ఢాకా: గురి తప్పని లక్ష్యంతో రాణించిన భారత ఆర్చర్లు అభిషేక్ వర్మ, వెన్నం జ్యోతి సురేఖ ఆసియా ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో వరుసగా స్వర్ణ, కాంస్య పతకాలు సాధించారు. బుధవారం జరిగిన పోటీల్లో ఢిల్లీకి చెందిన అభిషేక్ వర్మ పురుషుల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో చాంపియన్‌గా అవతరించగా... ఆంధ్రప్రదేశ్ అమ్మాయి జ్యోతి సురేఖ మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో మూడో స్థానంలో నిలిచింది. కిమ్ జాంగ్‌హో (దక్షిణ కొరియా)తో జరిగిన ఫైనల్లో అభిషేక్ వర్మ ‘షూట్ ఆఫ్’లో విజయం సాధించాడు. ఇద్దరికీ ఐదు రౌండ్‌లలో నాలుగు చొప్పున బాణాలు సంధించే అవకాశం ఇచ్చారు. ఐదు రౌండ్‌ల తర్వాత స్కోరు 147–147తో సమఉజ్జీగా నిలిచింది. ఈ దశలో విజేతను నిర్ణయించేందుకు ఇద్దరికీ ఒక్కో అవకాశం ఇచ్చారు. ఇద్దరూ కొట్టిన షాట్ 10 పాయింట్ల వృత్తంలోకి వెళ్లింది. అయితే కిమ్ జాంగ్‌హో సంధించిన బాణంతో పోలిస్తే అభిషేక్ వర్మ సంధించిన బాణం ‘బుల్స్ ఐ’కు అతి సమీపంలో ఉండటంతో భారత ఆర్చర్‌ను విజేతగా ప్రకటించారు.
కాంస్య పతకం కోసం జరిగిన మ్యాచ్‌లో భారత ఆర్చర్ గుర్విందర్ సింగ్ 145–148తో సంగ్ హో హాంగ్ (కొరియా) చేతిలో ఓడిపోయాడు. సెమీస్‌లో అభిషేక్ 149–146తో సంగ్ హో హాంగ్ (దక్షిణ కొరియా)పై, క్వార్టర్ ఫైనల్లో 148–141తో అబుల్ ఖాషిమ్ మామున్ (బంగ్లాదేశ్)పై, మూడో రౌండ్‌లో 146–145తో ఇస్మాయిల్ ఇబాది (ఇరాన్)పై, రెండో రౌండ్‌లో 149–141తో థు రైన్ జిన్ (మయన్మార్)పై గెలిచాడు. మహిళల కాంపౌండ్ వ్యక్తిగత కాంస్య పతక పోరులో జ్యోతి సురేఖ 146–142తో వు టింగ్ టింగ్ (చైనీస్ తైపీ)పై విజయం సాధించింది. అంతకుముందు సెమీస్‌లో జ్యోతి సురేఖ 138–144తో చోయ్ బోమిన్ (కొరియా) చేతిలో ఓడిపోయి కాంస్య పతక మ్యాచ్‌కు అర్హత సాధించింది. ఈ పోటీల్లో అభిషేక్ వర్మ, జ్యోతి సురేఖలకు ఇది రెండో పతకం. ఈ ఇద్దరూ జోడీగా బరిలోకి దిగి మిక్స్‌డ్ కాంపౌండ్ విభాగంలో స్వర్ణం గెలిచిన సంగతి విదితమే.
ఫైనల్లో ధీరజ్
మరోవైపు ఆసియా చాంపియన్‌షిప్‌తోపాటు నిర్వహిస్తున్న యూత్ ఒలింపిక్స్ ఆసియా కాంటినెంటల్ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ ఫైనల్‌కు చేరాడు. బుధవారం జరిగిన సెమీస్‌లో 16 ఏళ్ల ధీరజ్ 6–2తో సూరజ్ (భారత్)పై గెలిచాడు. చెరుకూరి ఓల్గా ఆర్చరీ అకాడమీ (విజయవాడ)కి చెందిన ధీరజ్ గురువారం జరిగే రికర్వ్ వ్యక్తిగత విభాగంలో స్వర్ణం కోసం భారత్‌కే చెందిన ఆకాశ్‌తో తలపడతాడు.
Comments
Please login to add a commentAdd a comment