
వదిలేశారు...
లంక చేతిలో ఓడిన భారత్
సంగక్కర సూపర్ సెంచరీ
ధావన్ శ్రమ వృథా
ఆసియాకప్
ఆసియాకప్‌లో నేడు
బంగ్లాదేశ్ x అఫ్ఘానిస్థాన్
మ. గం. 1.30 నుంచి
స్టార్‌స్పోర్ట్స్-1లో ప్రత్యక్ష ప్రసారం
చూడటానికి ఓ మాదిరి స్కోరే అయినా... భారత్‌కు మ్యాచ్ గెలిచే అవకాశాలు వచ్చాయి. బౌలర్లు శక్తి మేరకు ప్రయత్నించినా.. మైదానంలో ఫీల్డింగ్ వైఫల్యం కొంప ముంచింది. క్యాచ్‌లు వదిలేయడంతో పాటు సంగక్కరను స్టంపౌట్ చేసే అద్భుతమైన అవకాశాన్ని కార్తీక్ వృథా చేయడంతో భారత్ మ్యాచ్‌ను కూడా వదిలేసుకోవాల్సి వచ్చింది. ఆల్‌రౌండ్ నైపుణ్యంతో ఆకట్టుకున్న లంక ఆసియాకప్ ఫైనల్‌కు చేరువైంది.
ఫతుల్లా: భారత్, లంక మ్యాచ్ అంటే అందరూ కోహ్లి,మలింగల మధ్య పోరుగానే భావించారు. కానీ సీనియర్ ఆటగాడు సంగక్కరను, లంక జట్టులోని స్పిన్నర్లును మరచిపోయారు. ఈ ఏడాది తన కెరీర్‌లోనే అత్యుత్తమ ఫామ్‌లో ఉన్న సంగక్కర (84 బంతుల్లో 103; 12 ఫోర్లు, 1 సిక్సర్) సూపర్ సెంచరీతో ఆసియాకప్‌లో లంకను ఫైనల్‌కు చేరువ చేశాడు. అన్ని రంగాల్లో విఫలమై ఓటమిపాలైన భారత్... పాక్, అఫ్ఘానిస్థాన్‌లతో జరగబోయే మ్యాచ్‌ల్లో కచ్చితంగా గెలవాల్సిన సంకట స్థితిలో పడింది.
ఖాన్ సాహెబ్ ఉస్మాన్ అలీ స్టేడియంలో శుక్రవారం ఉత్కంఠభరితంగా జరిగిన లీగ్ మ్యాచ్‌లో లంక రెండు వికెట్ల తేడాతో భారత్‌పై గెలిచింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 264 పరుగులు చేసింది. ధావన్ (114 బంతుల్లో 94; 7 ఫోర్లు, 1 సిక్సర్) కొద్దిలో సెంచరీ కోల్పోగా... కోహ్లి (51 బంతుల్లో 48; 4 ఫోర్లు, 1 సిక్సర్) ఫర్వాలేదనిపించాడు.
లంక స్పిన్ ద్వయం మెండిస్, సేనానాయకే కలిసి ఏడు వికెట్లు తీసి భారత్ భారీ స్కోరు చేయకుండా నియంత్రించారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన లంక 49.2 ఓవర్లలో 8 వికెట్లకు 265 పరుగులు చేసింది. కుశాల్ పెరీరా (81 బంతుల్లో 64; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించాడు. సంగక్కరకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. భారత్ తన తర్వాతి మ్యాచ్‌లో ఆదివారం పాక్‌తో తలపడుతుంది.
శ్రీలంకతో మ్యాచ్‌ను భారత్ ‘చేజేతులా’ పోగొట్టుకుంది. సాధారణ లక్ష్యాన్ని ఛేదిస్తూ కొన్ని సార్లు లంక తడబాటుకు లోనైనా...చివరకు విజయం వారి పక్షానే నిలిచింది. భారత ఫీల్డింగ్ వైఫల్యాలే అందుకు కారణం. చెత్త ఫీల్డింగ్, సునాయాస క్యాచ్‌లు జారవిడిచి లంక బ్యాట్స్‌మెన్‌కు మన ఆటగాళ్లు అవకాశం ఇచ్చారు. ఒత్తిడి మధ్య ఆడుతున్న ఆ జట్టును కోలుకునేలా చేశారు. నెమ్మదైన ఈ వికెట్‌పై శ్రీలంక బ్యాట్స్‌మన్ పరుగుల కోసం శ్రమిస్తున్న స్థితిలో ఐదు అవకాశాలు వదిలేయడం మ్యాచ్ ఫలితంపై ప్రభావం చూపింది.
జట్టు స్కోరు 13 పరుగుల వద్ద షమీ బౌలింగ్‌లో కుశాల్ పెరీరా భారీ షాట్ ఆడాడు. బాగా ఎత్తున పైకి లేచిన బంతి చాలా సేపు గాల్లోనే ఉంది. పాయింట్ స్థానానికి పరుగెత్తుతూ వచ్చిన ధావన్, రహానే బంతిపైనే దృష్టి ఉంచారు. సమన్వయ లోపంతో ఒకరినొకరు పట్టించుకోకపోవడంతో ఇద్దరూ ఢీ కొన్నారు. బంతి ఎవరికీ అందకుండా సునాయాస క్యాచ్ చేజారింది.
17 పరుగుల వద్ద షమీ బౌలింగ్‌లో తిరిమన్నె కవర్స్‌లో ఇచ్చిన కష్ట సాధ్యమైన క్యాచ్‌ను జడేజా వదిలేశాడు.
86 వద్ద బిన్నీ బౌలింగ్‌లో పెరీరా మిడ్ వికెట్ వైపు ఆడాడు. డీప్‌నుంచి పరుగెత్తుతూ వచ్చిన జడేజా ప్రయత్నించినా.. లిప్త పాటు కాలంలో బంతి చేజారింది.
140 వద్ద జడేజా బౌలింగ్‌లో సంగక్కరను స్టంప్ చేసే సునాయాస అవకాశాన్ని కార్తీక్ వృథా చేశాడు. బంతిని చక్కగా అందుకొని చేతిని ముందుకు తెచ్చినా కార్తీక్ చేయి స్టంప్స్‌ను తాకలేదు. రెండో ప్రయత్నంలో చేసే సరికి సంగ క్రీజ్‌లో ఉన్నాడు.
అప్పుడు అతని స్కోరు 30.
లంక విజయానికి మరో పరుగు కావాల్సిన దశలో తిసార పెరీరా ఇచ్చిన సులభమైన క్యాచ్‌ను ధావన్ వదిలేశాడు. అది పడితే 11వ స్థానం ఆటగాడు క్రీజ్‌లోకి వస్తే ‘టై’ అవకాశం ఉండేదేమో!
ధావన్ సెంచరీ మిస్
ఆరంభంలో లంక బౌలర్లు రాణించడంతో ఓపెనర్ రోహిత్ (28 బంతుల్లో 13; 1 ఫోర్) ఇబ్బందిపడ్డాడు. అయితే ధావన్, కోహ్లితో కలిసి నిలకడగా ఇన్నింగ్స్‌ను నిర్మించాడు. 68 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసిన ధావన్... విరాట్‌తో కలిసి రెండో వికెట్‌కు 97 పరుగులు జోడించాడు. ఈ దశలో మెండిస్...అద్భుతమైన క్యారమ్ బంతితో కోహ్లిని అవుట్ చేశాడు. తర్వాత రహానే (27 బంతుల్లో 22; 1 ఫోర్) కాసేపు పోరాడాడు. 40వ ఓవర్‌లో మెండిస్ నాలుగు బంతుల వ్యవధిలో... సెంచరీ దిశగా సాగుతున్న ధావన్‌తో పాటు, కార్తీక్ (4)ను అవుట్ చేశాడు.
కొద్దిసేపటికే వరుస ఓవర్లలో రాయుడు (18), బిన్నీ (0) వెనుదిరిగారు. దీంతో 26 బంతుల వ్యవధిలో భారత్ నాలుగు వికెట్లు కోల్పోయింది. ఓ దశలో 175/2 ఉన్న స్కోరు 215/7 వద్ద నిలిచింది. రెండో ఎండ్‌లో జడేజా (27 బంతుల్లో 22 నాటౌట్; 1 సిక్సర్) భారీ షాట్లకు ప్రయత్నించినా.. అశ్విన్ (16 బంతుల్లో 18; 2 ఫోర్లు), భువనేశ్వర్ (0) నాలుగు బంతుల వ్యవధిలో అవుటయ్యారు. మెండిస్ 4, సేననాయకే 3 వికెట్లు తీశారు.
కష్టపడిన బౌలర్లు
లంక ఇన్నింగ్స్‌కు ఓపెనర్లు కుశాల్ పెరీరా, తిరిమన్నే (55 బంతుల్లో 38; 4 ఫోర్లు, 1 సిక్సర్) శుభారంభాన్నిచ్చారు. తొలి వికెట్‌కు 80 పరుగులు జోడించాక తిరిమన్నేను అశ్విన్ అవుట్ చేశాడు. ఓ ఎండ్‌లో సంగక్కర పాతుకుపోయినా... భారత బౌలర్లు రెండో ఎండ్‌లో టపటపా వికెట్లు తీశారు. అర్ధసెంచరీతో నిలకడగా ఆడుతున్న కుశాల్ పెరీరా.. అశ్విన్ (27వ ఓవర్) బౌలింగ్‌లో అవుట్ కాగా, 32వ ఓవర్‌లో జడేజా వరుస బంతుల్లో జయవర్ధనే (9), చండిమల్ (0)లను వెనక్కిపంపాడు.
తర్వాత విజృంభించిన షమీ... వరుస ఓవర్లలో మాథ్యూస్ (6), సేననాయకే (12)లకు పెవిలియన్‌కు చేర్చాడు. ఆ వెంటనే డిసిల్వా (9) అవుటైనా... సంగక్కర 3 ఫోర్లు, 1 సిక్సర్ కొట్టి సెంచరీకి చేరువయ్యాడు. చివరకు లంక విజయానికి 12 బంతుల్లో 12 పరుగులు చేయాల్సిన దశలో షమీ వేసిన 49వ ఓవర్ రెండో బంతిని బౌండరీకి తరలించిన సంగ కెరీర్‌లో 18వ సెంచరీ పూర్తి చేశాడు. కానీ తర్వాతి బంతికే అవుటయ్యాడు. మెండిస్ (5 నాటౌట్), పెరీరా కలిసి లాంఛనం పూర్తి చేశారు. షమీ, జడేజా చెరో మూడు వికెట్లు తీశారు.
మంచు వల్ల దెబ్బతిన్నాం: కోహ్లి
మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ సమయంలో తీవ్రమైన మంచు కారణంగానే దెబ్బతిన్నామని భారత కెప్టెన్ కోహ్లి వ్యాఖ్యానించాడు. ‘గురువారం ఈ స్థాయిలో మంచు కురవలేదు. శుక్రవారం రాత్రి ముఖ్యంగా మ్యాచ్ ఆఖరి దశలో విపరీతంగా మంచు కురిసింది. ఇది ఫీల్డింగ్‌పై ప్రభావం చూపింది’ అని కోహ్లి చెప్పాడు. బౌలర్లు రాణించారని ప్రశంసించాడు. ‘మేం మరో 25-30 పరుగులు చేసి ఉంటే బాగుండేది. అయినా బౌలర్లు తమ కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వర్తించారు. మ్యాచ్‌ను చివరి ఓవర్ వరకూ తీసుకొచ్చారు. ముఖ్యంగా జడేజా అద్భుతంగా బౌలింగ్ చేశాడు’ అని కెప్టెన్ చెప్పాడు. పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో తమ లోపాలను సరిదిద్దుకుని బరిలోకి దిగుతామని చెప్పాడు.
స్కోరు వివరాలు
భారత్ ఇన్నింగ్స్: రోహిత్ ఎల్బీడబ్ల్యు (బి) సేననాయకే 13; ధావన్ (బి) మెండిస్ 94; కోహ్లి (బి) మెండిస్ 48; రహానే (సి) తిరిమన్నే (బి) సేననాయకే 22; రాయుడు (సి) కుశాల్ పెరీరా (బి) డిసిల్వా 18; కార్తీక్ (సి) డిసిల్వా (బి) మెండిస్ 4; జడేజా నాటౌట్ 22; బిన్నీ ఎల్బీడబ్ల్యు (బి) సేననాయకే 0; అశ్విన్ (బి) మలింగ 18; భువనేశ్వర్ (స్టంప్డ్) సంగక్కర (బి) మెండిస్ 0; షమీ నాటౌట్ 14; ఎక్స్‌ట్రాలు: 11; మొత్తం: (50 ఓవర్లలో 9 వికెట్లకు) 264.
వికెట్ల పతనం: 1-33; 2-130; 3-175; 4-196; 5-200; 6-214; 7-215; 8-245; 9-247
బౌలింగ్: మలింగ 10-0-58-1; మాథ్యూస్ 3.2-1-9-0; సేననాయకే 10-0-41-3; తిసారా పెరీరా 6.4-0-40-0; మెండిస్ 10-0-60-4; డిసిల్వా 10-0-51-1
శ్రీలంక ఇన్నింగ్స్: కుశాల్ పెరీరా (సి) కార్తీక్ (బి) అశ్విన్ 64; తిరిమన్నే ఎల్బీడబ్ల్యు (బి) అశ్విన్ 38; సంగక్కర (సి) అశ్విన్ (బి) షమీ 103; జయవర్ధనే (సి) రోహిత్ (బి) జడేజా 9; చండిమల్ (బి) జడేజా 0; మాథ్యూస్ ఎల్బీడబ్ల్యు (బి) షమీ 6; సేననాయకే (సి) రోహిత్ (బి) షమీ 12; డిసిల్వా ఎల్బీడబ్ల్యు (బి) జడేజా 9; పెరీరా నాటౌట్ 11; మెండిస్ నాటౌట్ 5; ఎక్స్‌ట్రాలు: 8; మొత్తం: (49.2 ఓవర్లలో 8 వికెట్లకు) 265.
వికెట్ల పతనం: 1-80; 2-134; 3-148; 4-148; 5-165; 6-183; 7-216; 8-258
బౌలింగ్: భువనేశ్వర్ 9.2-1-45-0; షమీ 10-0-81-3; అశ్విన్ 10-0-42-2; బిన్నీ 4-0-22-0; జడేజా 10-1-30-3; రాయుడు 1-0-9-0; రోహిత్ 5-0-29-0
సంగక్కర కెరీర్‌లో ఇది 18వ వన్డే సెంచరీ వన్డేల్లో భారత్‌పైనే 4 వేలకు పైగా పరుగులు పూర్తి చేసిన మూడో ఆటగాడు సంగక్కర (పాంటింగ్, జయవర్ధనే తర్వాత)అశ్విన్ వన్డేల్లో 100 వికెట్లు పూర్తి చేసుకున్నాడు.
అతను ఈ ఘనత సాధించిన 17వ భారత బౌలర్. ఒక్క బంతి కూడా ఎదుర్కోకుండానే స్టంపౌట్ (డైమండ్ డక్) అయిన రెండో ఆటగాడు భువనేశ్వర్. గతంలో ఒసిండే (కెనడా) ఇలా అవుటయ్యాడు. (ఒక్క బంతి కూడా ఆడకుండా అవుటైతే డైమండ్ డక్ అంటారు. వైడ్ బంతికి భువనేశ్వర్ అవుటయ్యాడు).