గెలుపు, ఓటములకు అతీతంగా కొన్ని విషయాలు ఆసక్తికరంగా ఉంటాయి. ఆట అంటే ‘గెలుపు’ లేదా ‘ఓటమి’ మాత్రమే కాదు. గెలుపుకు ముందు, గెలిచిన తరువాత, ఓటమికి ముందు ఓటమికి తరువాత విషయాలు కూడా పసందుగా ఉంటాయి. ‘షూటర్ మను బాకర్ పారిస్ ఒలింపిక్స్‌లో భోజనం చేయలేదు’ అనే విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అరె మనకు పతకాలు తెచ్చిన అమ్మాయి భోజనం చేయలేదా? ఎందుకు చేయలేదు?
పారిస్ ఒలింపిక్స్‌లో వ్యక్తిగత విభాగంలో కాంస్యం, మిక్స్‌డ్ టీమ్ విభాగంలో మరో కాంస్యాన్ని గెలుచుకొని రికార్డ్ సృష్టించింది షూటర్ మను బాకర్. ‘ఇది మను ఒలింపిక్స్’ అంటూ క్రీడాభిమానుల ప్రశంసలు అందుకుంది. 25 మీటర్‌ల విభాగంలో మూడో పతకం కొద్దిలో చేజారింది.
హిస్టారిక్ మెడల్ హాట్రిక్ మిస్ అయిన తరువాత ఆమె ఏం ఆలోచించిందనే విషయానికి వస్తే... మొదటిది... నాలుగు సంవత్సరాల తరువాత లాస్ ఏంజెల్స్‌లో జరగనున్న ఒలింపిక్స్ గురించి. రెండోది... భోజనం గురించి. మొదటి విషయం సరే, రెండో విషయమే అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.
ఆడి ఆడి అలిసిపోయిన మను బాకర్‌ను విశ్రాంతి గురించి అడిగినప్పుడు... ‘నేను చేసే మొదటి పని ఇంటి భోజనం చేయడం. ఇన్ని రోజులు నేను భోజనం చేయలేదు. విలేజ్‌లో బ్రేక్ ఫాస్ట్ చేసి, షూటింగ్ రేంజ్‌కు వచ్చేదాన్ని. అక్కడ స్నాక్స్ తినేదాన్ని. విలేజ్‌లో మధ్నాహ్న భోజనం ఉంటుంది. ప్రాక్టీస్ తర్వాత 3 లేదా 5 గంటల మధ్య మాత్రమే తిరిగి భోజనశాలకు రావడానికి వీలయ్యేది. ఆ సమయానికి మధ్యాహ్న భోజనం అయిపోయేది. దాంతో సాయంత్రం ఏదో తినేదాన్ని’ అని ఒక ఇంటర్వ్యూలో చెప్పింది మను బాకర్.
మను మధ్యాహ్న భోజనానికి దూరమైన విషయం ఆమె తల్లి సుమేధకు కూడా తెలిసి పోయింది.
కుమార్తె విజయం కోసం రోజూప్రార్థనలు చేసిన ఆమె ఇలా అన్నది...‘మను ఇంటికి తిరిగి రాగానే వేడి వేడి ఆలూ పరోట తినిపిస్తాను. మనుకు ఆలూ పరోట అంటే ఎంతో ఇష్టం’ ‘కుమార్తె గెలుపు వార్త మాత్రమే వినాలి... తన ఓటమిని చూడలేను’ అనుకుందో ఏమో మను బాకర్ లైవ్ మ్యాచ్‌లు చూడడానికి ఇష్టపడేది కాదు సుమేధ.‘మా అమ్మ నన్ను ఛాంపియన్ చేయడం కోసం ఎంతో కష్టపడింది. అమ్మా... నువ్వు ఎప్పుడు ఆయురారోగ్యాలతో ఉండాలి’ అంటున్న మను బాకర్ అమ్మ చేతి వంట కోసం ఎదురు చూస్తోంది.
‘ఏదైనా సరే, మా ఇంట్లో అమ్మ చేతివంట తినడం అంటే ఎంతో ఇష్టం. ఐ రియల్లీ లవ్ ఆలూ పరోటా. ఆలూ పరోటా తినక నాలుగు నెలలు అవుతోంది’ అంటుంది మను బాకర్ మనకు విజయాలు మాత్రమే కనిపిస్తాయి. ఆ విజయాల వెనుక ఎన్ని సర్దుబాట్లు ఉంటాయో చెప్పడానికి మను బాకర్ ఒక ఉదాహరణ.ఒకటి రెండు రోజులంటే ఫరవాలేదుగానీ ఎన్నో రోజులు మధ్నాహ్న భోజనం లేకుండా గడిపింది మను. ఆ సమయంలో ఆమెకు కోపం రాలేదు. ఎందుకంటే మను బాకర్ ‘గెలుపు’ ఆకలితో ఉంది. రెండు పతకాలతో ఆ ఆకలి తీరింది.
డైట్ రొటీన్
భోజనానికి సంబంధించి వ్యక్తిగత ఇష్టాయిష్టాలు వేరు. క్రీడాకారిణిగా వేరు. శాకాహారి అయిన మను బాకర్ ‘డైట్ రోటిన్’ విషయానికి వస్తే... హెల్తీ ఫ్యాట్స్. లో–జీఐ కార్బోహైడ్రేడ్స్‌తో కూడిన సింపుల్ డైట్‌కుప్రాధాన్యత ఇస్తుంది. అలసట, గాయాలకు దూరంగా ఉండడానికి డైట్‌లో హైడ్రేషన్‌కు అధికప్రాధాన్యత ఇస్తుంది. మను డైట్‌లో రకరకాల పండ్లు, విటమిన్ సి అధికంగా ఉండే కూరగాయలు ఉంటాయి. హై–ఎనర్జీ, షుగర్ ఫుడ్స్‌కు దూరంగా ఉంటుంది.
ఆహారానికి ఎంతప్రాధాన్యత ఇస్తుందో కంటినిండా నిద్రకు అంతేప్రాధాన్యత ఇస్తుంది. యోగా, జిమ్ తరువాత ప్రతిరోజూ ఏడు నుంచి ఎనిమిది గంటలు షూటింగ్ ప్రాక్టీస్ చేస్తుంది. మానసిక ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని పెయింటింగ్స్ వేస్తుంటుంది. మైండ్ ఫోకస్డ్‌గా ఉండడానికి క్రియేటివ్ వర్క్ ఉపయోగపడుతుందని చెబుతుంది మను బాకర్.
Comments
Please login to add a commentAdd a comment