న్యూఢిల్లీ: ఎంఎస్ ధోని.. భారత క్రికెట్‌లో ఒక సక్సెస్‌ఫుల్ కెప్టెన్. టీమిండియాను మరో స్థాయికి తీసుకెళ్లిన సారథి. అయితే భారత జట్టులో చోటు నిలబెట్టుకోవడం దగ్గర్నుంచీ, కెప్టెన్‌గా ఎదిగే వరకూ ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు. ధోని అరంగేట్రం చేసిన కొత్తలో అతని స్థానంపై భరోసా లేని సందర్భాలు ఎన్నో. తన కెరీర్ ఆరంభంలో అటు బ్యాట్స్‌మన్‌గా, ఇటు కీపర్‌గాను ధోనిలో విఫలం కావడమే అందుకు కారణం. ఈ క్రమంలోనే టీమిండియా మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా ఆగ్రహాన్ని కూడా ధోని చూశాడు. ఇదే విషయాన్ని నెహ్రా తాజాగా స్పష్టం చేశాడు. 2005లో పాకిస్తాన్‌తో జరిగిన ఒక వన్డేలో ధోనిని తాను తిట్టిన విషయాన్ని నెహ్రా మళ్లీ గుర్తు చేసుకున్నాడు. ఆనాటి మ్యాచ్‌లో తన బౌలింగ్‌లో క్యాచ్‌ను ధోని వదిలేయడంతో నెహ్రా కోపం కట్టలు తెంచుకుంది.
అంతే, ధోనిపై తిట్ల దండకం అందుకున్నాడు నెహ్రా. ఇది ఆరోజు చేసిన పెద్ద తప్పని నెహ్రా పేర్కొన్నాడు.‘ ఆరోజు జరిగిన మ్యాచ్ నాకు బాగా గుర్తు. అది పాకిస్తాన్‌తో వన్డే సిరీస్‌లో నాల్గో వన్డే . ఆ మ్యాచ్‌లో నేను ధోనిని బాగా తిట్టా. నా బౌలింగ్‌లో ఆఫ్రిది స్ట్రైకింగ్‌లో ఉండగా ఇచ్చిన క్యాచ్‌ను ధోని వదిలేశాడు. దాంతో నాకు కోపం వచ్చేసింది.. ఆపుకోలేక తిట్టేశాను. అలా తిట్టడానికి కారణం ఉంది. అంతకుముందు బంతిని ఆఫ్రిది సిక్స్‌గా కొట్టాడు. ఆ వెంటనే ఇచ్చిన క్యాచ్‌ను ధోని పట్టుకోవడంలో విఫలమయ్యాడు. అది క్లిష్లమైన క్యాచ్.అటు స్లిప్‌కు ఇటు కీపర్‌కు మధ్యలో నుంచి వెళ్లిపోయింది. కాకపోతే నేను ధోనిపై అసహనం వ్యక్తం చేసిన ఘటన విశాఖలో రెండో వన్డేలో అని చాలామంది అభిమానులు అనుకుంటారు.. కానీ అది అహ్మద్‌బాద్‌లో నాల్గో వన్డేలో జరిగింది. నాల్గో వన్డేలో ధోనితో అలా ప్రవర్తించిన తీరుపై నేను చాలా బాధపడ్డా. ఏదో ఆవేశంలో నోటికి పనిచెప్పా. అలా చేయడం నిజంగా తప్పే. అది నేను గర్వించదగిన విషయం ఎంత మాత్రం కాదు. ఇక విశాఖలో జరిగిన రెండో వన్డేలో ధోని తొలి సెంచరీ చేశాడు. ఆ సెంచరీ నాకు ఇప్పటికీ గుర్తే’ అని టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్యూలో నెహ్రా తెలిపాడు.
2005, ఏప్రిల్5 వ తేదీన అంటే 15 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు ధోని తన తొలి అంతర్జాతీయ సెంచరీ సాధించాడు. ఆ మ్యాచ్‌లో ధోని 123 బంతుల్లో 15 ఫోర్లు, 4 సిక్స్‌లతో 148 పరుగులు చేశాడు. ఫలితంగా భారత్ 356 పరుగుల భారీ స్కోరును పాక్ ముందుంచింది. ఆ తర్వాత పాకిస్తాన్ 298 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది.
Comments
Please login to add a commentAdd a comment