Indian shuttler
-
ప్రణయ్ ప్రతాపం.. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో పతకం ఖరారు
దశాబ్దకాలంగా భారత అగ్రశ్రేణి షట్లర్‌గా కొనసాగుతున్న హెచ్ఎస్ ప్రణయ్ ఎట్టకేలకు విశ్వవేదికపై తన సత్తా చాటుకున్నాడు. అత్యంత ప్రతిభావంతుడైనప్పటికీ నిలకడలేమితో ఇన్నాళ్లూ అందని ద్రాక్షగా ఊరించిన ప్రపంచ చాంపియన్‌షిప్ పతకం తొలిసారి ప్రణయ్ మెడలో పడనుంది. 2021, 2022 ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో క్వార్టర్ ఫైనల్లో వెనుదిరిగి పతకానికి చేరువై దూరమైన ఈ కేరళ స్టార్ మూడో ప్రయత్నంలో మాత్రం అసాధారణ ఆటతీరుతో సక్సెస్ సాధించాడు. ప్రపంచ నంబర్‌వన్, టోక్యో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత, ప్రపంచ చాంపియన్, యూరోపియన్ చాంపియన్ అయిన డెన్మార్క్ స్టార్ విక్టర్ అక్సెల్సన్ను అతని సొంతగడ్డపైనే ఓడించి ప్రణయ్ తన కెరీర్లోనే చిరస్మరణీయ విజయాన్ని అందుకున్నాడు. ఈ మెగా ఈవెంట్లో తొలిసారి సెమీఫైనల్ చేరిన ప్రణయ్ కనీసం కాంస్య పతకాన్ని ఖరారు చేసుకున్నాడు. కోపెన్‌హాగెన్ (డెన్మార్క్): ఈ సీజన్లో సూపర్ ఫామ్‌లో ఉన్న భారత స్టార్ షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్ మరో అద్భుతం చేశాడు. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ పురుషుల సింగిల్స్‌లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లి కనీసం కాంస్య పతకాన్ని ఖరారు చేసుకున్నాడు. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ ప్రణయ్ 13–21, 21–15, 21–16తో టాప్ సీడ్ విక్టర్ అక్సెల్సన్ (డెన్మార్క్)ను ఓడించాడు. నేడు జరిగే సెమీఫైనల్లో కున్లావుత్ వితిద్సర్న్ (థాయ్‌లాండ్) తో ప్రణయ్ ఆడతాడు. అక్సెల్సన్తో 68 నిమిషాలపాటు హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో ప్రణయ్ తొలి గేమ్‌ను చేజార్చుకున్నా నిరాశపడకుండా పట్టుదలతో ఆడి వరుసగా రెండు గేమ్‌లు గెలిచి ముందంజ వేశాడు. సొంతగడ్డపై జరుగుతున్న మెగా ఈవెంట్లో ప్రణయ్ ధాటికి అక్సెల్సన్కు అనూహ్య పరాజయం తప్పలేదు. తొలి గేమ్ కోల్పోయిన ప్రణయ్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్, మరో కోచ్ గురుసాయిదత్ సూచనలతో తన వ్యూహం మార్చుకున్నాడు. సుదీర్ఘ ర్యాలీలు ఆడుతూ, అడపాదడపా కళ్లు చెదిరే స్మాష్‌లతో ప్రణయ్ ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టి అనవసర తప్పిదాలు చేసేలా చేశాడు. రెండో గేమ్‌లో స్కోరు 13–10 వద్ద ప్రణయ్ వరుసగా నాలుగు పాయింట్లు గెలిచి 17–10తో ఆధిక్యంలోకి వెళ్లాడు. అదే ఊపులో రెండో గేమ్‌ను సొంతం చేసుకొని మ్యాచ్‌లో నిలిచాడు. మూడో గేమ్‌లోనూ ప్రణయ్ దూకుడు కొనసాగిస్తూ అక్సెల్సన్పై ఒత్తిడి పెంచాడు. స్కోరు 7–6 వద్ద ప్రణయ్ ఒక్కసారిగా చెలరేగి వరుసగా ఐదు పాయింట్లు నెగ్గి 13–6తో ముందంజ వేశాడు. ఆ తర్వాత అక్సెల్సన్ తేరుకునే ప్రయత్నం చేసినా ప్రణయ్ ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా ఆడుతూ విజయం అందుకున్నాడు. సాత్విక్–చిరాగ్ జోడీ ఓటమి పురుషుల డబుల్స్ విభాగం నుంచి ప్రపంచ రెండో ర్యాంక్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) నిష్క్రమించింది. క్వార్టర్ ఫైనల్లో సాత్విక్–చిరాగ్ ద్వయం 18–21, 19–21తో ప్రపంచ 11వ ర్యాంక్ జంట కిమ్ అస్ట్రుప్–ఆండెర్స్ స్కారప్ రస్ముసెన్ (డెన్మార్క్) చేతిలో పోరాడి ఓడిపోయింది. గత ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం నెగ్గి చరిత్ర సృష్టించిన సాత్విక్–చిరాగ్ ద్వయం ఈసారి అలాంటి ఫలితాన్ని పునరావృతం చేయలేకపోయింది. ఇప్పటిదాకా 14 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత షట్లర్లు గెలిచిన పతకాల సంఖ్య. మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు (1 స్వర్ణం, 2 రజతాలు, 2 కాంస్యాలు), సైనా నెహ్వాల్ (1 రజతం, 1 కాంస్యం), పురుషుల సింగిల్స్‌లో ప్రకాశ్ పదుకొనే (1 కాంస్యం), సాయిప్రణీత్ (1 కాంస్యం), కిడాంబి శ్రీకాంత్ (1 రజతం), లక్ష్య సేన్ (1 కాంస్యం), గుత్తా జ్వాల–అశి్వని పొన్నప్ప (1 కాంస్యం), సాత్విక్–చిరాగ్ శెట్టి (1 కాంస్యం) ఈ జాబితాలో ఉన్నారు. ప్రణయ్ సెమీస్‌లో ఓడితే కాంస్య పతకం దక్కుతుంది. ఫైనల్ చేరి గెలిస్తే స్వర్ణ పతకం, ఓడితే రజత పతకం లభిస్తుంది. 2011 నుంచి ప్రతి ప్రపంచ చాంపియన్‌షిప్‌లోనూ భారత బ్యాడ్మింటన్ క్రీడాకారులు పతకాలు సాధిస్తుండటం విశేషం. -
Japan Open 2023 badminton: పోరాడి ఓడిన లక్ష్యసేన్
టోక్యో: బీడబ్ల్యూఎఫ్ టూర్ సూపర్–750 జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్‌లో భారత షట్లర్ లక్ష్య సేన్ ఆట ముగిసింది. శనివారం జరిగిన సెమీఫైనల్లో లక్ష్య పోరాడి ఓడాడు. ఈ మ్యాచ్‌లో ఇండోనేసియాకు చెందిన ఐదో సీడ్ జొనాథన్ క్రిస్టీ 21–15, 13–21, 21–16 స్కోరుతో సేన్‌ను ఓడించాడు. 68 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన ఈ పోరు తొలి గేమ్‌లో క్రిస్టీ చేసిన పొరపాట్లతో సేన్ 7–4తో ముందంజ వేశాడు. ఆ తర్వాత ఒక్కసారిగా చెలరేగిన క్రిస్టీ 15–12తో ఆధిక్యంలోకి వచ్చేశాడు. రెండో గేమ్‌లో చక్కటి సర్వీస్, ర్యాలీలతో 11–5తో సేన్ ముందంజ వేశాడు. ఆపై పదునైన స్మాష్‌లతో చెలరేగి భారత షట్లర్ రెండో గేమ్‌ను సొంతం చేసుకున్నాడు. చివరి గేమ్‌లో మాత్రం మొదటినుంచి ఆధిక్యం ప్రదర్శించిన క్రిస్టీ చివరి వరకు దానిని నిలబెట్టుకున్నాడు. -
అశ్విని జోడీకి టైటిల్
నాంటెస్ (ఫ్రాన్స్): భారత సీనియర్ షట్లర్ అశ్విని పొన్నప్ప నాంటెస్ అంతర్జాతీయ చాలెంజ్ టోర్నీ మహిళల డబుల్స్‌లో విజేతగా నిలిచింది. అశి్వని–తనీషా క్రాస్టో జంట ఫైనల్లో 21–15, 21–14తో హంగ్ ఎన్ జు–లిన్ యు పే (చైనీస్ తైపీ) జోడీపై అలవోక విజయం సాధించింది. మ్యాచ్ ఆరంభంలో భారత ద్వయం 0–4తో వెనుకబడింది. తర్వాత అశి్వని–తనీషా ద్వయం వరుసగా పాయింట్లు సాధించి 10–10 వద్ద తొలి గేమ్‌ను సమం చేసి ఆ తర్వాత అదే జోరుతో గేమ్‌ను గెలుచుకుంది. అనంతరం రెండో గేమ్‌లో 3–3 వద్ద ఉండగా... భారత జోడీ వరుసగా 7 పాయింట్లు గెలిచి ఆధిపత్యాన్ని కొనసాగించింది. చివరకు 31 నిమిషాల్లో మ్యాచ్‌ను ముగించి టైటిల్‌ను కైవసం చేసుకుంది. అయితే మిక్స్డ్ డబుల్స్‌లో తనీషా–సాయి ప్రతీక్ జంటకు అదృష్టం కలిసిరాలేదు. క్వాలిఫయర్స్‌గా బరిలోకి దిగి ఫైనల్ చేరిన ఈ జంట పరాజయాన్ని ఎదుర్కొంది. ఫైనల్లో తనీషా–సాయిప్రతీక్ జోడీ 21–14, 14–21, 17–21తో మాడ్స్ వెస్టెర్గార్డ్–క్రిస్టిన్ బస్చ్ (డెన్మార్క్) జంట చేతిలో ఓడిపోయింది. -
ప్రియాన్షు సంచలనం.. ప్రపంచ 12వ ర్యాంకర్‌పై విజయం
న్యూఢిల్లీ: ఓర్లియాన్ మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత యువతార ప్రియాన్షు రజావత్ సంచలనం సృష్టించాడు. ఫ్రాన్స్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రియాన్షు ప్రపంచ 12వ ర్యాంకర్, టాప్ సీడ్ కెంటా నిషిమోటో (జపాన్)పై గెలుపొందాడు. గతవారం స్పెయిన్ మాస్టర్స్ టోర్నీలో చాంపియన్‌గా నిలిచిన నిషిమోటోతో జరిగిన మ్యాచ్‌లో ప్రపంచ 58వ ర్యాంకర్ ప్రియాన్షు 21–8, 21–16తో గెలుపొంది క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. థామస్ కప్ టైటిల్ సాధించిన భారత జట్టులో సభ్యుడిగా ఉన్న ప్రియాన్షు ఈ మ్యాచ్ తొలి గేమ్‌లో 10–0తో ఆధిక్యంలోకి వెళ్లడం విశేషం. రెండో గేమ్‌లో ప్రియాన్షుకు పోటీ ఎదురైనా కీలకదశలో పాయింట్లు గెలిచి 42 నిమిషాల్లో విజయాన్ని అందుకున్నాడు. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్లో చి యు జెన్ (చైనీస్ తైపీ)తో ప్రియాన్షు తలపడతాడు. -
గందరగోళంలో క్రీడల భవిష్యత్: కశ్యప్
న్యూఢిల్లీ: కరోనా కారణంగా క్రీడల భవిష్యత్ గందరగోళంగా మారిందని భారత షట్లర్ పారుపల్లి కశ్యప్ అన్నాడు. టీకా అందుబాటులోకి వచ్చే వరకు ఇప్పట్లో ఎలాంటి పెద్ద టోర్నీలు జరిగే ప్రసక్తి లేదని పేర్కొన్నాడు. ‘వ్యాక్సిన్ కనిపెట్టేంత వరకు ప్రపంచంలో ఎలాంటి పెద్ద టోర్నీలు జరిగే అవకాశమే లేదు. ఎందుకంటే కరోనాతో అందరూ భయభ్రాంతులకు లోనవుతున్నారు. ప్రతీది అనుమానంగానే అనిపిస్తోంది. వీటితో పాటు ప్రయాణ ఆంక్షలు, క్వారంటైన్ నిబంధనలు ఆటంకంగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థం కాక అన్ని క్రీడా సమాఖ్యలు తలపట్టుకుంటున్నాయి. కరోనాను ఎలా నివారించాలో స్పష్టంగా తెలిశాకే ఈ అనిశ్చితి దూరమవుతుంది’ అని 2014 కామన్వెల్త్ గేమ్స్ చాంపియన్ కశ్యప్ వ్యాఖ్యానించాడు. -
ఐఓసీ... జోక్ చేస్తున్నారా?
న్యూఢిల్లీ: ఒలింపిక్స్ కోసం ప్రాక్టీస్ కొనసాగించండి అని ఆటగాళ్లను ప్రోత్సహించిన అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) వ్యాఖ్యలపై భారత షట్లర్ పారుపల్లి కశ్యప్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. అకాడమీలు అన్ని మూసేసిన ఈ పరిస్థితుల్లో ఎలా ప్రాక్టీస్ చేయమంటారని ట్విట్టర్ వేదికగా ఐఓసీని ప్రశ్నించాడు. ‘ప్రాకీŠట్స్ కొనసాగించమని ఐఓసీ మమ్మల్ని ప్రోత్సహిస్తోంది. కానీ ఎలా? ఎక్కడ? ఐఓసీ.. మీరు జోక్ చేస్తున్నారా?’ అని 2014 కామన్వెల్త్ గేమ్స్ చాంపియన్ కశ్యప్ పేర్కొన్నాడు. తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం భారత షట్లర్లందరూ ప్రాక్టీస్ చేసే గోపీచంద్ అకాడమీ ఈనెల 31 వరకు మూసేశారని... ఇలాంటి పరిస్థితుల్లో ప్రాక్టీస్ కొనసాగించండి ఐఓసీ అని అనడంలో అర్థం లేదని కశ్యప్ అన్నాడు. ‘ఇంకా చెప్పాలంటే అసలు ఒలింపిక్స్‌కు అర్హత ఎవరు సాధించారనే దానిపై స్పష్టత లేదు. ముందే అర్హత పొందిన క్రీడాకారులు ప్రాక్టీస్ చేసేందుకు అకాడమీలు అందుబాటులో లేవు. అందరి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని విదేశాల నుంచి వచ్చిన ఆటగాళ్లంతా స్వీయ నిర్బంధంలో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రాక్టీస్ చేయండి అనడంలో అర్థం లేదు’ అని కశ్యప్ పేర్కొన్నాడు. -
రన్నరప్ సౌరభ్ వర్మ
లక్నో: ఈ ఏడాది మూడో టైటిల్ సాధించాలని ఆశించిన భారత షట్లర్, జాతీయ చాంపియన్ సౌరభ్ వర్మకు నిరాశ ఎదురైంది. సయ్యద్ మోదీ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–300 టోర్నీలో ఈ మధ్యప్రదేశ్ ప్లేయర్ రన్నరప్‌తో సంతృప్తి చెందాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ 36వ ర్యాంకర్ సౌరభ్ 15–21, 17–21తో ప్రపంచ 22వ ర్యాంకర్ వాంగ్ జు వె (చైనీస్ తైపీ) చేతిలో ఓడిపోయాడు. 48 నిమిషాలపాటు జరిగిన ఈ పోరులో సౌరభ్ రెండు గేముల్లోనూ ప్ర్యత్యర్దికి పోటీనివ్వలేకపోయాడు. విజేత వాంగ్ జు వెకి 11,250 డాలర్లు (రూ. 8 లక్షలు), రన్నరప్ సౌరభ్ వర్మకు 5,700 డాలర్లు (రూ. 4 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. ఈ ఏడాది సౌరభ్ హైదరాబాద్ ఓపెన్, వియత్నాం ఓపెన్ టోరీ్నలలో టైటిల్స్ సాధించాడు. వాంగ్ జు వె నెగ్గడంతో... 2014 తర్వాత సయ్యద్ మోదీ ఓపెన్ పురుషుల సింగిల్స్ విభాగంలో విదేశీ ఆటగాడికి టైటిల్ లభించినట్లయింది. 2014లో జుయ్ సాంగ్ (చైనా) విజేతగా నిలువగా... 2015లో పారుపల్లి కశ్యప్ (భారత్), 2016లో కిడాంబి శ్రీకాంత్ (భారత్), 2017, 2018లలో సమీర్ వర్మ (భారత్) చాంపియన్స్‌గా నిలిచారు. -
సూపర్ సౌరభ్
లక్నో: ఈ ఏడాది మూడో టైటిల్‌ను తన ఖాతాలో జమ చేసుకునేందుకు భారత షట్లర్ సౌరభ్ వర్మ విజయానికి దూరంలో నిలిచాడు. సయ్యద్ మోదీ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–300 టోర్నమెంట్లో జాతీయ చాంపియన్ సౌరభ్ వర్మ టైటిల్ పోరుకు అర్హత సాధించాడు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో ప్రపంచ 36వ ర్యాంకర్ సౌరభ్ వర్మ 21–17, 16–21, 21–18తో ప్రపంచ 44వ ర్యాంకర్ హివో క్వాంగ్ హీ (దక్షిణ కొరియా)పై గెలుపొందాడు. 75 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో నిర్ణాయక మూడో గేమ్‌లో ఒకదశలో 15–18తో వెనుకబడిన సౌరభ్ ఒక్కసారిగా విజృంభించి వరుసగా ఆరు పాయింట్లు సాధించి విజయాన్ని దక్కించుకున్నాడు. నేడు జరిగే ఫైనల్లో ఎనిమిదో సీడ్, ప్రపంచ 22వ ర్యాంకర్ వాంగ్ జు వె (చైనీస్ తైపీ)తో సౌరభ్ ఆడతాడు.మరోవైపు మహిళల సింగిల్స్ విభాగంలో జాతీయ మాజీ చాంపియన్, తెలంగాణ ప్లేయర్ రితూపర్ణ దాస్ ని్రష్కమించింది. సెమీఫైనల్లో రితూపర్ణ దాస్ 22–24, 15–21తో ఫిట్టాయపోర్న్ చైవాన్ (థాయ్‌లాండ్) చేతిలో ఓడిపోయింది. -
వియత్నాం ఓపెన్ విజేత సౌరభ్ వర్మ
హో చి మిన్ సిటీ: అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తున్న భారత షట్లర్ సౌరభ్ వర్మ ఈ ఏడాది తన ఖాతాలో మూడో టైటిల్‌ను జమ చేసుకున్నాడు. వియత్నాం ఓపెన్ వరల్డ్ సూపర్–100 బ్యాడ్మింటన్ టోర్నీలో తొలి రౌండ్ నుంచి సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శిస్తూ ఫైనల్ చేరిన సౌరభ్ వర్మ... తుది పోరులో కీలక దశలో పైచేయి సాధించి టైటిల్‌ను కొల్లగొట్టేశాడు. 72 నిమిషాల మారథాన్ ఫైనల్లో రెండో సీడ్ సౌరభ్ 21–12, 17–21, 21–14తో సున్ ఫె జియాంగ్ (చైనా)పై నెగ్గాడు. మధ్యలో తడబడినా... పూర్తి ఆత్మవిశ్వాసంతో మ్యాచ్‌ను ఆరంభించిన సౌరభ్ వర్మ ప్రత్యర్థి పేలవమైన రిటర్న్ షాట్లను ఆసరాగా చేసుకొని చెలరేగాడు. తొలి గేమ్‌లో మొదటి నాలుగు పాయింట్లు సాధించి 4–0 ఆధిక్యంలోకెళ్లాడు. మళ్లీ అదే దూకుడును కొనసాగించి 11–4తో విరామానికి వెళ్లాడు. అనంతరం మరోసారి వరుసగా నాలుగు పాయింట్లు సాధించి 15–4తో గేమ్ విజయానికి చేరువయ్యాడు. ఈ దశలో కాస్త ప్రతిఘటించిన సున్ కొన్ని పాయింట్లు సాధించినా అంతరం భారీగా ఉండటంతో తొలి గేమ్‌ను 21–12తో సౌరభ్ సొంతం చేసుకున్నాడు. అయితే రెండో గేమ్‌లో పుంజుకున్న సున్ వరుస పాయింట్లు సాధిస్తూ సౌరభ్‌కు అందకుండా వెళ్లాడు. తొలుత 8–0తో అనంతరం 11–5తో ఆధిపత్యం ప్రదర్శించిన సున్ రెండో గేమ్‌ను చేజిక్కించుకోవడంతో మ్యాచ్ నిర్ణాయక మూడో గేమ్‌కు దారితీసింది. మూడో గేమ్‌లో 4–2తో వెనుకబడ్డ సౌరభ్ సుదీర్ఘ ర్యాలీలు, స్మాష్ షాట్లతో చెలరేగి 17–14తో ముందంజ వేశాడు. తర్వాత వరుసగా నాలుగు పాయింట్లు సాధించి గేమ్‌తో పాటు టైటిల్‌ను ఖాయం చేసుకున్నాడు. -
రన్నరప్ జయరామ్
హో చి మిన్ సిటీ (వియత్నాం): సీజన్లో తొలి టైటిల్ సాధించాలని ఆశించిన భారత అగ్రశ్రేణి షట్లర్ అజయ్ జయరామ్‌కు నిరాశ ఎదురైంది. వియత్నాం ఓపెన్ బీడబ్ల్యూఎఫ్ టూర్ సూపర్–100 టోర్నమెంట్లో జయరామ్ రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. ఈ టోర్నీలో నిలకడైన ప్రదర్శనతో ఆకట్టుకున్న అజయ్ ఫైనల్ పోరులో మాత్రం చేతులెత్తేశాడు. ఆదివారం జరిగిన టైటిల్ పోరులో 30 ఏళ్ల భారత ఆటగాడు 14–21, 10–21తో రుస్తవిటో (ఇండోనేసియా) చేతిలో పరాజయం చవిచూశాడు. కేవలం 28 నిమిషాల్లోనే భారత ప్లేయర్ ఆట ముగిసింది. ‘ఫైనల్లో ఏ దశలోనూ నేను నిలకడగా ఆడలేదు. అనవసర తప్పిదాలు చాలా చేశాను. నెట్ వద్ద తడబడ్డాను. సుదీర్ఘ ర్యాలీలకు సరైన ఫినిషింగ్ కూడా ఇవ్వలేదు. గాయం నుంచి కోలుకున్నాక గత రెండు నెలల్లో మంచి ప్రదర్శనే చేశాను. రెండు టోర్నీల్లో రన్నరప్‌గా నిలిచాను’ అని జయరామ్ వ్యాఖ్యానించాడు. -
పోలిష్ ఓపెన్ చాంప్ రితూపర్ణ
బీరన్ (పోలాండ్): పోలీష్ ఓపెన్ ఇంటర్నేషనల్ చాలెంజ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత క్రీడాకారులకు రెండు విభాగాల్లో టైటిల్స్ లభించాయి. మహిళల సింగిల్స్‌లో రితూపర్ణ దాస్ విజేతగా నిలువగా... మహిళల డబుల్స్‌లో సంజన సంతోష్-ఆరతి సారా సునీల్ జంట టైటిల్ దక్కించుకుంది. పురుషుల సింగిల్స్‌లో సౌరభ్ వర్మ రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో రితూపర్ణ దాస్ 11-21, 21-7, 21-17తో భారత్‌కే చెందిన రసిక రాజెను ఓడించింది. డబుల్స్ ఫైనల్లో సంజన-ఆరతి సారా ద్వయం 19-21, 21-19, 21-14తో టాప్ సీడ్ నటాల్యా వొట్సెక్-ఝెలిజవెటా జర్కా (ఉక్రెయిన్) జోడీపై గెలిచింది. పురుషుల సింగిల్స్ ఫైనల్లో సౌరభ్ 27-29, 13-21తో విక్టర్ స్వెండ్సెన్ (డెన్మార్క్) చేతిలో పోరాడి ఓడిపోయాడు. -
క్వార్టర్స్‌లో సాయి ప్రణీత్
కాల్గారి: కెనడా ఓపెన్ గ్రాండ్ ప్రి బ్యాడ్మింటన్ టోర్నీలో భారత షట్లర్ల జోరు కొనసాగుతోంది. సింగిల్స్‌లో ఆరుగురు ఆటగాళ్లు క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకున్నాడు. గురువారం అర్ధరాత్రి జరిగిన పురుషుల ప్రిక్వార్టర్స్‌లో నాలుగోసీడ్ సాయి ప్రణీత్ 21-19, 21-12తో వెంచో షి (కెనడా)పై; టాప్‌సీడ్ అజయ్ జయరామ్ 21-10, 21-12తో డేవిడ్ ఒబెర్నోస్టెరర్ (ఆస్ట్రియా)పై; రెండోసీడ్ హెచ్.ఎస్.ప్రణయ్ 21-18, 18-21, 21-12తో సంకీర్త్ (కెనడా)పై; హర్షిల్ డాని (భారత్) 21-9, 21-18తో ప్రతుల్ జోషి (భారత్)పై గెలవగా, ఆర్‌ఎంవీ గురుసాయిదత్ 12-21, 21-7, 17-21తో రౌల్ మస్త్ (ఈస్టోనియా) చేతిలో ఓడాడు. మహిళల సింగిల్స్‌లో గద్దె రుత్వికా శివాని 24-22, 21-18తో బ్లాడాఫ్ (ఆస్ట్రియా)పై; తన్వీలాడ్ 21-14, 21-15తో మయా చెన్ (అమెరికా)పై నెగ్గారు. పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్స్‌లో మను అత్రి-సుమీత్ రెడ్డి 21-8, 21-10తో తిమోతి చో-జాసన్ షూ (కెనడా)పై; మిక్స్డ్ డబుల్స్‌లో మను అత్రి-అశ్విని 21-14, 21-12తో లాయ్-టోంగ్ (కెనడా)పై గెలిచారు. -
ఇండోనేసియా ఓపెన్ ఫైనల్లో శ్రీకాంత్
మలాంగ్: ఇండోనేసియా ఓపెన్ మాస్టర్స్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నమెంట్లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న భారత నంబర్‌వన్ బ్యాడ్మింటన్ ప్లేయర్ కిడాంబి శ్రీకాంత్ పురుషుల సింగిల్స్ విభాగంలో ఫైనల్లోకి ప్రవేశించాడు. శనివారం జరిగిన సెమీఫైనల్లో ప్రపంచ 39వ ర్యాంకర్, ఇండోనేసియా రైజింగ్ స్టార్ జిన్‌టింగ్ ఆంథోనీపై 21-13, 21-19 తేడాతో శ్రీకాంత్ విజయం సాధించాడు. తాను ఆడిన గత ఆరు టోర్నమెంట్లలో ఐదింట్లో తొలి రౌండ్లోనో ఇంటి దారి పట్టిన శ్రీకాంత్.. ఈ మ్యాచ్‌లో స్థానిక ఆటగాడిని కేవలం 37 నిమిషాల్లోనే వరుస సెట్లలో మట్టికరిపించాడు. తొలి సెట్ ను సులువుగా కైవసం చేసుకున్న శ్రీకాంత్‌కు రెండో సెట్లో ప్రత్యర్థి జిన్‌టింగ్ నుంచి గట్టి ప్రతిఘటన ఎదురైంది. అయితే, మ్యాచ్ పాయింట్ గెలుచుకుని సెట్‌తో పాటు మ్యాచ్‌ను గెలుచుకున్నాడు. టామీ సుగియార్టో, విస్ణు యులి ప్రసెట్టో మధ్య జరిగే మరో సెమీస్ మ్యాచ్ విన్నర్‌తో ఫైనల్లో భారత టాప్ షట్లర్ శ్రీకాంత్ తలపడనున్నాడు. టైటిల్ పోరులోనూ స్థానిక ఆటగాడే శ్రీకాంత్‌కు ప్రత్యర్థిగా బరిలో ఎదురుకానున్నాడు. మొత్తానికి ఈ ఏడాది శ్రీకాంత్‌కు ఇది నాల్గో గ్రాండ్ టోర్నమెంట్ ఫైనల్. ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్, స్విస్ ఓపెన్ గ్రాండ్ ప్రి గోల్డ్ టైటిల్స్ సొంతం చేసుకోగా.. ఇండియా గ్రాండ్ ప్రి టోర్నమెంటులో ఫైనల్లో ఓటమి చవిచూసిన విషయం అందరికీ విదితమే. -
ప్రపంచ బ్యాడ్మింటన్‌లో సిరిల్ వర్మకు రజతం
-
డచ్ ఓపెన్‌లో అజయ్ జయరామ్ సంచలనం
డచ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత షట్లర్ అజయ్ జయరామ్ సంచలనం సృష్టించాడు. మూడో సీడ్‌గా బరిలోకి జయరామ్ ఫైనల్లో ఈస్టోనియా ఆటగాడు రౌల్ మస్ట్ను ఓడించాడు. 21-12, 21-18 వరుస సెట్లలో 12 సీడ్ ఆటగాడిని ఓడించి.. డచ్ ఓపెన్ టోర్నీని సొంతం చేసుకున్నాడు. -
పివి సింధు సంచలనం
తొలిసారి ప్రపంచ సీనియర్ చాంపియన్‌షిప్‌లో ఆడుతున్న తెలుగు అమ్మాయి, ప్రపంచ 12వ ర్యాంకర్ పి.వి.సింధు సంచలనం నమోదు చేసింది. తన కంటే మెరుగైన ర్యాంకులో ఉన్న చైనా క్రీడాకారిణిని ఓడించి కార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో రెండో సీడ్ యిహాన్ వాంగ్‌ను 21-18, 23-21తో సింధు ఓడించింది. 55 నిమిషాల్లోనే ప్రత్యర్థిని మట్టి కరిపించింది. కవోరి ఇమబెపు (జపాన్)తో బుధవారం జరిగిన రెండో రౌండ్లో సింధు 21-19, 19-21, 21-17తో విజయం సాధించింది. 71 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సింధుకు గట్టిపోటీనే లభించింది. నిర్ణాయక మూడో గేమ్‌లో సింధు ఒక దశలో 10-13తో వెనుకబడింది. ఈ దశలో ఒత్తిడికి లోనుకాకుండా సంయమనంతో ఆడిన సింధు వరుసగా నాలుగు పాయింట్లు నెగ్గి 14-13తో ఆధిక్యంలోకి వచ్చింది. అనంతరం ఆ ఆధిక్యాన్ని కాపాడుకుంటూ విజయాన్ని ఖాయం చేసుకుంది.