అలాంటి వాళ్లే ఇప్పుడు మిఠాయిలు తినిపిస్తున్నారు: శీతల్‌ దేవి | Paris Paralympics 2024 Bronze Medalist Para Archer Sheetal Devi Inspiring Words | Sakshi
Sakshi News home page

అలాంటి వాళ్లే ఇప్పుడు మిఠాయిలు తినిపిస్తున్నారు: శీతల్‌ దేవి

Published Wed, Sep 11 2024 3:52 PM | Last Updated on Wed, Sep 11 2024 5:54 PM

Paris Paralympics 2024 Bronze Medalist Para Archer Sheetal Devi Inspiring Words

చిన్న చిన్న సమస్యలకే భయపడి జీవితాన్ని ముగించే యువత ఉన్న నేటి రోజుల్లో.. తనకు రెండు చేతులు లేకపోయినా కోట్లాది మందికి ఆదర్శంగా నిలుస్తోంది శీతల్‌ దేవి. పదిహేడేళ్ల వయసులోనే పారాలింపిక్స్‌ పతకం గెలిచి సత్తా చాటింది. తనను కన్న తల్లిదండ్రులతో పాటు దేశం మొత్తం గర్వపడేలా పారా విశ్వక్రీడ వేదికపై కాంస్యంతో మెరిసింది. అయితే, తన ప్రయాణమేమీ సజావుగా సాగలేదని.. పారా ఆర్చర్‌గా ఎదిగే క్రమంలో ఎన్నో అడ్డంకులు ఎదుర్కొన్నాని చెబుతోంది శీతల్‌.

విల్లు ఎక్కువపెట్టిన ప్రతిసారి
‘‘మొదట్లో నాకు క్రీడల గురించి అసలేమీ తెలియదు. అయితే, మా గ్రామంలో చాలా మంది కర్రలతో విల్లులు తయారు చేస్తారు.వాటితో ఆడుకోవడం అంటే నాకెంతో ఇష్టం. అలా విలువిద్యపై దృష్టి సారించాను.

అయితే, విల్లు ఎక్కువపెట్టిన ప్రతిసారి నా మనసులో ఒకే ఆలోచన ఉండేది. నేను నా దేశ జెండాను క్రీడా వేదికపై రెపరెపలాడిస్తే ఎంతో బాగుంటుంది కదా అనిపించేది. ఆ కలను సాకారం చేసుకునేందుకు కృషి చేశాను.

నా కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి
త్రివర్ణ పతాకం రెపరెపలాడినప్పుడల్లా నా కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి. అసలు నేను ఏదైనా సాధించగలనని ఎవరూ నమ్మలేదు. నాపై ఎవరికీ విశ్వాసం లేదు. అయితే, అప్పుడు ఎవరైతే నన్ను తక్కువగా చూశారో.. ఇప్పుడు వాళ్లే స్వయంగా నా తల్లిదండ్రులకు మిఠాయిలు తినిపిస్తున్నారు’’ అని శీతల్‌ దేవి గర్వంగా చెప్పింది. 

సలాం శీతల్‌
అనుకున్న లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో ఎన్ని అవాంతరాలు ఎదురైనా ధైర్యంగా ముందడుగు వేస్తే గెలుపు జెండా ఎగర వేయవచ్చునని తన సంకల్ప బలాన్ని ఉదాహరించింది. ఈ మేరకు శీతల్‌ దేవి మాట్లాడిన వీడియో సోషల్‌ మీడియా దృష్టిని ఆకర్షిస్తోంది. సలాం శీతల్‌ అంటూ ఆమెకు హ్యాట్సాఫ్‌ చెబుతున్నారు నెటిజన్లు.

శీతల్‌ దేవి.. తనే ఒక అద్భుతం
కశ్మీర్‌లోని కిష్టవర్‌ జిల్లా లియోధర్‌ గ్రామం శీతల్‌ స్వస్థలం. ఆమె తండ్రి మాన్‌ సింగ్‌. తల్లి శక్తిదేవి. వీరిది దిగువ మధ్యతరగతి కుటుంబం. మాన్‌ సింగ్‌ రైతు కాగా.. కుటుంబ పోషణలో భర్తకు సాయంగా ఉండేందుకు శక్తి దేవి గొర్రెలు సాకుతోంది. ఈ జంటకు ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి సంతానం. వీరిలో శీతల్‌ అందరికంటే పెద్దది. 

అయితే, ఫొకోలిమా అనే డిజార్డర్‌ కారణంగా పుట్టుకతోనే ఆమెకు చేతులు ఏర్పడలేదు. అయినప్పటికీ శీతల్‌ తల్లిదండ్రులు కుంగిపోలేదు. మిగతా ఇద్దరు పిల్లల మాదిరే ఆమెనూ పెంచారు. ఆత్మవిశ్వాసం ఇనుమడించేలా ధైర్యం నూరిపోశారు. అమ్మానాన్నల ప్రోత్సాహంతో చేతులతో చేయాల్సిన పనులు కాళ్లతోనే చేయడం అలవాటు చేసుకుంది శీతల్‌. 

భారత ఆర్మీ కోచ్‌ల శిక్షణలో
ఈ క్రమంలో ఆమెలోని ప్రతిభను గుర్తించిన బీయింగ్‌ యు సంస్థ తనకు విలువిద్యలో శిక్షణ ఇప్పించింది. ఈ క్రమంలో రెండు చేతులు లేకుండానే విల్లు ఎక్కుపెట్టిన తొలి పారా ఆర్చర్‌గా శీతల్‌ ఎదిగింది. భారత ఆర్మీకి చెందిన కోచ్‌లు అభిలాష చౌదరి, కుల్దీప్‌ వధ్వాన్‌ శిక్షణలో రాటుదేలింది.

పసిడి వెలుగులు
వారి ఆధ్వర్యంలో ట్రెయినింగ్‌ మొదలుపెట్టిన కేవలం 11 నెలల వ్యవధిలోనే 2023 ఆసియా పారా గేమ్స్‌లో పాల్గొన్న శీతల్‌ స్వర్ణం గెలిచి ఔరా అనిపించింది. వ్యక్తిగత కాంపౌండ్‌, మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్లలో పసిడి పతకాలు గెలిచింది. అదే విధంగా మహిళల డబుల్స్‌ విభాగంలో సిల్వర్‌ మెడల్‌తో మెరిసింది. 

అరుదైన ఘనత
ఈ క్రమంలో పారా ఆర్చర్‌ కాంపౌండ్‌ ర్యాంకింగ్స్‌లో నంబర్‌ వన్‌గా ఎదిగిన శీతల్‌.. ఖేలో ఇండియా పారా గేమ్స్‌ 2023లోనూ స్వర్ణ పతకం గెలిచింది. ఈ ‍క్రమంలో అర్జున అవార్డు అందుకున్న శీతల్‌ దేవి.. ప్యారిస్‌ పారాలింపిక్స్‌-2024లో రాకేశ్‌ కుమార్‌తో కలిసి మిక్స్‌డ్‌ కాంపౌండ్‌ ఓపెన్‌ ఆర్చరీ విభాగంలో కాంస్యం కైవసం చేసుకుంది. 17 ఏళ్లకే ఘనత సాధించి.. అత్యంత పిన్న వయసులో పారాలింపిక్‌ మెడల్‌ గెలిచిన భారత తొలి పారా ప్లేయర్‌గా నిలిచింది.

చదవండి: పీటీ ఉషపై వినేశ్‌ ఫొగట్‌ సంచలన ఆరోపణలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement