
కోల్‌కతా: ప్రాక్టీస్ మ్యాచ్‌లో బెంగాల్ పేసర్ అశోక్ దిండా తీవ్రంగా గాయపడ్డాడు. ఈడెన్ గార్డెన్ వేదికగా బెంగాల్ జట్టు ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో బ్యాట్స్‌మన్ కొట్టిన బంతి నేరుగా వచ్చి బౌలింగ్ చేస్తున్న దిండా తలకు బలంగా తగలడంతో అక్కడిక్కడే కుప్పకూలిపోయాడు. దిండాకు ప్రాథమిక చికిత్స చేసిన తర్వాత అతన్ని ఆస్పత్రికి తరలించారు.
వీవీఎస్ లక్ష్మణ్ పర్యవేక్షణలో బెంగాల్ జట్టు ఈడెన్ గార్డెన్‌లో ప్రాక్టీస్ చేస్తోంది. ఈ క్రమంలోనే దిండా వేసిన ఒక ఓవర్‌లో బెంగాల్ ఆటగాడు బిరిందర్ వివేక్ సింగ్ స్ట్రయిట్ డ్రైవ్ కొట్టాడు. ఆ బంతిని తప్పించుకునే ప్రయత్నంలో దిండా తలకు బలంగా తగిలింది. దాంతో దిండా తల పట్టుకుని మైదానంలోనే కూలిపోయాడు. అతనికి అక్కడే చికిత్స చేసిన అనంతరం ఆస్పత్రికి తరలించారు. సీటీ స్కాన్ చేసిన తర్వాత అతనికి ఎటువంటి ప్రమాదం లేదని తేలడంతో బెంగాల్ క్రికెట్ అసోసియేషన్(క్యాబ్) ఊపిరిపీల్చుకుంది. అతనికి రెండు రోజుల పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు స్పష్టం చేశారు.