స్టీవెన్ స్మిత్
సిడ్నీ: ఇంగ్లండ్‌తో శుక్రవారం ప్రారంభమైన యాషెస్ ఐదో టెస్టులో ఆస్ట్రేలియా తడబడినా పుంజుకుంది. ఇంగ్లిష్ బౌలర్ బెన్ స్టోక్స్ (6/99) బౌలింగ్‌లో చెలరేగినా.... స్టీవెన్ స్మిత్ (154 బంతుల్లో 115; 17 ఫోర్లు, 1 సిక్సర్), బ్రాడ్ హాడిన్ (90 బంతుల్లో 75; 13 ఫోర్లు) నిలకడగా ఆడి ఆసీస్‌ను ఆదుకున్నారు. దీంతో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 76 ఓవర్లలో 326 పరుగులకు ఆలౌటైంది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ ఆట ముగిసే సమయానికి 6 ఓవర్లలో వికెట్ నష్టానికి 8 పరుగులు చేసింది. కుక్ (7 బ్యాటింగ్), అండర్సన్ (1 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. కార్‌బెరీ (0) విఫలమయ్యాడు.
ఒక్క వికెట్ జాన్సన్‌కు దక్కింది. కుక్‌సేన ఇంకా 318 పరుగులు వెనుకబడి ఉంది. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో... కుక్ తొలిసారి టాస్ (ఈ సిరీస్‌లో) గెలిచి కంగారులకు బ్యాటింగ్ అప్పగించాడు. వాట్సన్ (43) ఫర్వాలేదనిపించినా... రోజర్స్ (11), వార్నర్ (16), క్లార్క్ (10), బెయిలీ (1) పూర్తిగా నిరాశపర్చారు. దీంతో ఆసీస్ 97 పరుగులకు 5 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో స్మిత్, హాడిన్‌లు నిలకడగా ఆడుతూ ఇన్నింగ్స్‌ను నిర్మించారు.
వీరిద్దరు ఆరో వికెట్‌కు 128 పరుగులు జోడించారు. ఈ క్రమంలో స్మిత్ కెరీర్‌లో మూడో సెంచరీ సాధించాడు. తొలి టెస్టు ఆడుతున్న లెగ్ స్పిన్నర్ స్కాట్ బోర్త్‌విక్ బౌలింగ్‌లో ఓ భారీ సిక్సర్, ఫోర్‌తో శతకాన్ని పూర్తి చేశాడు. హాడిన్ అవుటైన తర్వాత హారిస్ (22) కాసేపు పోరాడాడు. మిగతా బ్యాట్స్‌మెన్ నుంచి పెద్దగా సహకారం లేకపోవడంతో ఆసీస్ ఓ మోస్తరు స్కోరుకు పరిమితమైంది. బ్రాడ్ 2, అండర్సన్, బోర్త్‌విక్ చెరో వికెట్ తీశారు.
యాషెస్ సిరీస్‌లో ఐదు టెస్టుల్లోనూ తొలి
ఇన్నింగ్స్‌లో కనీసం అర్ధసెంచరీ చేసిన మూడో
క్రికెటర్‌గా హాడిన్ రికార్డులకెక్కాడు.