కోల్‌కతా: యో-యో టెస్ట్ నెగ్గడం పేస్ బౌలర్‌గా తనకు సులువైనదని, కానీ యువరాజ్ వంటి క్రికెటర్లకు ఇబ్బందిగా మారిందని టీమిండియా మాజీ బౌలర్ అశీష్ నెహ్రా అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పి కామెంటేటర్‌గా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఈ మాజీ బౌలర్ ఆటగాళ్ల ఫిట్‌నెస్‌ను పరీక్షించే యోయో టెస్ట్‌పై ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.
భారత్-శ్రీలంక మధ్య జరుగుతున్న తొలి టెస్ట్‌కు కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న నెహ్రాకు మరో వ్యాఖ్యాత వీరేంద్ర సెహ్వాగ్ మధ్య యోయో టెస్ట్‌పై ఆసక్తికర సంభాషణ నడిచింది. తొలుత సెహ్వాగ్ అసలు తీవ్ర చర్చనీయాంశమైన యో-యో టెస్ట్ అంటే ఏమిటని నెహ్రాను ప్రశ్నించాడు. దీనికి నెహ్రా ‘యో-యో టెస్ట్ 2001-02 మధ్యలో నిర్వహించిన బ్లిప్ టెస్ట్ వంటిదే. ఈ పరీక్షల్లో ఆటగాళ్లు ఒక స్థానం నుంచి ప్రారంభమై మళ్లే అదే స్థానానికి చేరాలి. ఇలా మెత్తం 20 మీటర్ల పరిధి పరుగును నిర్ణిత సమయంలో పూర్తి చేయాలి. టీమిండియా ఈ టెస్టుకు అర్హత మార్క్‌గా 16.1 మీటర్లు పెట్టింది. త్వరలో 16.5 మీటర్లు చేసే యోచనలో బీసీసీఐ ఉంది. ఇక అత్యధికంగా న్యూజిలాండ్ 18.5 మీటర్ల మార్క్‌ను పరీక్షిస్తోంది. వేగంగా పరుగెత్తితేనే ఈ పరీక్షను నెగ్గుతాం. అని నెహ్రా పేర్కొన్నాడు.
ఇక 38 ఏళ్ల వయసులో ఈ టెస్టు నెగ్గడంపై నెహ్రా స్పందిస్తూ.. పేస్ బౌలర్‌గా ఇది నాకు చాల సులభం. కానీ యువరాజ్ వంటి కొంత మంది క్రికెటర్లకు ఈ పరీక్ష నెగ్గడం చాలా కష్టంగా ఉంది. ఇక భారత ఆటగాళ్ల యో-యో స్కోర్లపై మాట్లాడుతూ.. అందరూ 16.1 అర్హత మార్క్‌ను దాటాల్సిందే. ఈ ఏడాది జనవరిలో ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్ సందర్భంగా నిర్వహించిన యో-యో టెస్ట్‌లో హార్దిక్ పాండ్యా స్కోరు 19, మనీష్ పాండే 19, తనది 18.5 స్కోర్ అని నెహ్రా తెలిపాడు. ఇక కెప్టెన్ కోహ్లి స్కోర్ గురించి సెహ్వాగ్ ప్రస్తావించగా అది తెలియదు. కోహ్లి స్కోరు చూడలేదని నెహ్రా పేర్కొన్నాడు. ఇక యువీ యో-యో టెస్ట్ నెగ్గితే టీమిండియా జట్టులో చోటు దక్కడం సులువని ఈ ఇద్దరు మాజీ క్రికెటర్లు అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment