
పివి సింధు సంచలనం
తొలిసారి ప్రపంచ సీనియర్ చాంపియన్‌షిప్‌లో ఆడుతున్న తెలుగు అమ్మాయి, ప్రపంచ 12వ ర్యాంకర్ పి.వి.సింధు సంచలనం నమోదు చేసింది. తన కంటే మెరుగైన ర్యాంకులో ఉన్న చైనా క్రీడాకారిణిని ఓడించి కార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో రెండో సీడ్ యిహాన్ వాంగ్‌ను 21-18, 23-21తో సింధు ఓడించింది. 55 నిమిషాల్లోనే ప్రత్యర్థిని మట్టి కరిపించింది.
కవోరి ఇమబెపు (జపాన్)తో బుధవారం జరిగిన రెండో రౌండ్‌లో సింధు 21-19, 19-21, 21-17తో విజయం సాధించింది. 71 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సింధుకు గట్టిపోటీనే లభించింది. నిర్ణాయక మూడో గేమ్‌లో సింధు ఒక దశలో 10-13తో వెనుకబడింది. ఈ దశలో ఒత్తిడికి లోనుకాకుండా సంయమనంతో ఆడిన సింధు వరుసగా నాలుగు పాయింట్లు నెగ్గి 14-13తో ఆధిక్యంలోకి వచ్చింది. అనంతరం ఆ ఆధిక్యాన్ని కాపాడుకుంటూ విజయాన్ని ఖాయం చేసుకుంది.