అశ్విన్ ఖాతాలో మరో ఘనత
ఆంటిగ్వా:ఇప్పటికే ఎన్నో రికార్డుల్ని సొంతం చేసుకున్న భారత క్రికెట్ ప్రధాన స్పిన్నర్ రవి చంద్రన్ అశ్విన్ మరో అరుదైన ఘనతను సాధించాడు. వన్డేల్లో వేగవంతంగా 150 వికెట్లు సాధించిన రెండో భారత స్పిన్నర్గా అశ్విన్ గుర్తింపు సాధించాడు. అంతకుముందు భారత్ తరపున ఈ ఫీట్ ను వేగవంతంగా సాధించిన స్పిన్నర్ అనిల్ కుంబ్లే. ఈ ఫీట్ ను సాధించడానికి అశ్విన్ కు 111వన్డేలు అవసరం కాగా, కుంబ్లేకు 106 మ్యాచ్ లు అవసరమయ్యాయి.
వెస్టిండీస్ తో ఐదు వన్డేల సిరీస్లో భాగంగా ఇక్కడ జరిగిన మూడో వన్డేలో మూడు వికెట్లతో మెరిసిన అశ్విన్ ఈ ఘనతను సాధించాడు. మూడో వన్డేకు ముందు 147 వికెట్లతో ఉన్న అశ్విన్.. జాసన్ హోల్డర్, అస్లే నర్స్, కమిన్స్ వికెట్లు తీసి 150 వికెట్ల మార్కును చేరాడు.
శుక్రవారం జరిగిన మూడో వన్డేలో భారత్ జట్టు 93 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. భారత స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, అశ్విన్‌లు విజృంభించడంతో కరీబియన్లు 38.1 ఓవర్లలో 158 పరుగులకే కుప్పకూలిపోయారు. అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 50 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 251 పరుగులు చేసింది. ధోని(78), అజింక్యా రహానేల(71) అర్ధ సెంచరీలకు తోడు జాదవ్(40), యువరాజ్(39)లు రాణించడంతో భారత్ గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది.