెల్‌సన్‌ను అతని సొంతగడ్డపైనే ఓడించి ప్రణయ్ తన కెరీర్‌లోనే చిరస్మరణీయ విజయాన్ని అందుకున్నాడు. ఈ మెగా ఈవెంట్‌లో తొలిసారి సెమీఫైనల్ చేరిన ప్రణయ్ కనీసం కాంస్య పతకాన్ని ఖరారు చేసుకున్నాడు.
కోపెన్‌హాగెన్ (డెన్మార్క్): ఈ సీజన్‌లో సూపర్ ఫామ్‌లో ఉన్న భారత స్టార్ షట్లర్ హెచ్‌ఎస్ ప్రణయ్ మరో అద్భుతం చేశాడు. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ పురుషుల సింగిల్స్‌లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లి కనీసం కాంస్య పతకాన్ని ఖరారు చేసుకున్నాడు. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ ప్రణయ్ 13–21, 21–15, 21–16తో టాప్ సీడ్ విక్టర్ అక్సెల్‌సన్ (డెన్మార్క్)ను ఓడించాడు. నేడు జరిగే సెమీఫైనల్లో కున్లావుత్ వితిద్‌సర్న్ (థాయ్‌లాండ్) తో ప్రణయ్ ఆడతాడు.
అక్సెల్‌సన్‌తో 68 నిమిషాలపాటు హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో ప్రణయ్ తొలి గేమ్‌ను చేజార్చుకున్నా నిరాశపడకుండా పట్టుదలతో ఆడి వరుసగా రెండు గేమ్‌లు గెలిచి ముందంజ వేశాడు. సొంతగడ్డపై జరుగుతున్న మెగా ఈవెంట్‌లో ప్రణయ్ ధాటికి అక్సెల్‌సన్‌కు అనూహ్య పరాజయం తప్పలేదు. తొలి గేమ్ కోల్పోయిన ప్రణయ్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్, మరో కోచ్ గురుసాయిదత్ సూచనలతో తన వ్యూహం మార్చుకున్నాడు.
సుదీర్ఘ ర్యాలీలు ఆడుతూ, అడపాదడపా కళ్లు చెదిరే స్మాష్‌లతో ప్రణయ్ ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టి అనవసర తప్పిదాలు చేసేలా చేశాడు. రెండో గేమ్‌లో స్కోరు 13–10 వద్ద ప్రణయ్ వరుసగా నాలుగు పాయింట్లు గెలిచి 17–10తో ఆధిక్యంలోకి వెళ్లాడు. అదే ఊపులో రెండో గేమ్‌ను సొంతం చేసుకొని మ్యాచ్‌లో నిలిచాడు. మూడో గేమ్‌లోనూ ప్రణయ్ దూకుడు కొనసాగిస్తూ అక్సెల్‌సన్‌పై ఒత్తిడి పెంచాడు.
స్కోరు 7–6 వద్ద ప్రణయ్ ఒక్కసారిగా చెలరేగి వరుసగా ఐదు పాయింట్లు నెగ్గి 13–6తో ముందంజ వేశాడు. ఆ తర్వాత అక్సెల్‌సన్ తేరుకునే ప్రయత్నం చేసినా ప్రణయ్ ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా ఆడుతూ విజయం అందుకున్నాడు.
సాత్విక్–చిరాగ్ జోడీ ఓటమి
పురుషుల డబుల్స్ విభాగం నుంచి ప్రపంచ రెండో ర్యాంక్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) నిష్క్రమించింది. క్వార్టర్ ఫైనల్లో సాత్విక్–చిరాగ్ ద్వయం 18–21, 19–21తో ప్రపంచ 11వ ర్యాంక్ జంట కిమ్ అస్‌ట్రుప్–ఆండెర్స్ స్కారప్ రస్‌ముసెన్ (డెన్మార్క్) చేతిలో పోరాడి ఓడిపోయింది. గత ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం నెగ్గి చరిత్ర సృష్టించిన సాత్విక్–చిరాగ్ ద్వయం ఈసారి అలాంటి ఫలితాన్ని పునరావృతం చేయలేకపోయింది.
ఇప్పటిదాకా 14
ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత షట్లర్లు గెలిచిన పతకాల సంఖ్య. మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు (1 స్వర్ణం, 2 రజతాలు, 2 కాంస్యాలు), సైనా నెహ్వాల్ (1 రజతం, 1 కాంస్యం), పురుషుల సింగిల్స్‌లో ప్రకాశ్ పదుకొనే (1 కాంస్యం), సాయిప్రణీత్ (1 కాంస్యం), కిడాంబి శ్రీకాంత్ (1 రజతం), లక్ష్య సేన్ (1 కాంస్యం), గుత్తా జ్వాల–అశి్వని పొన్నప్ప (1 కాంస్యం), సాత్విక్–చిరాగ్ శెట్టి (1 కాంస్యం) ఈ జాబితాలో ఉన్నారు. ప్రణయ్ సెమీస్‌లో ఓడితే కాంస్య పతకం దక్కుతుంది. ఫైనల్ చేరి గెలిస్తే స్వర్ణ పతకం, ఓడితే రజత పతకం లభిస్తుంది. 2011 నుంచి ప్రతి ప్రపంచ చాంపియన్‌షిప్‌లోనూ భారత బ్యాడ్మింటన్ క్రీడాకారులు పతకాలు సాధిస్తుండటం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment