న్యూఢిల్లీ: పారిస్ పారాలింపిక్స్‌లో పతకాలు సాధించిన ఐదుగురు పారా షట్లర్లకు భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) రూ. 50 లక్షల నజరానా ప్రకటించింది. ఇటీవల జరిగిన దివ్యాంగుల విశ్వ క్రీడల్లో భారత షట్లర్లు ఐదు పతకాలు (ఒక స్వర్ణం, రెండు రజతాలు, రెండు కాంస్యాలు) సాధించారు. పురుషుల సింగిల్స్ ఎస్‌ఎల్3 విభాగంలో స్వర్ణం గెలిచిన నితీశ్ కుమార్‌కు రూ. 15 లక్షలు, రజత పతకాలు గెలిచిన సుహాస్ యతిరాజ్ (పురుషుల సింగిల్స్ ఎస్‌ఎల్4), తులసిమతి మురుగేశన్ (మహిళల సింగిల్స్ ఎస్‌యూ5)లకు రూ. 10 లక్షల చొప్పున నగదు బహుమతి ప్రకటించింది.
మహిళల సింగిల్స్ ఎస్‌యూ5లో కాంస్యం నెగ్గిన మనీషా రామదాస్, ఎస్‌యూ5లో కాంస్యం సాధించిన నిత్యశ్రీకి రూ. 7.5 లక్షల చొప్పున నజరానా ప్రకటించింది. ‘అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా రాణిస్తున్న భారత పారా షట్లర్లకు నగదు బహుమతి అందించాలని నిర్ణయించాం. పారాలింపిక్స్‌లో సాధించిన పతకాలకు ఇది గుర్తింపు లాంటిది. మరిన్ని పతకాలు సాధించేందుకు పారా షట్లర్లకు అన్ని విధాలుగా అండగా నిలుస్తాం’ అని బ్యాడ్మింటన్ సంఘం కార్యదర్శి సంజయ్ మిశ్రా పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment